అతనెవరో చెప్పను

ABN , First Publish Date - 2022-02-23T08:59:35+05:30 IST

తనను ఓ ప్రముఖ జర్నలిస్టు బెదిరించాడని వెటరన్‌ వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా చేసిన ట్వీట్‌ హాట్‌టాపిక్‌గా మారింది.

అతనెవరో చెప్పను

మరోసారి జరిగితే మాత్రం ఊరుకోను

‘జర్నలిస్టు’ వ్యవహారంపై వికెట్‌ కీపర్‌ సాహా


న్యూఢిల్లీ: తనను ఓ ప్రముఖ జర్నలిస్టు బెదిరించాడని వెటరన్‌ వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా చేసిన ట్వీట్‌ హాట్‌టాపిక్‌గా మారింది. అయితే, ఆ జర్నలిస్టు పేరును వెల్లడిం చాలని సాహాకు మద్దతుగా నిలిచిన మాజీ క్రికెటర్లు హర్భజన్‌ సింగ్‌, నెటి జన్లు కోరుతున్నారు. కానీ, ఆ జర్నలిస్టు పేరును బయటపెట్టే ఉద్దేశం తనకు లేదని సాహా మంగళవారం చేసిన ట్వీట్లలో తెలిపాడు. అయితే, మరోసారి ఇలా జరిగితే మాత్రం ఉపేక్షించబోనని గట్టిగా హెచ్చరించాడు. స్వదేశంలో శ్రీలం కతో టెస్ట్‌ సిరీస్‌కు సాహాను సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ జర్నలిస్టు వృద్ధిమాన్‌ ఇంటర్వ్యూ కావాలని ఫోన్‌ చేశాడు. సాహా స్పందించకపోవడంతో అవమానంగా భావించిన అతడు .. ‘ఎప్పటికీ నిన్ను ఇంటర్వ్యూ చేయను. ఈ అవమానాన్ని తేలిగ్గా తీసుకోను’ అని మెసేజ్‌లు పెట్టాడు. వీటిని వృద్ధిమాన్‌ నెట్‌లో పెట్టడంతో రచ్చరచ్చ అయింది. అయితే, ఓ పత్రికకు ఇచ్చిన ఇంట ర్వ్యూలో మాత్రం బీసీసీఐ అడిగితే అతడి పేరు వెల్లడిస్తానని సాహా చెప్పడం విచిత్రం. 


పవర్‌ వార్‌లో పావుగా మారాడా?

సాహా వివాదంపై వివిధ వర్గాలు స్పందించిన తీరుతో.. బోర్డులోని రెండు బలమైన వర్గాల ఆధిపత్య పోరులో అతడు పావుగా మారాడా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వివాదానికి కారణమైన ఆ వ్యక్తి పేరును సాహా చెప్పకున్నా.. అతనే ఇతనంటూ బెంగాల్‌కు చెందిన ఓ సీనియర్‌ జర్నలిస్టు పేరు సోషల్‌మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తోంది. ఆ జర్నలిస్టుకు బోర్డులో పెద్దలతో మంచి సంబంధాలు ఉండడమే కాకుండా.. టీమిండియా డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి ఎలాంటి అడ్డంకులూ లేకుండా వెళ్లేంత పవర్‌ ఉన్నోడు. సచిన్‌ టెండూల్కర్‌ ఆటో బయో గ్రఫీ రాయడంలో అతడు ఎంతో సహకరించాడు. బెంగాల్‌కు చెందిన ఆ జర్నలిస్టు.. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీతో కూడా తరచుగా కనిపిస్తుంటాడు. కాగా, వృద్ధిమాన్‌ ట్వీట్‌తో.. దొరికిందిరా భలే ఛాన్స్‌ అన్నట్టుగా మాజీ కోచ్‌ రవిశాస్త్రి రంగప్రవేశం చేశాడు. గంగూలీ జోక్యం చేసుకొని అతడు ఎవరో కనుక్కోవాలి? అని అనడం వెనుక ఉద్దేశమేమిటో అర్థమవుతుందని కొందరు అంటున్నారు. గతంలో మ్యాచ్‌ ఫిక్సింగ్‌, చాపెల్‌ వివాదం సమయంలో నోరు మెదపని శాస్త్రి.. ఇప్పుడెందుకు గంగూలీని లాగే ప్రయత్నం చేస్తున్నాడు? అంటే.. వీరి మధ్య విభేదాలే కారణం అనే సమాధానం వినిపి స్తోంది.


శాస్త్రి కోచ్‌గా ఉన్నప్పుడు సదరు జర్నలిస్టు.. హాటల్‌ రూమ్‌ల్లోనే ఆటగాళ్లను ఇంటర్వ్యూలు చేసినా ఎన్నడూ అడ్డుచెప్పలేదు. మరిప్పుడు మాత్రం ఇలా వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందంటున్నారు. అయితే, బోర్డుపై ఆధిపత్యం కోసం అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జైషా మధ్య వార్‌ నడుస్తుందనేది లోపలి విషయాలు తెలిసిన వారికి ఎరుకే! ఈ నేపథ్యంలో సాహా అంశంతో ప్రత్యర్థి వర్గానికి చేరువకావాలనే ఎత్తు ఇందులో దాగి ఉందని భావిస్తున్నారు. 

Read more