భవిష్యత్‌ బహు బాగు..

ABN , First Publish Date - 2022-02-23T09:05:11+05:30 IST

ఏ క్రీడ అయినా ఘనంగా ముందుకు సాగాలంటే వారసత్వాన్ని అందుకునేందుకు యువ ఆటగాళ్లు సిద్ధంగా ఉండాల్సిందే.

భవిష్యత్‌ బహు బాగు..

టీమిండియాలో చోటుకు సిద్ధంగా ఉన్న యువ క్రికెటర్లు

ఏ క్రీడ అయినా ఘనంగా ముందుకు సాగాలంటే వారసత్వాన్ని అందుకునేందుకు యువ ఆటగాళ్లు సిద్ధంగా ఉండాల్సిందే. 1970, 80వ దశకాల్లో ప్రపంచ క్రికెట్‌పై వెస్టిండీస్‌దే గుత్తాధిపత్యం. ఆ తర్వాత కరీబియన్ల ప్రభ మసకబారి పోయింది. కానీ క్రికెట్‌ను భారత్‌లో మాత్రం ఏ మాత్రం తగ్గకుండా అన్ని విభాగాల్లోనూ యువ ఆటగాళ్లు అదరగొడుతున్నారు. ఎలాంటి అవకాశం వచ్చినా రెండు చేతులతో ఒడిసిపట్టేస్తున్నారు. ఇదే రీతిన దుమ్ము రేపే ప్రదర్శనతో భవిష్యత్‌ టీమిండియాలో చోటు దక్కించుకోగల నలుగురు స్టార్లను పరిశీలిస్తే..


షారుక్‌ ఖాన్‌

తమిళనాడుకు చెందిన షారుక్‌ఖాన్‌ ఇప్పటికే దేశవాళీ క్రికెట్‌లో తనదైన ముద్ర వేశాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేకు ఎంపికైనా తుది జట్టులో చోటు దక్కలేదు. చాన్స్‌ లభిస్తే భవిష్యత్‌లో అతను కచ్చితంగా టీమిండియాలో కీలకంగా మారే అవకాశం ఉంది. అతడి సత్తా తెలుసు కాబట్టే.. ఇటీవలి ఐపీఎల్‌ వేలంలో పంజాబ్‌ రూ.9 కోట్లు వెచ్చించడం విశేషం. ఢిల్లీతో జరిగిన రంజీ మ్యాచ్‌లో షారుక్‌ తమిళనాడు తరఫున 148 బంతుల్లోనే 194 పరుగులు చేయడం విశేషం. గత సీజన్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ఫైనల్లో చివరి బంతికి ఐదు పరుగులు కావాల్సి ఉండగా, సిక్సర్‌ బాది టైటిల్‌ అందించాడు. లోయరార్డర్‌లో అతడి భారీ హిట్టింగ్‌ జట్టుకు వరంగా మారుతుందనడంలో సందేహం లేదు.


రాజ్‌ అంగద్‌ బవా

క్రీడా నేపథ్యం కలిగిన రాజ్‌ అంగద్‌ బవా అండర్‌-19 వరల్డ్‌కప్‌లో ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టాడు. ఫైనల్లో ఇంగ్లండ్‌పై 5 వికెట్లు తీసి జట్టు టైటిల్‌ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో 9 వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్‌లోనూ మెరిసి 252 పరుగులు చేశాడు. ఇందులో 162 రన్స్‌తో అజేయ శతకం కూడా ఉంది. కుడిచేతి మీడియం పేసర్‌గా వికెట్లు తీస్తూనే, ఎడమచేతి బ్యాట ర్‌గానూ రాణిస్తున్న ఈ హిమాచల్‌ కుర్రాడు.. రంజీ అరంగేట్రంలో హైదరాబాద్‌పై 2 వికెట్లు తీసి బ్యాటింగ్‌లో 44, 35 (నాటౌట్‌) రన్స్‌ సాధించాడు. అందుకే ఈ ఆల్‌రౌండ ర్‌ను ఐపీఎల్‌లో పంజాబ్‌ రూ. 2 కోట్లకు తీసుకుంది. రాజ్‌ తాత తర్లోచన్‌ సింగ్‌ బవా 1948 ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన భారత హాకీ జట్టులో సభ్యుడు.


యశ్‌ ధుల్‌ 

భారత్‌కు ఐదో అండర్‌-19 వరల్డ్‌కప్‌ను అందించిన కెప్టెన్‌గా యశ్‌ ధుల్‌ పేరు మారుమోగింది. ఈ కీర్తితో నేరుగా రంజీల్లో అడుగుపెట్టిన యశ్‌ అరంగేట్ర మ్యాచ్‌ రెండు ఇన్నింగ్స్‌లోనూ శతకాలు బాది వహ్వా అనిపించాడు. ఇప్పటి వరకు ఇలాంటి ఫీట్‌ మూడుసార్లు మాత్రమే నమోదు కావడం విశేషం. అంతకుముందు అతడికి రెడ్‌ బాల్‌ క్రికెట్‌లో ఎలాంటి అనుభవమూ లేదు. దీనికి తోడు అతను మిడిలార్డర్‌ బ్యాటర్‌ అయినా రంజీ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చాడు. పరిస్థితులకు తగ్గట్టుగా బ్యాటింగ్‌ శైలిని మార్చుకుని చెలరేగాడు. అందుకే సుదీర్ఘ ఫార్మాట్‌లోనూ పరిశీలించదగ్గ ఆటగాడిగా ఈ 19 ఏళ్ల ఢిల్లీ కుర్రాడు సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. 

 

సకీబల్‌ గని

బిహార్‌ తరఫున రంజీ ట్రోఫీ ప్లేట్‌ గ్రూప్‌లో బరిలోకి దిగిన సకీబల్‌ గని తన అసాధారణ బ్యాటిం గ్‌తో ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. తొలి ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లోనే 341 పరుగులు చేసి రికార్డు నెలకొల్పాడు. దిగ్గజం సచిన్‌ కూడా అతడి ప్రతిభను కొనియాడాడు. భారత క్రికెట్‌ జట్టులో బిహార్‌ నుంచి పెద్దగా క్రికెటర్లు కనిపించరు. కానీ ఆ లోటును  భవిష్యత్‌లో 22 ఏళ్ల గని తీరుస్తాడని భావించవచ్చు. మీడియం పేసర్‌గానూ రాణిస్తుండడం అతడికి అదనపు అర్హత. మున్ముందు కూడా అతను ఇదే నిలకడతో రాణిస్తే సెలెక్టర్ల దృష్టిలో పడడం ఖాయమే.

(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)

Read more