మన ఆధిపత్యం కొనసాగేనా?

ABN , First Publish Date - 2022-10-01T10:06:23+05:30 IST

క్రికెట్‌ ప్రేమికులను అలరించేందుకు మరోసారి ఆసియాకప్‌ రాబోతోంది. అయితే ఈసారి నాలుగేళ్ల తర్వాత మహిళల విభాగంలో ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీ జరుగనుంది.

మన ఆధిపత్యం కొనసాగేనా?

నేటి నుంచి మహిళల ఆసియాకప్‌

శ్రీలంకతో భారత్‌ తొలి పోరు 

మధ్యాహ్నం 1.గం నుంచి 

స్టార్‌ స్పోర్ట్స్‌లో..


సిల్హెట్‌ (బంగ్లాదేశ్‌): క్రికెట్‌ ప్రేమికులను అలరించేందుకు మరోసారి ఆసియాకప్‌ రాబోతోంది. అయితే ఈసారి నాలుగేళ్ల తర్వాత మహిళల విభాగంలో ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీ జరుగనుంది. 2004లో ఆరంభమైన మహిళల ఆసియాకప్‌ ఇప్పటి వరకు ఏడుసార్లు జరగ్గా.. ఆరుసార్లు భారత జట్టే విజేతగా నిలువడం విశేషం. తాజా టోర్నీలోనూ తమ ఆధిపత్యాన్ని చాటుకోవాలనుకుంటోంది. ఆరంభ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ సేన మధ్యాహ్నం శ్రీలంకను ఎదుర్కోనుండగా.. ఉదయం 8.30కి జరిగే మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌-థాయ్‌లాండ్‌ జట్లు ఆడతాయి. 15 రోజుల పాటు జరిగే ఈ సమరంలో భారత్‌, పాకిస్థాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, మలేసియా, యూఏఈ, థాయ్‌లాండ్‌ జట్లు తలపడనున్నాయి. ఈ ఏడింటి మధ్య టీ20 ఫార్మాట్‌లో రౌండ్‌ రాబిన్‌ పద్దతిన మ్యాచ్‌లు జరుగుతాయి. అంటే.. ప్రతీ జట్టు ఆరు మ్యాచ్‌లు ఆడుతుంది.


ఇందులోంచి టాప్‌-4లో నిలిచిన జట్లు సెమీ్‌సకు చేరతాయి. ఈనెల 15న ఫైనల్‌ జరగనుంది. కాగా.. 2018లో చివరిసారిగా జరిగిన ఆసియాక్‌పలో భారత్‌ తొలిసారి ఓడింది. ఆ ఫైనల్లో బంగ్లాదేశ్‌ చాంపియన్‌గా నిలిచింది.  చివరి మూడు టోర్నీ (2012, 2016, 2018)ల నుంచి ఆసియాక్‌పను పొట్టి ఫార్మాట్‌లోనే నిర్వహిస్తున్నారు. షెడ్యూల్‌ ప్రకారం 2020లో జరగాల్సిన ఈ టోర్నీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.


టైటిల్‌ ఫేవరెట్‌గా..:

ఇటీవలే ఇంగ్లండ్‌ను వన్డేల్లో వైట్‌వాష్‌ చేసిన భారత మహిళల జట్టు ఈ టోర్నీలో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. పురుషుల ఆసియాకప్‌లో రోహిత్‌ సేన ఫైనల్‌కు చేరలేక నిరాశపరచగా.. ఆ లోటును హర్మన్‌ప్రీత్‌ సేన భర్తీ చేయాలనుకుంటోంది. గాయంతో ఇంగ్లండ్‌ టూర్‌కు దూరమైన జెమీమా రోడ్రిగ్స్‌ జట్టులో చేరింది. తనతో పాటు రిచా ఘోష్‌ మిడిలార్డర్‌లో కీలకం కానున్నారు. అయితే ఓపెనర్‌గా స్మృతి మంధాన, కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ తమ ఫామ్‌ను చాటుకుంటున్నా.. షఫాలీ వర్మ పేలవ ఫామ్‌ ఆందోళనకరంగా ఉంది. తన స్థానంలో ఆంధ్ర క్రికెటర్‌ సబ్బినేని మేఘనను పరీక్షించే అవకాశం ఉంది. పేసర్‌ రేణుకా సింగ్‌ తన పదునైన బంతులతో ప్రత్యర్థి బ్యాటర్స్‌ను ఇబ్బంది పెట్టడం ఖాయమే. స్పిన్‌ విభాగంలో రాధా యాదవ్‌, దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్‌ త్రయం పరుగులను కట్టడి చేయనున్నారు.


చమరిపైనే భారం:

శ్రీలంక జట్టు ఎక్కువగా తమ కెప్టెన్‌ చమరి ఆటపట్టుపైనే ఆధారపడి ఉంది. విష్మి గుణరత్నె గాయంతో దూరమవడం జట్టుకు లోటుగా చెప్పవచ్చు. మిడిలార్డర్‌లో హసిని, హర్షిత సమరమిక్రమ జట్టు బాధ్యతను తీసుకోనున్నారు. అలాగే బౌలింగ్‌లో మాత్రం స్పిన్నర్లు ఇనోక రణవీర, ఒషాడి రణసింఘెలపైనే లంక ఆశలు పెట్టుకుంది.


టీమిండియా మ్యాచ్‌ల షెడ్యూల్‌

అక్టోబరు 1 భారత్‌ x శ్రీలంక

అక్టోబరు 3 భారత్‌ x మలేసియా

అక్టోబరు 4 భారత్‌ x యూఏఈ

అక్టోబరు 7 భారత్‌ x పాకిస్థాన్‌

అక్టోబరు 8 భారత్‌ x బంగ్లాదేశ్‌

అక్టోబరు 10 భారత్‌ x థాయ్‌లాండ్‌

అన్ని మ్యాచ్ లు మధ్యాహ్నం 1 గం. నుంచి

Read more