టీమిండియా కోచ్‌గా vvs Laxman ?.. ఎప్పుడంటే..

ABN , First Publish Date - 2022-05-19T02:07:41+05:30 IST

ముంబై : మాజీ క్రికెట్ దిగ్గజం, నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ) ప్రస్తుత చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ త్వరలోనే టీమిండియా కోచ్‌గా అవతారమెత్తబోతున్నాడా ?

టీమిండియా కోచ్‌గా vvs Laxman ?.. ఎప్పుడంటే..

ముంబై : మాజీ క్రికెట్ దిగ్గజం, నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ) ప్రస్తుత చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ త్వరలోనే టీమిండియా కోచ్‌గా అవతారమెత్తబోతున్నాడా ? అనే ప్రశ్నలకు ఔననే సమాధానమిస్తున్నాయి బీసీసీఐ వర్గాలు. జూన్ నెల చివరిలో భారత్‌లో జరగనున్న ఐర్లాండ్‌ సిరీస్‌లో యువ జట్టుకు లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడని సమాచారం. ఐర్లాండ్ పర్యటన సమయంలో హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఇంగ్లాండ్‌లో టెస్టు జట్టుతో ఉంటాడు. కాబట్టి ఈ లోటును వీవీఎస్ లక్ష్మణ్ భర్తీ చేస్తారని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. గతేడాది కరోనా కారణంగా ఇండియా - ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లో చివరి మ్యాచ్ వాయిదాపడింది. జులై 1 - 5 మధ్య బర్మింగ్‌హామ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. మ్యాచ్‌కు ముందు ఇంగ్లీష్ కౌంటీ టీం లిసెస్టర్స్‌షైర్‌పై టీమిండియా వార్మప్ మ్యాచ్ ఆడనుంది. కాబట్టి టెస్టు జట్టుతోనే రాహుల్ ద్రావిడ్ కొనసాగనున్నాడు. 

కాగా గతంలోనూ ఇదే తరహా అనుభవం ఎదురైంది. రవిశాస్త్రి టీమిండియా హెడ్‌కోచ్‌గా ఉన్నప్పుడు టెస్ట్ సిరీస్ కోసం జట్టుతోపాటు ఆయన ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లారు. ఇదే సమయంలో భారత యువజట్టు శ్రీలంక టూర్‌కు వెళ్లింది. ఈ యువ బృందానికి నాటి ఎన్‌సీఏ చీఫ్‌గా ఉన్న రాహుల్ ద్రావిడ్ కోచ్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే.


కాగా ఐపీఎల్ తర్వాత టీమిండియా షెడ్యూల్ చాలా బీజీగా ఉంది. జూన్ 9 -19 మధ్య దక్షిణాఫ్రికాపై స్వదేశంలో 5 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఆ తర్వాత జూన్ 26, 28న 2 టీ20 మ్యాచ్‌లను ఐర్లాండ్‌పై ఆడనుంది. ఇదిలావుండగా.. ఇంగ్లాండ్‌పై 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో టీమిండియా 2-1 తేడాతో లీడ్‌లో కొనసాగుతోంది. గతేడాది ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నప్పుడు జట్టు సభ్యులకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో పర్యటన రద్దు చేయాలని ఇరు దేశాల క్రికెట్ బోర్డులు నిర్ణయించాయి. చివరి టెస్టును 2022లో ఆడిస్తున్నట్టు ప్రకటించాయి. కాగా జులై మొదటి వారంలో చివరి టెస్టులో గెలుపొందినా లేదా డ్రా చేసుకున్నా 2007 తర్వాత తొలిసారి ఇంగ్లాండ్‌పై భారత్ టెస్టు సిరీస్‌ను దక్కించుకుంటుంది. అంతక్రితం చివరిసారిగా రాహుల్ ద్రావిడ్ నాయకత్వంలోని భారత జట్టు టెస్టు సిరీస్‌ను గెలుచుకుంది.

Updated Date - 2022-05-19T02:07:41+05:30 IST