బ్యాంకింగ్‌ మాల్వేర్‌.... పారాహుషార్‌

ABN , First Publish Date - 2022-09-24T05:58:58+05:30 IST

ఆధునిక సాంకేతికత సుఖాలనే కాదు, కష్టాల ఊబిలోకి నెడుతోంది. యాప్‌ ఉంటే చాలు ఏ పనులైనా చక్కబెట్టుకునే రోజులివే.

బ్యాంకింగ్‌ మాల్వేర్‌.... పారాహుషార్‌

ధునిక సాంకేతికత సుఖాలనే కాదు, కష్టాల ఊబిలోకి నెడుతోంది. యాప్‌ ఉంటే చాలు ఏ పనులైనా చక్కబెట్టుకునే రోజులివే. అయితే అదే సమయంలో సదరు యాప్స్‌లోకి మాల్వేర్లు ప్రవేశించి కస్టమర్ల జేబులను గుల్ల చేస్తున్నాయి. ఇప్పటివరకు రష్యా, స్పెయిన్‌, అమెరికాకు పరిమితమైన ‘సోవా ఆండ్రాయిడ్‌ ట్రోజన్‌’ ఇప్పుడు ఇండియాపైనా దృష్టిపెట్టింది. క్రోమ్‌, అమెజాన్‌ లాంటి పాపులర్‌ యాప్‌లను అంటిపెట్టుకుని వస్తున్న ఈ మాల్వేర్‌, ప్రస్తుతం భారత బ్యాంకింగ్‌ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తోంది. యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌లను కొల్లగొట్టి కస్టమర్లను దోచేస్తోంది. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్‌ కస్టమర్లు పాటించాల్సిన జాగ్రత్తలను భారత ప్రభుత్వ నోడల్‌ సెక్యూరిటీ ఏజెన్సీ ‘సెర్ట్‌-ఇన్‌’ తెలియజేసింది.

యాప్‌ ఏదైనా గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచే డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అధికారిక యాప్‌ స్టోర్‌లు ముఖ్యంగా డివైస్‌ మాన్యుఫాక్చర్‌ లేదంటే ఆపరేటింగ్‌ సిస్టమ్‌ యాప్‌ స్టోర్ల నుంచి యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకుంటే 90 శాతం వరకు రిస్క్‌ నుంచి మినహాయింపు పొందవచ్చు. 

గూగుల్‌ ప్లే స్టోర్‌ సహా అఽధికారిక యాప్‌ స్టోర్స్‌ అయినప్పటికీ డౌన్‌లోడ్‌ చేసుకోబోతున్న యాప్‌నకు సంబంధించి సమాచారం అంటే డౌన్‌లోడ్స్‌ సంఖ్య, యూజర్‌ రెవ్యూలు, కామెంట్‌ వంటి అదనపు సమాచారాన్నీ తెలుసుకోవాలి. 

యాప్‌ పర్మిషన్లనూ చెక్‌ చేయాలి. యాప్‌ ఫంక్షనింగ్‌కు మాత్రమే పరిమితమయ్యే విధంగా పర్మిషన్లు ఇవ్వాలి. 

ఆండ్రాయిడ్‌ డివైస్‌ వెండార్స్‌ నుంచి అందుబాటులోకి వచ్చే అప్‌డేట్స్‌,    ప్యాచె్‌సను మిస్‌ కారాదు. నమ్మకం కలిగించని వెబ్‌సైట్లను బ్రౌజ్‌ చేయకూడదు. అన్‌ సొలిసిటెడ్‌ ఈమెయిల్స్‌, ఎస్‌ఎంఎస్‌ ద్వారా వచ్చే లింక్‌లకూ అదే వర్తిస్తుంది. 

మామూలు నంబర్లు కాకుండా డిఫరెంట్‌గా అనిపించే వాటిపై కూడా కన్నేయండి. స్కామర్లు తమను గుర్తించకుండా ఉండేందుకు ఎక్కువగా ఈమెయిల్‌ నుంచి టెక్స్ట్‌ సర్వీసులకు పాల్పడతారు. 

బ్యాంక్‌ నుంచి వచ్చే ఎస్‌ఎంఎస్‌ కరెక్టేనా కాదా అన్నది తేల్చుకోవాలి. బ్యాంక్‌ షార్ట్‌ నేమ్‌తో మెసేజ్‌లు వస్తాయి. ఈ విషయంలో లోతుగా చూడాలి. రెగ్యులర్‌గా మన బ్యాంక్‌ ఒకటి రెండు     రూపాల్లో మెసేజ్‌లు పంపిస్తుంది. అవి కాకుండా వేరేవిధంగా వచ్చినప్పుడు అనుమానించాలి. అందులో వచ్చే లింక్‌ల విషయంలోనూ మరింత అప్రమత్తంగా ఉండాలి. 

యూఆర్‌ఎల్‌ ఏదైనప్పటికీ క్లిక్‌ చేయడానికి ముందే చూసుకోవాలి. సందేహం తలెత్తితే సెర్చ్‌ ఇంజన్‌ సహాయంతో వెబ్‌సైట్‌ కరెక్టా కాదా అన్నది చెక్‌ చేసుకోవాలి.

బిట్‌.లీ, టిన్యూరల్‌ వంటి పొట్టి పదాలతో ఉండే యూఆర్‌ఎల్స్‌తో జాగ్రత్తగా ఉండాలి. దానిపై కర్సర్‌ను పంపి ఫుల్‌ డొమైన్‌ను తెలుసుకోవాలి. ఫుల్‌ ప్రివ్యూని ఒకసారి తేల్చుకుని ముందుకు వెళితే మంచిది. యూఆర్‌ఎల్‌ చెకర్‌ సహాయం తీసుకోవచ్చు. 

ఎన్‌క్రిప్షన్‌ సర్టిఫికెట్‌ చెల్లుబాటునూ తెలుసుకోవాలి. బ్రౌజర్‌ అడ్ర్‌సబార్‌పై గ్రీన్‌లాక్‌ను అందుకోసం చూడాలి. ఆపై మాత్రమే వ్యక్తిగత వివరాలను ఇవ్వాలి. 

వ్యవహారం తేడాగా అనిపిస్తే, రొటీన్‌ మాదిరిగా లేకుంటే వెంటనే అకౌంట్‌ ఉన్న బ్యాంక్‌కు రిపోర్ట్‌ చేయాలి.

Updated Date - 2022-09-24T05:58:58+05:30 IST