Nasa DART Mission: నాసా అత్యద్భుత విజయం.. ఇక హాయిగా నిద్రపోవచ్చు!

ABN , First Publish Date - 2022-09-27T22:48:23+05:30 IST

‘భూమి దిశగా దూసుకొస్తున్న గ్రహశకలాలు.. భూ గ్రహానికి త్రుటిలో తప్పిన పెను ముప్పు’ వంటి వార్తలు వింటున్నప్పుడల్లా గుండె

Nasa DART Mission: నాసా అత్యద్భుత విజయం.. ఇక హాయిగా నిద్రపోవచ్చు!

న్యూఢిల్లీ: ‘భూమి దిశగా దూసుకొస్తున్న గ్రహశకలాలు.. భూ గ్రహానికి త్రుటిలో తప్పిన పెను ముప్పు’ వంటి వార్తలు వింటున్నప్పుడల్లా గుండె ఝల్లుమంటుంది. ఈ భూమిపై అతిపెద్ద జీవులుగా చలామణి అయిన డైనోసార్ల అంతం కూడా ఇలానే జరిగిందన్నది శాస్త్రవేత్తల మాట. అయితే, ఇకపై ఇలాంటి భయం అక్కర్లేదు. భూమి పైకి ఎంత పెద్ద గ్రహశకలం దూసుకొస్తున్నా నిశ్చితంగా నిద్రపోవచ్చు. ఎందుకంటే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నానా (NASA) చేపట్టిన డార్ట్ మిషన్ (Double Asteroid Redirection Test) ప్రయోగం విజయవంతమైంది. భూమి వైపుగా దూసుకొస్తున్న గ్రహశకలాల(Asteroid) దిశమార్చేందుకు ఉద్దేశించిన ఈ మిషన్ లక్ష్యం నెరవేరింది. ఇలాంటి ప్రయోగం చేపట్టడం ప్రపంచంలోనే ఇది తొలిసారి.


పది నెలల క్రితం భూమిని విడిచిపెట్టిన డార్ట్ స్పేస్‌క్రాఫ్ట్ మంగళవారం ఓ గ్రహశకలాన్ని (Asteroid) ఢీకొట్టి దాని గమనాన్ని మార్చింది. ఈ స్పేస్‌క్రాఫ్ట్ నిర్మాణానికి నాసా ఏకంగా 344 మిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. గ్రహశకలాల(Asteroid)ను ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టి వాటి దిశను మార్చేందుకు ఉద్దేశించిన ఈ టెస్ట్ (Double Asteroid Redirection Test) విజయవంతమైనట్టు నాసా ప్రకటించింది. భూమికి 11 మిలియన్ కిలోమీటర్ల (7మిలియన్ మైళ్ల) దూరంలో డైమోర్ఫోస్‌ అనే గ్రహశకలాన్ని ‘డార్ట్’ స్పేస్‌క్రాఫ్ట్ ఢీకొట్టినట్టు  మేరీల్యాండ్‌ లారెల్‌లోని జాన్స్ హాప్కిన్స్ అప్లైడ్ ఫిజిక్స్ లేబొరేటరీ (ఏపీఎల్) మిషన్ కంట్రోల్ ప్రకటించింది. 


530 అడుగుల వెడల్పు ఉన్న ఈ డైమోర్ఫోస్ (Deimorpos) గ్రహశకలం డిడిమోస్ (Didymos) అనే 2,560 అడుగుల భారీ గ్రహశకలం (Asteroid) చుట్టూ గంటకు 24 వేల కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నట్టు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అయితే, దీనివల్ల భూ గ్రహానికి ఎలాంటి ముప్పు లేదని పేర్కొన్నారు. గ్రహశకలాన్ని(Asteroid) ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టే ఈ సాంకేతికతను ‘కైనటిక్ ఇంపాక్ట్’ అని పిలుస్తారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఇకపై భూమిపైకి గ్రహశకలాలు దూసుకొచ్చి విధ్వంసం సృష్టిస్తాయన్న భయం అక్కర్లేదు. అలాంటి వాటిని ముందుగానే పసిగట్టి వాటిని దారి మళ్లించవచ్చు.


అయితే, తాజా ప్రయోగం విజయవంతమైనా డైమోర్ఫోస్(Deimorpos) గమనం మారిందీ లేనిదీ తెలియడానికి ఇంకొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. ఈ ప్రయోగ ప్రభావాన్ని కేప్చర్ చేసేందుకు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్, హబుల్ టెలిస్కోప్‌ సహా కెమెరాలు, టెలిస్కోప్‌లు వ్యోమనౌకను ట్రాక్ చేస్తున్నాయి. గ్రహశకలం(Asteroid)పై ఓ కన్నేసి ఉంచాయి. భూమి నుంచి 9.6 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న డిమోర్ఫోస్(Deimorpos) నిజానికి 2,500 అడుగులున్న ఓ గ్రహశకలం. 1996లో దీనిని కనుగొన్నారు.  


Updated Date - 2022-09-27T22:48:23+05:30 IST