స్ప్రింట్ కింగ్‌ కెర్లీ

ABN , First Publish Date - 2022-07-18T09:55:47+05:30 IST

అంచనాలు నిజమయ్యాయి. ప్రతిష్ఠాత్మక వరల్డ్‌ చాంపియన్‌షిప్ పురుషుల 100 మీ. స్ప్రింట్‌లో అమెరికా పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించింది.

స్ప్రింట్ కింగ్‌ కెర్లీ

ప్రపంచ అథ్లెటిక్స్‌ 

100 మీటర్ల చాంపియన్‌ అమెరికన్‌

మూడు పతకాలూ యూఎస్‌వే

9.86 సెకన్లు

9.88 సెకన్లు

9.88 సెకన్లు


యూజీన్‌: అంచనాలు నిజమయ్యాయి. ప్రతిష్ఠాత్మక వరల్డ్‌ చాంపియన్‌షిప్ పురుషుల 100 మీ. స్ప్రింట్‌లో అమెరికా పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించింది. మూడుకు మూడు పతకాలు కొల్లగొట్టింది. అనుకున్నట్టే ఫ్రెడ్‌ కెర్లీ (9.86సె.) స్వర్ణ పతకం చేజిక్కించుకోగా, మర్విన్‌ బ్రాసీ (9.88సె.) రజతం, ట్రెవన్‌ బ్రోమెల్‌ (9.88సె.) కాంస్య పతకం సాధించారు. బ్రాసీ, బ్రోమెల్‌ ఇద్దరూ 9.88 సె.లలోనే గమ్యం చేరినా.. మార్విన్‌ 0.002 సె.తో ముందు నిలిచి రెండో స్థానం దక్కించుకున్నాడు. డిఫెండింగ్‌ చాంపియన్‌ కోల్‌మన్‌ (10.01సె) ఆరో స్థానంలో నిలిచాడు. 31 ఏళ్ల తర్వాత ప్రపంచ చాంపియన్‌షి్‌పలో 100 మీ.లో అమెరికా క్లీన్‌స్వీప్‌ చేయడం విశేషం. 


హాట్‌ ఫేవరెట్‌గా దిగి:

టెక్సా్‌సకు చెందిన కెర్లీ ఈసారి హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగి టైటిల్‌ పట్టేశాడు. టోక్యో ఒలింపిక్స్‌లో రజతం నెగ్గిన అతడు ఈ ఏడాది 9.80 సెకన్ల మార్క్‌ను అందుకున్న తొలి అథ్లెట్‌గా నిలిచాడు. వాస్తవంగా కెర్లీ 400 మీ. రన్నర్‌. 4x 400 మీ.రిలేలో కూడా తలపడిన అతడు 2019 ప్రపంచ చాంపియన్‌షి్‌పలో రిలే స్వర్ణంతోపాటు 400మీ.లో కాంస్యం, 2017 వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో రిలేలో రజతం నెగ్గాడు. కొవిడ్‌ సమయంలో 100 మీ.కు మారిపోయిన కెర్లీ..అనతి కాలంలోనే  విశ్వ విజేత స్థాయికి ఎదగడం అతడి సత్తాకు నిదర్శనం.  ఇక, పురుషుల హ్యామర్‌ త్రోలో పావెల్‌ (పోలెండ్‌, 81.98మీ.) వరల్డ్‌ రికార్డుతో స్వర్ణం నెగ్గగా, మహిళల షాట్‌పుట్‌లో చేస్‌ ఎలీ (అమెరికా) పసిడి అందుకుంది. మహిళల 10 వేల మీ. పరుగులో గిడీ (ఇథియోపియా-30ని.09.94సె) ప్రపంచ రికార్డుతో పసిడి దక్కించుకుంది. కాగా పురుషుల మారథాన్‌లో ఇథియోపియాకు చెందిన టోలా (2.05.36), మోసీనెట్‌ జెరెమ్యూ (2.06.44) స్వర్ణ, రజతాలు, బషీర్‌ అబ్ది (బెల్జియం) కాంస్యం అందుకున్నారు. 


శ్రీశంకర్‌కు ఏడోస్థానం

ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు ప్రవేశించిన తొలి భారత పురుష లాంగ్‌జంపర్‌గా రికార్డు నెలకొల్పిన మురళీ శ్రీశంకర్‌..అసలు సమరంలో ఆకట్టుకోలేకపోయాడు. ఆదివారం జరిగిన లాంగ్‌జంప్‌ ఫైనల్లో.. 7.96 మీ. లంఘించిన శ్రీశంకర్‌ ఏడో స్థానంలో నిలిచాడు. చైనా లాంగ్‌జంపర్‌ జియానన్‌ వాంగ్‌ (8.36 మీ.) స్వర్ణం, మిల్టిడిస్‌ రజతం, సిమోన్‌ హామెర్‌ కాంస్య పతకం అందుకున్నారు. 


సెమీస్‌కూ చేరని జబిర్‌..

 పురుషుల 400మీ. హర్డిల్స్‌లో భారత అథ్లెట్‌ పల్లియలిల్‌ జబిర్‌ సెమీస్‌కు చేరలేకపోయాడు. ఐదు హీట్లలో తలపడిన మొత్తం 35 మంది రన్నర్లలో అతడు 31వ స్థానంలో నిలిచాడు. 

Updated Date - 2022-07-18T09:55:47+05:30 IST