200 గూగుల్‌పే చేసి హత్య!

ABN , First Publish Date - 2022-10-14T09:08:01+05:30 IST

యువతితో ప్రేమ వ్యవహారం ఆ యువకుడి ప్రాణాలు తీసింది.

200 గూగుల్‌పే చేసి హత్య!

యువకుడి మిస్సింగ్‌ విషాదాంతం

యువతితో ప్రేమ వ్యవహారంపై ఆమె కుటుంబసభ్యుల ఆగ్రహం

చార్జీలకు డబ్బిచ్చి పిలిపించి హత్య

పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు


పటాన్‌చెరు, అక్టోబరు 13: యువతితో ప్రేమ వ్యవహారం ఆ యువకుడి ప్రాణాలు తీసింది. తమ అమ్మాయితో ప్రేమాయణం నడపడాన్ని సహించలేకపోయిన ఆమె తరఫువారు, అతడికి ఫోన్‌ చేసి మాయమాటలు చెప్పి.. చార్జీలకు డబ్బును గూగుల్‌ పే చేసి మరీ  తమ వద్దకు రప్పించుకొని హత్యచేశారు. హైదరాబాద్‌ ముషీరాబాద్‌లో ఈ ఘోరం జరిగింది.  ఈ మేరకు ఆరు రోజుల నుంచి కనిపించకుండా పోయిన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరుకు చెందిన శివకుమార్‌ (18) కథ విషాదాంతమైంది. నాగర్‌కర్నూల్‌ జిల్లా కోడేరుకు చెందిన బాలస్వామి ఉపాధి కోసం కుటుంబంతో కలిసి పటాన్‌చెరులో ఉంటున్నాడు. ఆయన  కుమారుడు శివకుమార్‌ కూలీ పనికి వెళ్తాడు. శివకుమార్‌కు ముషీరాబాద్‌కు చెందిన యువతితో పరిచయం ఏర్పడి ప్రేమకు దారితీసింది. తరచూ శివకుమార్‌ ముషీరాబాద్‌కు వెళ్లి ఆమెను కలిసేవాడు. ఇది యువతి కుటుంబ సభ్యులకు తెలియడంతో శివకుమార్‌ను చంపేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 7న మధ్యాహ్నం పథకం ప్రకారం యువతితో ఫోన్‌ చేయించారు. ఆమె, శివకుమార్‌ను ముషీరాబాద్‌కు రావాలని పదేపదే కోరింది. యువతి కుటుంబ సభ్యులు కూడా అదే ఫోన్‌ ద్వారా శివకుమార్‌ను ఒక్కసారి వచ్చి మాట్లాడి వెళ్లాల్సిందిగా నమ్మబలికారు. తన వద్ద డబ్బులు లేవని అతడు చెప్పగా యువతి ఫోన్‌ నుంచి రూ.200 గూగుల్‌ పే చేశారు.


శివకుమార్‌ అదేరోజు సాయంత్రం ముషీరాబాద్‌కు వెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళన చెందిన తల్లి, శివకుమార్‌కు ఫోన్‌ చేసింది. తాను ముషీరాబాద్‌లో ఉన్న యువతి వద్దకు వచ్చానని అతడు చెబుతుండగానే కొందరు శివకుమార్‌ సెల్‌ఫోన్‌ను బలవంతంగా లాక్కొని స్విచ్చాఫ్‌ చేశారు. ఆ తర్వాత శివకుమార్‌ ఇంటికి రాలేదు. మరుసటి రోజు శివకుమార్‌ తల్లిదండ్రులు యువతి కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి తన కొడుకు ఆచూకీ చెప్పాలని ప్రాధేయపడ్డారు. తమ వద్దకు రాలేదని వారు నిర్లక్ష్యంగా సమాధానమివ్వడంతో  పటాన్‌చెరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.  యువతి కుటుంబసభ్యుల్లో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా శివకుమార్‌ హత్యకు గురైనట్లు తేలింది. యువతీయువకులు వేర్వేరు కులాలకు చెందిన వారు కావడంతో అదృశ్యమైన రోజే శివకుమార్‌ను దారుణంగా హత్య చేసి ముషీరాబాద్‌ పరిసరాల్లోని నాలాలో పడేసినట్లు నిందితులు వెల్లడించినట్లు తెలిసింది. శివకుమార్‌ మృతదేహం కోసం గాలిస్తున్నామని సీఐ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. 

Updated Date - 2022-10-14T09:08:01+05:30 IST