Koo launches Topics feature: చరిత్ర సృష్టించిన ‘కూ’

ABN , First Publish Date - 2022-08-24T02:58:14+05:30 IST

భారత మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫాం కూ(Koo) చరిత్ర సృష్టించింది. అద్భుతమైన ఫీచర్ ‘టాపిక్స్’ని 10 భాషల్లో విడుదల చేసింది.

Koo launches Topics feature: చరిత్ర సృష్టించిన ‘కూ’

న్యూఢిల్లీ: భారత మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫాం కూ(Koo) చరిత్ర సృష్టించింది. అద్భుతమైన ఫీచర్ ‘టాపిక్స్’ని 10 భాషల్లో విడుదల చేసింది.  హిందీ, బంగ్లా, మరాఠీ, గుజరాతీ, కన్నడ, తమిళం, తెలుగు, అస్సామీ, పంజాబీ, ఇంగ్లిష్ తదితర భాషల్లో ఈ ఫీచర్‌ను ప్రారంభించిన ఏకైక సోషల్ మీడియా యాప్‌గా కూ రికార్డు సృష్టించింది. విభిన్నమైన యూజర్లను కలిగి ఉన్న కూలో  కవిత్వం, సాహిత్యం, కళ, సంస్కృతి, క్రీడలు, చలనచిత్రాలు, ఆధ్యాత్మికత ద్వారా తమను తాము చురుకుగా వ్యక్తీకరించే లక్షలాదిమంది  క్రియేటర్లు ఇందులో ఉన్నారు. టాపిక్‌ల ద్వారా యూజర్లు తమకు అత్యంత సందర్భోచితమైన కంటెంట్‌ను మాత్రమే వీక్షించగలుగుతారు.  


కూలో జరిగే అనేక సంభాషణల మధ్య ప్లాట్‌ఫాంలోని ఫీడ్ ద్వారా స్క్రోల్ చేయడానికి బదులుగా యూజర్ల ఆసక్తి, ప్రాధాన్యతల ప్రకారం కంటెంట్‌ని ఎంచుకునే విషయంలో టాపిక్స్ వారి మార్గాన్ని సులభతరం చేస్తుంది. ఆరోగ్యానికి సంబంధించిన వార్తలు, సమాచారాన్ని కోరుకునే యూజరు.. ఉదాహరణకు టీకా, జీవనశైలి వ్యాధులు, వైద్య నిపుణుల నుంచి ఆరోగ్య చిట్కాలు మొదలైన వాటికి సంబంధించిన అన్ని సంబంధిత ‘కూ’లను వినియోగించుకోవడానికి టాపిక్స్ ట్యాబ్‌లోని 'ఆరోగ్యం' విభాగాన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది.


ఈ సందర్భంగా కూ సహ వ్యవస్థాపకుడు మయాంక్ బిదావత్కా (Mayank Bidawatka) మాట్లాడుతూ.. 10 భారతీయ భాషలలో టాపిక్‌లను ప్రారంభించిన మొదటి సోషల్ మీడియాగా తాము గర్వపడుతున్నట్టు చెప్పారు. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమకు ఆసక్తి ఉన్న కంటెంట్‌ను కనుగొనవచ్చని అన్నారు. అలాగే, సంబంధిత యూజర్ల ద్వారా చాలా మంది క్రియేటర్‌లను కనుగొనడంలో కూడా ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ప్రతి నెలా 20 మిలియన్లకు పైగా టాపిక్‌లను అనుసరిస్తున్నట్టు చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి ప్రతి నెలా 100 మిలియన్లకు పైగా ఈ టాపిక్ ఫీచర్ వినియోగం పెరుగుతుందని అంచనా వేస్తున్నట్టు పేర్కొన్నారు. 2020లో ప్రారంభమైన కూను ప్లే స్టోర్ నుంచి ఇప్పటి వరకు 10 మిలియన్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. భవిష్యత్తులో కోటి డౌన్‌లోడ్స్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.


Updated Date - 2022-08-24T02:58:14+05:30 IST