వావ్‌.. ప్రణయ్‌

ABN , First Publish Date - 2022-08-25T10:15:17+05:30 IST

వావ్‌.. ప్రణయ్‌

వావ్‌.. ప్రణయ్‌

 రెండోసీడ్‌ మొమోటాపై సంచలన విజయం

కిడాంబి శ్రీకాంత్‌కు షాక్‌

ప్రీక్వార్టర్స్‌కు లక్ష్యసేన్‌.. డబుల్స్‌లో సాత్విక్‌, అర్జున్‌ జోడీలు


భారత సీనియర్‌ షట్లర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ మరోసారి సంచలన ప్రదర్శనతో అదరగొట్టాడు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రెండుసార్లు విజేత, రెండోసీడ్‌ కెంటో మొమోటాకు అతని సొంతగడ్డపైనే షాకిచ్చి వహ్‌వా అనిపించాడు. కెంటోను వరుసగేముల్లో చిత్తుగా ఓడించి సహచరుడు లక్ష్యసేన్‌తో ప్రీక్వార్టర్స్‌ పోరుకు సిద్ధమయ్యాడు. ఇక, నిరుడు టోర్నీలో రజతం గెలిచిన భారత స్టార్‌ కిడాంబి శ్రీకాంత్‌ ఈసారి పూర్తిగా నిరాశపరుస్తూ రెండోరౌండ్లోనే వెనుదిరిగాడు. డబుల్స్‌లో కామన్వెల్త్‌ చాంపియన్‌ సాత్విక్‌ సాయిరాజ్‌ తన భాగస్వామి చిరాగ్‌తో కలిసి ప్రీక్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు.  


టోక్యో: వారెవ్వా.. ప్రణయ్‌! కొన్నాళ్లుగా మేజర్‌ టోర్నీల్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న ఈ వెటరన్‌ స్టార్‌ ప్రతిష్ఠాత్మక ప్రపంచ చాంపియన్‌షి్‌పలోనూ తన రాకెట్‌ పవరేంటో చూపించాడు. అలాంటి ఇలాంటి ప్రత్యర్థి కాదు.. ప్రపంచ మాజీ నెంబర్‌వన్‌, ప్రస్తుత రెండోర్యాంకరైన జపాన్‌ ఏస్‌ ఆటగాడు కెంటో మొమోటాకు అతని సొంత ప్రేక్షకుల మధ్యే దిమ్మదిరిగే షాకిచ్చాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌లో అన్‌సీడెడ్‌ ప్రణయ్‌ 21-17, 21-16తో రెండుసార్లు చాంపియన్‌ మొమోటాను చిత్తుచేసి రెండోరౌండ్లోనే ఇంటిబాట పట్టించాడు. మ్యాచ్‌లో ఆరంభం నుంచే దూకుడైన ఆటతీరుతో చెలరేగిన ప్రణయ్‌.. వరిదాకా ఆధిక్యాన్ని కాపాడుకుంటూ యాభై నాలుగు నిమిషాల్లో ప్రత్యర్థి ఆట కట్టించాడు. కేరళకు చెందిన 30 ఏళ్ల ప్రణయ్‌.. మొమోటాపై గెలవడం ఇదే తొలిసారి కావడం విశేషం. గతంలో అతడితో ఏడుసార్లు పోటీపడ్డా ప్రణయ్‌కు పరాజయమే ఎదురైంది. ఇక, గత టోర్నీలో కాంస్య పతక విజేత లక్ష్యసేన్‌ వరుసగా రెండో మ్యాచ్‌నూ అలవోకగా గెలిచాడు. తొమ్మిదో సీడ్‌ లక్ష్యసేన్‌ 21-17, 21-10తో స్పెయిన్‌ షట్లర్‌ లూయిస్‌ పెనాల్వర్‌ను వరుస గేముల్లో ఓడించి సహచరుడు ప్రణయ్‌తో ప్రీక్వార్టర్స్‌ పోరుకు సిద్ధమయ్యాడు. 


కిడాంబి చిత్తుగా..: గతేడాది రన్నరప్‌, ప్రపంచ మాజీ నెంబర్‌వన్‌ కిడాంబి శ్రీకాంత్‌ మాత్రం ఈసారి విఫలమయ్యాడు. తనకంటే తక్కువ ర్యాంకర్‌ చేతిలో ఓటమిపాలై రెండోరౌండ్లోనే ఇంటిబాట పట్టాడు. 12వ సీడ్‌ శ్రీకాంత్‌ 18-21, 17-21తో చైనాకు చెందిన 32వ ర్యాంకర్‌ జావో జున్‌ పెంగ్‌ చేతిలో పరాజయం పాలయ్యాడు. మ్యాచ్‌లో ప్రత్యర్థి దూకుడు ముందు పూర్తిగా తేలిపోయిన భారత షట్లర్‌ కేవలం 34 నిమిషాల్లోనే వెనుదిరిగాడు. పురుషుల డబుల్స్‌లో ఏడోసీడ్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌/చిరాగ్‌ శెట్టి 21-8, 21-10తో గ్వాటమెలా జంట జొనాథన్‌/అనిబల్‌పై గెలిచి ప్రీక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. క్వార్టర్స్‌ బెర్త్‌ కోసం డెన్మార్క్‌ ద్వయం జెప్పె బె/లాసె మొలాదెతో సాత్విక్‌ జంట తలపడనుంది. పురుషుల డబుల్స్‌లో మరో భారత జోడీ ఎమ్‌ఆర్‌ అర్జున్‌/ధ్రువ్‌ కపిల సంచలన విజయంతో ప్రీక్వార్టర్స్‌ చేరింది. అన్‌సీడెడ్‌ అర్జున్‌ జంట 21-17, 21-16తో గతేడాది కాంస్య పతక విజేత, 8వ సీడ్‌ కిమ్‌ ఆస్ట్ర్‌ప/ఆండ్రెస్‌ రాస్‌ముసెన్‌ (డెన్మార్క్‌) జోడీకి షాకిచ్చి సింగపూర్‌కు చెందిన హీ యంగ్‌/లో కీన్‌ ద్వయంతో మూడోరౌండ్‌ పోరుకు సిద్ధమైంది. మహిళల డబుల్స్‌ రెండోరౌండ్లో సిక్కిరెడ్డి/అశ్వినీ పొన్నప్ప జంట 15-21, 10-21తో చైనాకు చెందిన టాప్‌సీడ్‌ జోడీ చెన్‌ కింగ్‌ చెన్‌/జియా యి ఫాన్‌ చేతిలో ఓడగా.. కామన్వెల్త్‌ క్రీడల కాంస్య పతక విజేత జోడీ పుల్లెల గాయత్రీ గోపీచంద్‌/ట్రిసా జాలీ 8-21, 17-21తో పదోసీడ్‌, మలేసియా జంట పియర్లీ టాన్‌/తినా మురళీధరన్‌ చేతిలో ఓటమిపాలయ్యారు. మహిళల డబుల్స్‌లో మరో రెండు భారత జోడీలు పూజా దండు/సంజనా సంతోష్‌, అశ్వినీ భట్‌/శిఖా గౌతమ్‌ కూడా రెండోరౌండ్లో ప్రత్యర్థుల చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించారు.  

Read more