వరద బాధిత జిల్లాల్లో.. 24 గంటలూ వైద్యసేవలు

ABN , First Publish Date - 2022-07-18T09:12:05+05:30 IST

వరద బాధిత జిల్లాల్లో.. 24 గంటలూ వైద్యసేవలు

వరద బాధిత జిల్లాల్లో.. 24 గంటలూ వైద్యసేవలు

8 జిల్లాలో 289 హెల్త్‌ క్యాంపులు.. 11 వేల మందికి చికిత్స

భద్రాద్రిలోనే 6,619 మందికి: డీహెచ్‌

అంటువ్యాధులపై అప్రమత్తం: హరీశ్‌


హైదరాబాద్‌, జూలై 17 (ఆంధ్రజ్యోతి): వరద ప్రభావిత జిల్లాల్లో 24 గంటల పాటు పనిచేసేలా ప్రభుత్వం వైద్య శిబిరాలను ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 8 జిల్లాల్లో మొత్తం 289 వైద్య శిబిరాల్లో ఆదివారం ఒక్కరోజే 11 వేల మందికి చికిత్సలు అందజేసింది. గడిచిన రెండు రోజుల్లో  24,674 మందికి వైద్య సేవలు అందించారు. సీఎం కేసీఆర్‌, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశాలతో బాధితులకు వేగంగా వైద్య సేవలందిస్తున్నట్లు ప్రజా ఆరోగ్య సంచాలకులు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆదివారం బులెటిన్‌ను విడుదల చేశారు.   తీవ్ర జ్వరం, తలనొప్పి, నీరసం, కళ్లు ఎర్రబడటం, డయేరియా, ఆకలి మందగించడం వంటి లక్షణాలుంటే వెంటనే  సమీపంలోని హెల్త్‌ క్యాంపులకు రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్రస్థాయిలో వార్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ప్రజలు ఎలాంటి సమస్యలు వచ్చిన వచ్చినా 24 గంటలు పాటు పనిచేసే హెల్ప్‌లైన్‌ నంబర్లు 9030227324, 040-24651119కు కాల్‌ చేయాలని సూచించారు. అలాగే అన్ని జిల్లాల్లో ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌లను రంగంలోకి దించినట్లు వెల్లడించారు. సర్కారీ దవాఖానాల్లో ఎపిడమిక్‌ మెడిసిన్స్‌, ఐవీ ప్లూయిడ్స్‌ను అందుబాటులో ఉంచినట్లు వివరించారు.


రంగంలోకి హెల్త్‌ డైరెక్టర్‌, డీఎంఈ 

వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య సేవల పర్యవేక్షణపై డీహెచ్‌ గడల శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్‌రెడ్డిని ప్రభుత్వం నోడల్‌ అధికారులుగా నియమించిన సంగతి తెలిసిందే. శనివారం రాత్రే గడల కొత్తగూడెం చేరుకున్నారు. ఆ ప్రాంతంలో మొత్తం 52 టీమ్‌లను రంగంలోకి దించారు. 


అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు:  ట్విటర్‌లో హరీశ్‌

వరద ప్రభావిత ప్రాంతాల్లో గాలి, నీటి ద్వారా అంటువ్యాధులు ప్రబలకుండా నివారణ చర్యలు తీసుకున్నట్లు వైద్య మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ఆదివారం ఆయన వైద్యశాఖ నిర్వహిస్తున్న వైద్య శిబిరాల ఫొటోలను ట్విటర్‌లో పోస్టు చేశారు.

Updated Date - 2022-07-18T09:12:05+05:30 IST