మరో 2 రోజులు భారీ వర్షాలు

ABN , First Publish Date - 2022-07-13T10:02:20+05:30 IST

దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం మంగళవారం తీవ్ర అల్పపీడనంగా మారి బలపడినట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది ఒడిశా తీర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది.

మరో 2 రోజులు భారీ వర్షాలు

హైదరాబాద్‌, జూలై 12 (ఆంధ్రజ్యోతి) : దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం మంగళవారం తీవ్ర అల్పపీడనంగా మారి బలపడినట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది ఒడిశా తీర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది. ఇందుకు అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉందని తెలిపింది. దీంతో తెలంగాణలో బుధ, గురువారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక మంగళవారం కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని కెరమెరిలో అత్యధికంగా 188.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరులో 175, జైనూరులో 163, ఇంద్రవెల్లిలో 127, మామడలో 122, పెంబిలో 121, లింగాపూర్‌లో 121, ఆసిఫాబాద్‌లో 116, నేరడిగొండలో 115 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. బుధవారం ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అలాగే మరో 12 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ ఇచ్చింది. గురువారం కూడా ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, నిర్మల్‌, జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, సిరిసిల్ల, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది.  


షీర్‌ జోన్‌తోనే కుంభవృష్టి

తూర్పున బంగాళాఖాతం నుంచి పడమర అరేబియా సముద్రం మధ్య విస్తరించిన షీర్‌ జోన్‌ వల్లే వారం రోజులుగా దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. షీర్‌ జోన్‌ వారం రోజులుగా 19 నుంచి 20 డిగ్రీల అక్షాంశాల మధ్యే (ఉత్తర కోస్తా నుంచి ఒడిసాలో భువనేశ్వర్‌ మధ్య) ఉండిపోయింది. అదే సమయంలో రుతుపవనాల ద్రోణి తూర్పు భాగం ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిసాల మీదుగా కొనసాగుతోంది.  ఒడిసా, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తర తెలంగాణ, విదర్భ, మధ్య మహారాష్ట్రలో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవన ద్రోణి ఉత్తరాదికి వెళ్లేందుకు మరో మూడు, నాలుగు రోజులు పడుతుందని, అప్పటిదాకా మధ్య, దక్షిణ, పశ్చిమ భారతాల్లో వర్షాలు కురుస్తాయని నిపుణులు వెల్లడించారు. 

Read more