2008 డీఎస్సీ బీఎడ్‌ అభ్యర్థులకు ఊరట

ABN , First Publish Date - 2022-09-30T08:03:00+05:30 IST

సుదీర్ఘకాలంగా న్యాయస్థానంలో నలుగుతున్న 2008 డీఎస్సీ వివాదానికి హైకోర్టు ముగింపు పలికింది.

2008 డీఎస్సీ బీఎడ్‌ అభ్యర్థులకు ఊరట

  • డీఎడ్‌ కోటాలో మిగిలిపోయిన పోస్టులు బీఎడ్‌లకే..
  • డీఎడ్‌ అభ్యర్థులు 12ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకున్నారు
  • అందువల్ల కోటా చట్టబద్ధత జోలికి వెళ్లడం లేదు
  • సుదీర్ఘ వాదనల తర్వాత హైకోర్టు తీర్పు

హైదరాబాద్‌, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): సుదీర్ఘకాలంగా న్యాయస్థానంలో నలుగుతున్న 2008 డీఎస్సీ వివాదానికి హైకోర్టు ముగింపు పలికింది. 2008 డీఎస్సీలో డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్‌ (డీఎడ్‌) అభ్యర్థులకు రిజర్వు చేసిన 30 శాతం కోటాలో మిగిలిపోయిన పోస్టులను బీఎడ్‌ అభ్యర్థులతో భర్తీ చే యాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. నాటి డీఎస్సీలో అర్హత సాధించి, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ పూర్తయినా పోస్టులు దక్కని బీఎడ్‌ అభ్యర్థులను ఈ పోస్టులకు పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. దీంతో సుదీర్ఘకాలంగా కోర్టులో పోరాడుతున్న బీఎడ్‌ అభ్యర్థులకు ఊరట లభించినట్లయింది. 2008లో అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 52,655 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్‌ జారీచేసింది. ఇందులో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ) పోస్టులు 30,558 ఉన్నాయి. మొత్తం ఎస్జీటీ  పోస్టులకు బీఎడ్‌ అభ్యర్థులు కూడా అర్హులేన ని ప్రభుత్వం తొలుత నోటిఫికేషన్‌లో పేర్కొంది. తర్వాత డీఎడ్‌ అభ్యర్థుల విజ్ఞప్తితో ఎస్జీటీ పోస్టుల్లో 30 శాతం... అంటే దాదాపు 10,200 పోస్టులను కేవ లం డీఎడ్‌ అభ్యర్థులకు రిజర్వు చేస్తూ జీవో జారీచేసింది. అయితే ఈ జీవోను సవాల్‌ చేస్తూ బీఎడ్‌ అ భ్యర్థులు అడ్మినిస్ర్టేటివ్‌ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. ట్రైబ్యునల్‌ బీఎడ్‌ అభ్యర్థులకు వ్యతిరేకంగా తీర్పు ఇ వ్వడంతో వారు హైకోర్టుకు వెళ్లారు. కొంతమంది బీ ఎడ్‌ అభ్యర్థులు సుప్రీంకోర్టుకు వెళ్లగా.. 


ఈ వివాదం లో జోక్యం చేసుకోవడానికి సుప్రీం నిరాకరించింది. ఈ వివాదాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టంచేసింది. దీంతో 2009 నుంచి ఈ కేసు హైకోర్టులో పెం డింగ్‌లో ఉంది. తాజాగా ఈ వివాదంపై జస్టిస్‌ అభినందన్‌కుమార్‌ షావిలి, జస్టిస్‌ కె.శరత్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు ఎల్‌.రవిచందర్‌, బొబ్బిలి శ్రీనివాస్‌, జి.విద్యాసాగర్‌ వాదనలు వినిపిస్తూ... డీఎస్సీలో అర్హత సాధించినప్పటికీ బీఎడ్‌ అభ్యర్థులు దశాబ్దానికిపైగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. నోటిఫికేషన్‌ ఇచ్చి నియామక ప్రక్రియ కూడా ప్రారంభమైన తర్వాత పోస్టులను రిజర్వ్‌ చేస్తూ జీవో ఇవ్వడం చట్ట విరుద్ధమని తెలిపారు. డీఎడ్‌ అర్హత మాత్రమే అవసరమైన ఎస్జీటీ పోస్టులకు.. అంతకం టే ఎక్కువ అర్హత కలిగిన అభ్యర్థులను పోటీపడకుం డా నిరోధించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ.. 2008 నోటిఫికేషన్‌ను అనుసరించి తెలంగాణలో సుమారు 2వేల ఎస్జీటీ పోస్టులు భర్తీ కాకుండా ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఏపీ ప్రభు త్వ ప్రత్యేక న్యాయవాది గోవింద్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ... డీఎడ్‌ అభ్యర్థులకు కోటా వల్ల నష్టపోయిన బీఎడ్‌లకు కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు కల్పించిందని పేర్కొన్నారు. అన్ని వర్గాల వాదనలను నమోదు చేసుకున్న ధర్మాసనం.. డీఎడ్‌ అభ్యర్థులకు 30 శాతం కోటా ఇవ్వడం చట్టబద్ధమా కాదా అనే వివాదంలోకి తాము వెళ్లడం లేదని పేర్కొంది. వారందరూ ఇప్పటికే దాదాపు 12 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నారని తెలిపింది. అయితే ఆ 30 శాతం కోటాలో మిగిలిపోయిన పోస్టులను అర్హులైన బీఎడ్‌ అభ్యర్థులకు మెరిట్‌ ప్రకారం ఇవ్వాలని స్పష్టం చేస్తూ తుది తీర్పు జారీచేసింది. అలాగే ఏపీలో ఇప్పటికే కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న బీఎడ్‌ అభ్యర్థుల ఉద్యోగాలను రెగ్యులరైజ్‌ చేయాలని పేర్కొంది.

Updated Date - 2022-09-30T08:03:00+05:30 IST