హరిత నగరంగా 111 జీవో ఏరియా

ABN , First Publish Date - 2022-09-25T09:02:18+05:30 IST

‘‘111 జీవో ఏరియాను హరిత నగరంగా తీర్చిదిద్దుతాం. హైదరాబాద్‌ నగరం 575 చ.కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండగా, 111 జీవో ఏరియా ద్వారా మరో 500 చ.కిలోమీటర్లు రాబోతోంది.

హరిత నగరంగా 111 జీవో ఏరియా

 • జంట జలాశయాలు దెబ్బతినకుండా ప్రపంచ స్థాయి ప్రణాళిక
 • మధ్య తరగతి వారి కోసం మోడల్‌ లే అవుట్‌ కాలనీలు..
 •  18 నెలల్లో మహా మాస్టర్‌ ప్లాన్‌
 • రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ వే
 • 9 స్టేషన్లతో హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో భారీ ప్రాజెక్టు
 • కూకట్‌పల్లి - నానక్‌రాంగూడ వరకు ఈబీఆర్టీఎస్‌
 • నగరం నలు దిశలా నాలుగు లాజిస్టిక్‌ పార్కులు
 • హైదరాబాద్‌కు హెరిటేజ్‌ గుర్తింపునకు దరఖాస్తు
 • ‘ఆంధ్రజ్యోతి’తో మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి, 
 • హెచ్‌ఎండీఏ కమిషనర్‌ అర్వింద్‌ కుమార్‌
 • 9 స్టేషన్లతో హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ప్రాజెక్టు
 • ‘ఆంధ్రజ్యోతి’తో స్పెషల్‌ సీఎస్‌, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ అర్వింద్‌ కుమార్‌

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ‘‘111 జీవో ఏరియాను హరిత నగరంగా తీర్చిదిద్దుతాం. హైదరాబాద్‌ నగరం 575 చ.కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండగా, 111 జీవో ఏరియా ద్వారా మరో 500 చ.కిలోమీటర్లు రాబోతోంది. ఇక్కడ అక్రమంగా భవనాలు వస్తున్నాయి. అక్కడి అక్రమాలను ఆపేందుకు ప్రణాళికాబద్ధంగా పని చేయాల్సి ఉంది’’ అని హెచ్‌ఎండీఏ కమిషనర్‌ అర్వింద్‌ కుమార్‌ ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు.


హైదరాబాద్‌ అభివృద్ధికి హెచ్‌ఎండీఏ ప్రణాళికలు?

రానున్న 10, 20 ఏళ్లలో నగరం విస్తరణను దృష్టిలో ఉంచుకుని అర్బన్‌ ప్లానింగ్‌పై దృష్టి సారించాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు. లాజిస్టిక్స్‌, టెర్మినల్స్‌, రోడ్డు నెట్‌వర్కింగ్‌, బస్‌ డిపోలను ప్లాన్‌ చేయాలన్నారు. ఇందులో భాగంగా ఎయిర్‌పోర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ వే ప్లాన్‌ చేస్తున్నాం. సూక్ష్మంగా డీపీఆర్‌ తయారైంది. రాయదుర్గం నుంచి 9 స్టేషన్లతో ఓఆర్‌ఆర్‌ వెంట ఎయిర్‌ పోర్టు వరకు అలైన్‌మెంట్‌, ప్రాజెక్టు వ్యయం కూడా ఖరారైంది. అలాగే, ఈబీఆర్‌టీఎస్‌ కూడా రాబోతోంది. కూకట్‌పల్లి నుంచి మొదలై సుజనా మాల్‌, హైటెక్‌ సిటీ, ఫైనాన్షియ ల్‌ డిస్ట్రిక్ట్‌, నానక్‌రాంగూడ వరకు ఎలివేటెడ్‌ కారిడార్‌లో మెట్రో నియో నిర్మించడానికి హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించాం. తూర్పు, పడమరల్లో మెట్రో ప్రాజెక్టు ఉంటే.. ఉత్తర, దక్షిణాల్లో ఈబీఆర్‌టీఎస్‌ రాబోతోంది. నాలుగు లాజిస్టిక్‌ పార్కులు రాబోతున్నాయి. తూప్రాన్‌లో 120 ఎకరాలు, పాత ముంబై హైవే రోడ్డులోని లకడారంలో 164 ఎకరాలు, శంషాబాద్‌ వద్ద హెచ్‌ఎండీఏకు చెందిన 168 ఎకరాల్లో, విజయవాడ హైవేలో మల్కాపురం వద్ద 120 ఎకరాల్లో లాజిస్టిక్‌ పార్కులు నిర్మించడానికి డిజైన్లు రూపొందించాం. త్వరలో టెండర్లను ఆహ్వానిస్తాం. వీటితో ఉపాధి పెరగడంతోపాటు నగరంలో ట్రాఫిక్‌ తగ్గుతుంది.


గతంతో పోలిస్తే హెచ్‌ఎండీఏ పాత్ర మారిందా?

మునిసిపల్‌ శాఖలో హెచ్‌ఎండీఏ యాంకర్‌ యూనిట్‌గా ఉండాలని మంత్రి నిర్ణయించారు. ప్రజల విజ్ఞప్తుల నేపథ్యంలో వివిధ శాఖల్లో అవసరమైన పనులు కూడా చేయనుంది. భవిష్యత్తులో రోడ్ల అభివృద్ధి, లే అవుట్లు రూపకల్పన చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. మోడల్‌ లే అవుట్లను ప్లాన్‌ చేస్తున్నాం. ల్యాండ్‌ పూలింగ్‌ కింద శివారుల్లో భూములు తీసుకుని, వాటిలో స్థలాలను అభివృద్ధి చేసి 18 వరకూ వరకూ మోడల్‌ లే అవుట్‌ కా లనీలను ఏర్పాటు చేస్తాం. మధ్య తరగతికిఅందుబాటులో ఉండేలా 120, 160, 240, 267 చ.గజాల విస్తీర్ణం ఉండే ఓపెన్‌ ప్లాట్లను నిర్ణీత ధరకు ప్లాన్‌ చేస్తున్నాం.


మౌలిక సదుపాయాల కల్పనకు సర్వేలు చేశారా?

పలు కన్సల్టెన్సీల ద్వారా వివిధ సర్వేలు చేశాం. రోడ్డు కనెక్టివిటీ, ట్రాఫిక్‌ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో రోడ్ల వెడల్పు, మాస్టర్‌ ప్లాన్‌లో నిర్ణయించిన రోడ్ల నిర్మాణం, లింకు రోడ్ల ఏర్పాటు వంటి వాటిపై సర్వేలు చేశాం. హైదరాబాద్‌ ప్రస్తుత అవసరాలే కాకుండా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని నగరం నుంచి ఔటర్‌ వరకు రోడ్లను అభివృద్ధి చేయడానికి నాలుగు దిక్కులకు 4ఏజెన్సీలను ఏర్పాటుచేశాం. ప్రతిపాదనల ఆధారంగా రోడ్లు నిర్మిస్తాం.


111 జీవో రద్దయ్యాక ఆ ఏరియాపై ప్రభుత్వ వ్యూహం ఏమిటి?  

జంట జలాశయాలైన ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్‌ సాగర్‌ అస్తిత్వం దెబ్బతినరాదని, అవి కలుషితం కాకూడదని సీఎం కేసీఆర్‌ సూచించారు. అందుకు అనుగుణంగా ప్లాన్‌ చేస్తున్నాం. 111 జీవో ఏరియాలో 1.32 లక్షల ఎకరాలకు మాస్టర్‌ డ్రైనేజీ ప్లాన్‌, మాస్టర్‌ సీవరేజ్‌ ప్లాన్‌ ఉంటుంది. సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు ఎక్కడ కట్టినా వాటిలో శుద్ధి చేసిన నీరు మూసీలో కలుస్తుంది. రెండు జలాశయాల్లోకి కలుషిత జలాలు చుక్క కూడా చేరవు. వాటికి ముంపు సమస్య రాదు. ఎట్టి పరిస్థితుల్లో వాటిని దెబ్బతిననివ్వం. ఇక, హైదరాబాద్‌ 575 చ.కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండగా, 111 జీవో ఏరియా ద్వారా మరో 500 చ.కిలోమీటర్లు రాబోతోంది. ఇక్కడ అక్రమం గా భవనాలు వస్తున్నాయి. అక్కడి అక్రమాలను ఆపేందుకు ప్రణాళికాబద్ధంగా పని చేయాల్సి ఉంది. ఈ ఏరియాలో గ్రీన్‌ సిటీ కాన్సెప్ట్‌లో అభివృద్ధి జరగాల్సి ఉంది. హైదరాబాద్‌ విస్తీర్ణంలో అభివృద్ధిని ఆపలేం. అందుకే ఢిల్లీలో ఫామ్‌హౌస్‌ పాలసీలను పరిశీలించాం. గ్రీన్‌ సిటీకి ప్రపంచంలో బెస్ట్‌ పాలసీలపై అధ్యయనం చేస్తున్నాం. పర్యావరణానికి ఇబ్బంది కాకుండా, గ్రీనరీ పెంచుకుంటూ, వాటర్‌ క్వాలిటీ ఇంప్రూవ్‌ చేస్తూ ఏ రకంగా డెవలప్‌ చేయాలనే దానిపై కసరత్తు చేస్తున్నాం. 111 ఏరియాలో కన్జర్వేషన్‌ జోన్‌ కొనసాగుతుంది. ఎలాంటి భవనాలకు పర్మిషన్లు ఇవ్వట్లేదు.


చారిత్రక కట్టడాలపై ప్రత్యేకంగా ఫోకస్‌పై..

చారిత్రక కట్టడాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతోపాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడేందుకు రెండేళ్లుగా చర్యలు చేపడుతున్నాం. తొలుత, శిథిలావస్థలోని మోజాంజాహీ మార్కెట్‌ను పునరుద్ధరించాం. అన్ని రకాల సౌకర్యాలు కల్పించాం.  ఈట్‌ స్ట్రీట్‌ను తీసుకురాబోతున్నాం. నగరంతోపాటు పరిసర ప్రాంతాల్లోని పురాతన మెట్ల బావులను పునరుద్ధరిస్తున్నాం. బన్సీలాల్‌పేట మెట్ల బావిని మోడల్‌గా తీర్చిదిద్దుతున్నాం. పరిసర ప్రాంతాలన్నీ ఒకే రంగులో ఉండడంతోపాటు చుట్టూ నడిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.  


విదేశీయులను ఆకట్టుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు?

విదేశీ పర్యాటకులే కాకుండా నగరవాసులు సైతం చారిత్రక కట్టడాలను సందర్శించేలా ఆసక్తిని రేకెత్తించాలని అనుకుంటున్నాం. మొన్నటి వరకు జీహెచ్‌ఎంసీ జోనల్‌ ఆఫీసుగా ఉన్న సర్దార్‌ మహల్‌ పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో పీపీపీ పద్ధతిలో పునరుద్ధరణ చర్యలు చేపట్టాం. గ్రామీణ వైవిధ్యంతో ఆర్ట్‌ విలేజ్‌గా చేస్తున్నాం. చార్మినార్‌ పక్కనే కావడంతో పర్యాటకులు ఉండేందుకు వీలుగా రూపొందిస్తున్నాం. పదేళ్ల కిందట మొదలు పెట్టిన చార్మినార్‌ పెడెస్ట్రియన్‌ ప్రాజెక్టును పునఃసమీక్షిస్తున్నాం. ఆగాఖాన్‌ ట్రస్ట్‌తో మలేషియాలోని హమ్దాన్‌ సంస్థతో చర్చించాం. 106 ఎకరాల్లో ఉన్న కుతుబ్‌ షాహీ టూంబ్స్‌, బావుల పునరుద్ధరణ పనులు ఇప్పటికే ఆగాఖాన్‌ ట్రస్టు ద్వారా సాగుతున్నాయి. అక్కడి నుంచి గోల్కొండ వరకు దారి ఇవ్వడానికి ప్లాన్‌ తయారు చేస్తున్నాం. స్టేట్‌ సెంట్రల్‌ లైబ్రరీని హెచ్‌ఎండీఏ ద్వారా పునరుద్ధరించేందుకు కన్సల్టెన్సీని ఏర్పాటు చేశాం.


కొత్తగా మహా మాస్టర్‌ ప్లాన్‌ ఎప్పటికి రానుంది?

హెచ్‌ఎండీఏ పరిధిలో 5 మాస్టర్‌ప్లాన్‌లున్నాయి. జీహెచ్‌ఎంసీ, హుడా, హడా, అన్నీ కలిపి యూనిఫైడ్‌ ఇంటిగ్రేటెడ్‌ మాస్టర్‌ ప్లాన్‌ ఉండాలి. ట్రాన్స్‌పోర్ట్‌ ప్లాన్‌, ట్రాఫిక్‌ స్టడీ ప్లాన్‌, సీవరేజ్‌, డ్రైనేజీ, భవిష్యత్తు రోడ్ల ప్లాన్‌, టీఎస్‌ఐఐసీ ద్వారా వచ్చే పరిశ్రమల ప్లాన్‌, టౌన్‌షిప్‌ ప్లాన్‌లతో ప్రణాళికాబద్ధంగా మాస్టర్‌ ప్లాన్‌కు రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రొపోజల్స్‌ (ఆర్‌ఎఫ్‌పీ) ప్రపంచ స్థాయి కన్సల్టెన్సీల నుంచి తీసుకుంటాం. అవి రావడానికి ఏడాది, కొత్త మాస్టర్‌ప్లాన్‌ను తయారు చేసేందుకు కనీసం ఏడాదిన్నర పడుతుంది.


హైదరాబాద్‌కు యునెస్కో హెరిటేజ్‌ ప్రయత్నం ఎంత వరకు వచ్చింది?

హైదరాబాద్‌కు యునెస్కో హెరిటేజ్‌ ట్యాగ్‌ రావాలని గతంలో ప్రయత్నించాం. కొన్ని అంశాల వల్ల రాలేదు. రాకపోవడానికి కారణాలను విశ్లేషించాం. యునెస్కో హెరిటెజ్‌ గుర్తింపు కోసం కేవలం చారిత్రక కట్టడాలు ఉంటే సరిపోదు. ప్రజలు సైతం ఆర్థిక పురోభివృద్ధి సాఽధించే అవకాశాలుండాలి. హెరిటేజ్‌ ఎకనామిక్‌ మాస్టర్‌ ప్లాన్‌లో ఇంటిగ్రేట్‌ అయి ఉండాలి. అందుకు చారిత్రక కట్టడాలను పునరుద్ధరించి స్థానికంగా ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తాం. యునెస్కో హెరిటెజ్‌ గుర్తింపు కోసం డాక్యుమెంటేషన్‌ ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుంది. అహ్మదాబాద్‌ నగరానికి యునెస్కో గుర్తింపు వచ్చేందుకు కీలకంగా వ్యవహరించిన వాసవాడ అనే వ్యక్తిని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 2023-24 సంవత్సరానికి యునెస్కో హెరిటెజ్‌ గుర్తింపునకు దరఖాస్తు చేస్తున్నాం. దానితో హైదరాబాద్‌ గౌరవం పెరగడంతోపాటు యునెస్కో జాబితాలో నగరం ఉంటుంది. ప్రపంచంలో మెరుగైన నగరాల్లో ఒకటిగా నిలుస్తుంది. విదేశీ పర్యాటకులు సందర్శించడానికి ఆసక్తి చూపుతారు.

Read more