బ్లాట్‌వేర్‌ యాప్స్‌తో ఫోన్‌ డౌన్‌

ABN , First Publish Date - 2022-02-19T05:30:00+05:30 IST

దాదాపుగా కొత్తగా కొనుగోలు చేస్తున్న ఫోన్లు అన్నింటిలో బ్లాట్‌వేర్‌

బ్లాట్‌వేర్‌ యాప్స్‌తో ఫోన్‌ డౌన్‌

దాదాపుగా కొత్తగా కొనుగోలు చేస్తున్న ఫోన్లు అన్నింటిలో బ్లాట్‌వేర్‌ యాప్స్‌ ఉంటాయి. ఎక్కువ మంది విషయంలో ఇవి స్టోరేజీని తినేయడం తప్ప వీటితో ఎలాంటి ప్రయోజనం ఉండదని చెబుతున్నారు నిపుణులు.  అంతకు మించి ఇవి ఫోన్‌ బ్యాటరీ లైఫ్‌ని దెబ్బ తీస్తుంటాయట కూడా. మంచి కంటే చెడే వీటితో ఎక్కువ. ఇవేవో పనికొస్తాయని భావించి ఉత్పత్తిదారులు వీటిని ఫోన్‌తోనే ఇన్‌బిల్ట్‌గా అందిస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేసే వీటిని పట్టుకోవడమూ కష్టమే. వీటిలో మెయింటెనెన్స్‌ యాప్స్‌ వంటివి కొన్ని మాత్రమే ఉపయోగపడతాయి. మిగతావన్నీ వృథానే. 



 యుటిలిటీస్‌ అందులో మొదటివి. మూడో పార్టీ డెవలపర్లు ప్రీలోడ్‌ చేస్తారు. ఫైల్‌ మేనేజ్‌మెంట్‌ యాప్స్‌, గేలరీ బ్యాకప్స్‌ ఉంటాయి వీటిని రెగ్యులర్‌గా ఉపయోగించకుంటే భారంగానే మారతాయి. సిస్టమ్‌లో భాగంగా ఉంటాయి. అడ్వాన్స్‌డ్‌ కాన్ఫిగరేషన్‌తో మాత్రమే వీటిని వదిలించుకోగలం. 

ట్రయల్‌వేర్‌ మరోరకం. కంప్యూటర్స్‌ విండోస్‌లో ఇవి ఉంటాయి. కొత్త డివైస్‌లలో ట్రయల్‌ మోడ్స్‌ను ఇవి ఆఫర్‌ చేస్తాయి. ట్రయల్‌ పీరియడ్‌ పూర్తయిన తరవాత కూడా డివైస్‌ రిసోర్సులను ఇవి ఉపయోగించుకుంటూ ఉంటాయి.  అయితే వీటిని సులువుగానే వదిలించుకోవచ్చు. 

యాడ్‌వేర్‌ మరొకటి. ఇంటర్నెట్‌ నుంచి సాఫ్ట్‌వేర్‌ని డౌన్‌లోడ్‌ చేసుకునే సమయంలో ఇవి వచ్చిచేరతాయి. రిస్క్‌ కాకున్నప్పటికీ వెబ్‌పై ప్రకటనలను ప్రదర్శిస్తూ ఉంటాయి. అలా వచ్చే ప్రకటనలు వెంటనే తొలగించుకోవాలని అనిపించేలా చేస్తాయి. కొందరు ఉత్పత్తిదారులు వీటిని ముందుగానే ఇన్‌స్టాల్‌ చేస్తుంటారు కూడా. 


రెండు రకాలుగా డివైస్‌ల్లోకి ఈ బ్లాట్‌వేర్స్‌ వస్తుంటాయి. ప్రీ ఇన్‌స్టాల్డ్‌ లేదంటే ఇంటర్నెట్‌ నుంచి డౌన్‌లోడింగ్‌ సమయంలో వచ్చి చేరుతుంటాయి. ప్రీ ఇన్‌స్టాల్డ్‌ విషయంలో ఉత్పత్తిదారులు వాటికి అనుమతించినందుకు డెవలపర్ల నుంచి కొంత మొత్తాలు అందుతాయి. ఫైల్‌ మేనేజర్స్‌, మ్యూజిక్‌ యాప్స్‌ వంటివి ఉంటాయి. సాధారణంగా ఇవి హానికరమైనవి కావు. అయితే కొన్ని డేటాను సేకరిస్తూ ఉంటాయి. అలాగే సైబర్‌ అటాక్‌లకు వీలు కల్పిస్తాయి. రెండో రకం ఇంటర్నెట్‌ నుంచి వస్తాయి. ఇవి హై రిస్క్‌ను కలిగి ఉంటాయి. భద్రతపరంగానూ ముప్పు కలిగిస్తాయి. కొన్ని గూఢచర్యానికి ఉపయోగపడతాయి. హానికలిగించే మాల్వేర్‌ను డివైస్‌లో జొప్పించడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. 


గమనించాల్సిన విషయం ఏమంటే ఇవన్నీ హానికరం కాదు. కొన్ని యాడ్‌ రూపంలో డబ్బును పొందేందుకు మూడో పార్టీకి  అవకాశం కలిగిస్తాయి. అటు డివైస్‌కు ఇటు వ్యక్తిగతంగానూ హాని కలిగించే వాటిపైనే వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని, సాధ్యమైనంత వేగంగా వాటిని వదిలించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.


Updated Date - 2022-02-19T05:30:00+05:30 IST