రాష్ట్రంలో 14 శాతం మందికి బీపీ

ABN , First Publish Date - 2022-05-18T08:24:32+05:30 IST

రాష్ట్రంలో రక్తపోటు (బీపీ) బాధితులు రోజురోజుకు పెరుగుతున్నారు. కొవిడ్‌కు ముందు తెలంగాణ జనాభాలో 12 శాతం మందికే బీపీ ఉండగా, ఇప్పుడా సంఖ్య 14.4 శాతానికి పెరిగింది.

రాష్ట్రంలో 14 శాతం మందికి  బీపీ

  • 90 లక్షల మందికి పరీక్ష చేస్తే.. 13 లక్షల మందిలో గుర్తింపు 
  • 5.94 లక్షల మందిలో మధుమేహం.. సర్కారుకు వైద్యశాఖ నివేదిక 
  • గ్రేటర్‌ హైదరాబాద్‌లో 5 వేల మందిపై సీఎ్‌సఐ అధ్యయనం
  • 40.7ు మందికి హైపర్‌ టెన్షన్‌.. సర్వే నివేదికను విడుదల చేసిన హరీశ్‌
  • చాలామంది వైద్య అధ్యాపకుల్లో హార్ట్‌బీట్‌ 90కిపైనే: టీటీజీడీఏ


హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, మే 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రక్తపోటు (బీపీ) బాధితులు రోజురోజుకు పెరుగుతున్నారు. కొవిడ్‌కు ముందు తెలంగాణ జనాభాలో 12 శాతం మందికే బీపీ ఉండగా, ఇప్పుడా సంఖ్య 14.4 శాతానికి పెరిగింది. ప్రభుత్వం నిర్వహించిన అసంక్రమిత వ్యాధుల నిర్ధారణ పరీక్షల (ఎన్‌సీడీ స్ర్కీనింగ్‌)లో ఈవిషయం వెల్లడైంది. ఈమేరకు వివరాలతో కూడిన నివేదికను మంగళవారం (మే 17న) ‘ప్రపంచ రక్తపోటు దినోత్సవం’ సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి సమర్పించింది. రాష్ట్రంలో 30 ఏళ్లు పైబడిన వారికి వైద్య ఆరోగ్యశాఖ ఎన్‌సీడీ స్ర్కీనింగ్‌ చేస్తోంది. ఆ వివరాలను ‘కాంప్రహెన్సివ్‌ ప్రైమరీ హెల్త్‌ కేర్‌’ (సీపీహెచ్‌సీ) పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. ఎన్‌సీడీ కోసం తెలంగాణలో ఇప్పటివరకు 1.05 కోట్ల మంది తమతమ వివరాలను ఎన్‌రోల్‌ చేసుకున్నారు. వారిలో 90 లక్షలమందికి ఇప్పటివరకు స్ర్కీనింగ్‌ పూర్తయింది. ఇందులో 12.96 లక్షల (14.4 శాతం) మంది అధిక రక్తపోటు (హైపర్‌ టెన్షన్‌)తో బాధపడుతుండగా, 5.94 లక్షల (6.6 శాతం) మంది షుగర్‌ వ్యాధిగ్రస్తులున్నట్లు తేలింది. బీపీ, షుగర్‌ బాధితుల కోసం సర్కారు ప్రత్యేకంగా ఎన్‌సీడీ క్లినిక్‌లను ఏర్పాటు చేస్తోంది. మొత్తం 26 జిల్లాస్థాయి ఎన్‌సీడీ క్లినిక్‌లు, 54 సీహెచ్‌సీ ఎన్‌సీడీ క్లినిక్‌లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం 47 సీహెచ్‌సీ ఎన్‌సీడీ క్లినిక్‌లు పనిచేస్తున్నాయి.


గ్రేటర్‌ హైదరాబాద్‌లోనూ అధిక రక్తపోటు ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. నగర జనాభాలోని 40 శాతం మందికిపైగా హైపర్‌ టెన్షన్‌తో బాధపడుతున్నారు. కార్డియోలాజికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా (సీఎ్‌సఐ) తెలంగాణ విభాగం, గ్లెనీగల్స్‌ గ్లోబల్‌ ఆస్పత్రి సంయుక్తంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో ఈ నెల 1 నుంచి 10 వరకు నిర్వహించిన అధ్యయనంలో ఈవిషయం వెల్లడైంది. ‘ఎంట్రింగ్‌ రిజిష్టల్స్‌’ పేరిట రూపొందించిన ఆ నివేదికను ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు మంగళవారం తాజ్‌దక్కన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆవిష్కరించారు. మన దేశంలో ఎన్‌సీడీ స్ర్కీనింగ్‌లో తెలంగాణ 3వ స్థానంలో ఉందని ఆయన తెలిపారు. వచ్చే మూడు,నాలుగు నెలల్లో మొత్తం స్ర్కీనింగ్‌ ప్రక్రియను పూర్తి చేసి దేశంలోనే మొదటి స్థానంలోకి తీసుకొస్తామన్నారు. ఎన్‌సీడీ స్ర్కీనింగ్‌ల నిర్వహణ కోసం రూ.33 కోట్ల నిధులు కేటాయించినట్లు చెప్పారు. పిల్లల కిడ్నీ సమస్యలపై దృష్టిపెడతామని.. నగరం మొత్తం అధ్యయనం చేసి పరిస్థితిని తెలుసుకుంటామన్నారు. సీఎ్‌సఐ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వే ఫలితాలు ఆశ్చర్యం, బాధను కలిగించాయని పేర్కొన్నారు. 


సీఎస్‌ఐ సర్వేలో.. 

కార్డియోలాజికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా (సీఎస్‌ఐ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని బస్సు స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, పార్కులు, మాల్స్‌లలో సర్వే నిర్వహించారు. ఇప్పటివరకు ఈ సర్వేలో పాల్గొన్న 5 వేల మందికి పరీక్షలు చేయగా, 40.7  శాతం మందికి హైపర్‌టెన్షన్‌ ఉన్నట్లు తేలింది. గతంలో నగరం పరిధిలో 25 శాతం మంది అధిక రక్తపోటు బాధితులు ఉండగా, ఆ సంఖ్య ఇప్పుడు 40.7 శాతానికి పెరిగినట్లు గుర్తించారు. మరో 39.8 శాతం మందిలో ప్రీ హైపర్‌ టెన్షన్‌ ఉన్నట్లు సీఎ్‌సఐ తెలిపింది. సర్వేలో పాల్గొన్నవారు తీసుకుంటున్న ఆహార వివరాలనూ సేకరించి విశ్లేషించారు. దీని ప్రకారం 75 శాతం మంది సరైన ఆహారం తీసుకోవడం లేదని, అనారోగ్యకరమైన ఆహారానికి అలవాటు పడ్డారని తేలింది. మంచి ఆహారాన్ని కేవలం 21.1 శాతం మందే తీసుకుంటున్నారని నివేదిక పేర్కొంది. సర్వేలో పాల్గొన్నవారిలో 70.8 శాతం మంది ఊబకాయులే కావడం గమనార్హం. కొవిడ్‌-19 తర్వాత ప్రజల ఆరోగ్యాలపై పడిన ప్రభావాలను అంచనా వేయడానికి ఈ సర్వే చేశామని సీఎ్‌సఐ తెలంగాణ చాప్టర్‌ ప్రకటించింది. సర్వేలో పాల్గొన్న వారిలో 90 శాతం మందికిపైగా గతంలో కొవిడ్‌తో బాధపడిన వారేనని తెలిపింది. హైపర్‌టెన్షన్‌ ఉన్నట్లు గుర్తించిన 40 శాతం మందిలో అత్యధికులు 40 ఏళ్లలోపు వయసు వారేనని సీఎ్‌సఐ తెలంగాణ చాప్టర్‌ సంయుక్త కార్యదర్శి డాక్టర్‌ సాయి సుధాకర్‌ చెప్పారు.

Read more