Washington Sundar: దీపక్ చాహర్ స్థానంలో వాషింగ్టన్ సుందర్

ABN , First Publish Date - 2022-10-08T21:49:02+05:30 IST

దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా మిగిలి రెండు వన్డేల్లో తలపడే భారత జట్టులో ఆల్ రౌండర్

Washington Sundar: దీపక్ చాహర్ స్థానంలో వాషింగ్టన్ సుందర్

న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా మిగిలి రెండు వన్డేల్లో తలపడే భారత జట్టులో ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ (Washington Sundar)కు చోటు దక్కింది. గాయం కారణంగా దీపక్ చాహర్ (deepak chahar) జట్టుకు దూరం కావడంతో అతడి స్థానాన్ని సుందర్ భర్తీ(Washington Sundar) చేయనున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి టీ20లో చాహర్ గాయపడ్డాడు. దీంతో లక్నోలో జరిగిన తొలి వన్డేకు కూడా దూరమయ్యాడు. చాహర్ స్థానాన్ని వాషింగ్టన్ సుందర్‌(Washington Sundar)తో భర్తీ చేయనున్నట్టు బీసీసీఐ తాజాగా ప్రకటించింది. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో చాహర్ పునరావాసం పొందుతాడని, అక్కడ అతడిని వైద్య బృందం పర్యవేక్షిస్తుందని తెలిపింది.


టీ20 ప్రపంచకప్‌లో తలపడే భారత జట్టులో చాహర్ స్టాండ్ బై ఆటగాడిగా ఉన్నాడు. టోర్నీ ప్రారంభమయ్యే సమయానికి అతడు కోలుకుంటాడని బీసీసీఐ భావిస్తోంది. ఇంకోవైపు, వెన్నెముక గాయం కారణంగా జస్ప్రీత్ బుమ్రా మెగా టోర్నీకి దూరమయ్యాడు. సఫారీలతో జరిగిన టీ20 సిరీస్‌లో చాహర్ అద్భుత ప్రతిభతో ఆకట్టుకోవడంతో బుమ్రా స్థానాన్ని భర్తీ చేసే విషయంలో షమీతోపాటు చాహర్ కూడా రేసులోకి వచ్చాడు. కాగా, కరోనా కారణంగా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో జరిగిన టీ20 సిరీస్‌కు మహ్మద్ షమీ దూరమయ్యాడు. 


దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ మంగళవారం ప్రారంభమైంది. లక్నోలో జరిగిన తొలి వన్డేలో భారత్ పరాజయం పాలైంది. వర్షం కారణంగా 40 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు వీర విహారం చేశారు. టీమిండియాకు 250 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. లక్ష్య చేధనలో భారత్ బోల్తా పడింది. సంజు శాంసన్, శ్రేయాస్ అర్ధ సెంచరీలతో రాణించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఫలితంగా సిరీస్‌లో 0-1తో భారత్ వెనకబడింది. ఈ మ్యాచ్‌కు కూడా చాహర్ దూరమయ్యాడు.  


దక్షిణాఫ్రికాతో మిగతా రెండు వన్డేలకు భారత జట్టు

శిఖర్ ధావన్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), రజత్ పటీదార్, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, ముకేశ్ కుమార్, అవేశ్ ఖాన్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్. 


Read more