2910 పోస్టులు!

ABN , First Publish Date - 2022-08-31T08:09:39+05:30 IST

ఉద్యోగార్థులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న గ్రూప్‌-2, గ్రూప్‌-3 పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.

2910 పోస్టులు!

గ్రూప్‌-2, 3 కొలువుల భర్తీకి సర్కారు పచ్చజెండా


గ్రూప్‌-2 కింద 663, గ్రూప్‌-3 కింద 1,373 ఉద్యోగాలు

మిగతా విభాగాధిపతుల కింద మరో 874 కొలువుల భర్తీ

అనుమతించిన మొత్తం పోస్టుల సంఖ్య 52,460కు చేరిక

ఇంకా అనుమతించాల్సిన పోస్టులు 27,579


హైదరాబాద్‌, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగార్థులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న గ్రూప్‌-2, గ్రూప్‌-3 పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. గ్రూప్‌-2 కింద 663 పోస్టులు, గ్రూప్‌-3 కింద 1,373 పోస్టులను భర్తీ చేయడానికి టీఎ్‌సపీఎస్సీ అనుమతిచ్చింది. వీటితో పాటు వివిధ విభాగాధిపతుల కింద మరో 874 పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చింది. మొత్తం కలిపి 2,910 పోస్టులు. రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు వీటికి సంబంధించి వేర్వేరు జీవోలను జారీ చేశారు. ఈ పోస్టులతో కలిపి.. ఇప్పటివరకూ ప్రభుత్వం అనుమతించిన పోస్టుల సంఖ్య 52,460కి చేరింది. రాష్ట్రప్రభుత్వం మొత్తం 80,039 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా అనుమతించినవి పోగా.. మరో 27,579 పోస్టులకు అనుమతులు రావాల్సి ఉంది.  


గ్రూపు-2 కింద..

అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ డెవల్‌పమెంట్‌ ఆఫీసర్‌(హ్యాండ్లూమ్‌), అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌, మునిసిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌-3, పంచాయతీరాజ్‌ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌, మండల పంచాయతీ ఆఫీసర్‌,  డిప్యూటీ తహసిల్దార్‌, అసిస్టెంట్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌, సబ్‌ రిజిస్ట్రార్‌ గ్రేడ్‌-2, ఎక్సైజ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులున్నాయి.


గ్రూపు-3 కింద.. 

ఆర్థిక శాఖలో 712, ఉన్నత విద్యా శాఖలో 89, రెవెన్యూ శాఖలో 73, హోం శాఖలో 70, పాఠశాల విద్యలో 65, సాధారణ పరిపాలన శాఖలో 46, వ్యవసాయం, వైద్య ఆరోగ్య శాఖలో 39, ఎస్సీల అభివృద్ధి శాఖలో 36, కార్మిక ఉపాధి కల్పనా శాఖలో 33, పంచాయతీరాజ్‌-గ్రామీణాభివృద్ధి శాఖ కింద 29, సహకార శాఖలో 27, వెనుకబడిన తరగతుల శాఖలో 27, పరిశ్రమలు-వాణిజ్యంలో 25, గిరిజన సంక్షేమంలో 20, పురపాలక-పట్టణాభివృద్ధి శాఖలో 18, పౌరసరఫరాల శాఖలో 16, రోడ్లు, రవాణా శాఖలో 12, అటవీ శాఖలో 7, అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖలో 6, యువజన సర్వీసులు, పర్యాటకం, సాంస్కృతిక శాఖలో 5 చొప్పున, మహిళా శిశు సంక్షేమ శాఖ, ప్రణాళిక శాఖలో 3 చొప్పున, విద్యుత్తు శాఖలో 2,  సాగునీటి పారుదల శాఖలో 1 చొప్పున పోస్టులు ఉన్నాయి. విభాగాధిపతుల కింద.. వ్యవసాయ కమిషనరేట్‌ కింద 347, వెటర్నరీ డైరెక్టరేట్‌ కింద 294, అగ్రికల్చర్‌ కో-ఆపరేటివ్‌ రిజిస్ట్రార్‌ కింద 99, వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ కింద గల గిడ్డంగుల కార్పొరేషన్‌లో 50, వ్యవసాయ శాఖలోని తెలంగాణ సీడ్‌ ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌ అథారిటీ కింద 25,  ఉద్యానవన డైరెక్టరేట్‌ కింద 21, పశు సంవర్థక శాఖ కింద 15, వ్యవసాయ మార్కెటింగ్‌ డైరెక్టరేట్‌ కింద 12, విద్యుత్తు శాఖలోని చీఫ్‌ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టరేట్‌ కింద 11 పోస్టులున్నాయి. 

Updated Date - 2022-08-31T08:09:39+05:30 IST