111 జీవో విధివిధానాలేవీ?

ABN , First Publish Date - 2022-08-17T10:36:51+05:30 IST

హైదరాబాద్‌ శివారులోని 84 గ్రామాల్లో 111 జీవోను రద్దు చేసినప్పటికీ విధివిధానాలు మాత్రం ఖరారు చేయడం లేదు.

111 జీవో విధివిధానాలేవీ?

జీవో రద్దయినా 84 గ్రామాల్లో యథావిధిగా ఆంక్షలు

జోన్ల మార్పుపై గోప్యత.. పలుమార్లు కమిటీ భేటీలు

నాలుగు నెలలైనా కొరవడిన స్పష్టత

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ శివారులోని 84 గ్రామాల్లో 111 జీవోను రద్దు చేసినప్పటికీ విధివిధానాలు మాత్రం ఖరారు చేయడం లేదు. ఆ గ్రామాలు ఇప్పటికీ బయో కన్జర్వేషన్‌ జోన్‌లోనే కొనసాగుతున్నాయి. 111 జీవో ఉండగా అమలు చేసిన ఆంక్షలనే కొనసాగిస్తున్నారు. 111 జీవోను రద్దు చేస్తూ ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌ 20న జీవో 69 జారీ చేసింది. అయినా ఆ 84 గ్రామాలు హెచ్‌ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం బయో కన్జర్వేషన్‌ జోన్‌ పరిధిలోనే ఉన్నాయి. ఈ గ్రామాలను వివిధ జోన్లుగా విభజించడానికి సీఎస్‌ నేతృత్వంలోని కమిటీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పలు దఫాలుగా సమావేశమైంది. అయినా విధివిధానాల ఖరారుపై స్పష్టతనివ్వడం లేదు. జోన్ల మార్పుపై కమిటీ ఆద్యంతం గోప్యంగా వ్యవహరిస్తోంది. కమిటీ ఏర్పడి నాలుగు నెలలైనా.. మార్గదర్శకాలు సిద్ధమవలేదు. హెచ్‌ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌-2031లో మార్పు, చేర్పులకు ఆదేశాలూ రాలేదు. ఆ 84 గ్రామాల్లో ఆంక్షలు తొలగాలంటే సీఎస్‌ నేతృత్వంలోని కమిటీ ఇచ్చే నివేదికే కీలకంగా మారనుంది. ఆయా గ్రామాల్లో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి, జంట జలాశయాల సంరక్షణకు అవసరమైన మార్గదర్శకాలు, నిబంధనలు రూపకల్పన చేయడానికి ప్రభుత్వం ఈ కమిటీని నియమించింది. గ్రామాలవారీగా వివరాలను తీసుకొని, ఆ ఊర్ల విస్తరణ, పట్టణ ప్రణాళిక ఆధారంగా జోన్లుగా విభజిస్తున్నట్లు తెలిసింది. జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ పరిసర ప్రాంతాల్లో బయో కన్జర్వేషన్‌ జోన్‌ ఉంచేందుకు చర్యలు చేపడుతున్నారు. సాధారణంగా మూసీ నదికి 100మీటర్ల వరకు బఫర్‌జోన్‌ ఉండగా, దాన్ని 50 మీటర్లకు కుదించారు. 25 ఎకరాల లోపు చెరువులు, కుంటలకు ఎఫ్‌టీఎల్‌ తర్వాత 9 మీటర్లు బఫర్‌జోన్‌ ఉండగా, 25 ఎకరాలకు పైగా ఉండే చెరువులకు మాత్రం 30 మీటర్లు ఉంది. ఈ బఫర్‌జోన్‌లో నిర్మాణాలు చేపట్టకూడదు. ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ ఎఫ్‌టీఎల్‌ తర్వాత బఫర్‌ జోన్‌కు 100, 500, 1000 మీటర్ల ప్రతిపాదనలను సిద్ధం చేసినట్లు తెలిసింది. బఫర్‌ జోన్‌ తర్వాత కేవలం పదిశాతం మాత్రమే నిర్మాణాలు వచ్చే విధంగా బయో కన్జర్వేషన్‌ జోన్‌ ఏ మేరకు నిర్ణయించాలనేదానిపై కూడా మల్లగుల్లాలు పడతున్నట్లు తెలిసింది.


నివేదికలో గ్రామాల వారీగా..

సీఎస్‌ నేతృత్వంలోని కమిటీ గ్రామాల వారీగా సర్వే నంబర్ల వివరాలను తీసుకొని మాస్టర్‌ప్లాన్‌లోని 23 జోన్లలో ఎక్కడెక్కడ ఏయే జోన్‌ ఉండాలనే దానిపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. 84 గ్రామాల్లో సర్వే నంబర్ల ఆధారంగా జోన్లను నిర్ణయిస్తూ నివేదికను రూపొందించనున్నారు. ఆ నివేదికపై మంత్రిమండలిలో చర్చించిన తర్వాతే హెచ్‌ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌లో మార్పునకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వనున్నారు. జంట జలాశయాల పరిధిలో బఫర్‌జోన్‌, బయో కన్జర్వేషన్‌ జోన్లపై వచ్చే సూచనల విషయంలో కమిటీ నిర్ణయమే కీలకం కానుంది. ఇతర జోన్లలో సహేతుకమైన వాటిని పరిగణనలోకి తీసుకొని, హెచ్‌ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌-2031లో మార్పులు చేయనున్నారు. స్థానిక ప్రజలతో పాటు అన్ని వర్గాలను సంతృప్తి పర్చకపోతే న్యాయపరమైన చిక్కులు, ఎన్‌జీటీ కేసులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే క్షేత్రస్థాయి అధికారుల నివేదికలు, గతంలో కన్సల్టెన్సీలు ఇచ్చిన నివేదికలు ఉండడంతో 84 గ్రామాల్లో జోన్ల మార్పునకు 3 నెలలకు మించి సమయం పట్టదు. కానీ, ఇప్పటికే నాలుగు నెలలవుతోందని, జాప్యానికి కారణాలు తెలియడం లేదని ఓ అధికారి పేర్కొన్నారు. ఎన్నికల హడావుడిలో అంతా ఒకేసారి జరిపించే అవకాశమూ ఉంటుందన్నారు.

Read more