నీ సహకారంతోనే ఇదంతా..

ABN , First Publish Date - 2022-09-10T06:11:49+05:30 IST

దాదాపు మూడేళ్ల తర్వాత విరాట్‌ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో శతకంతో అభిమానులను అలరించాడు. ఈ కష్టకాలంలో టీమ్‌ మేనేజ్‌మెంట్‌తో పాటు

నీ సహకారంతోనే  ఇదంతా..

దుబాయ్‌: దాదాపు మూడేళ్ల తర్వాత విరాట్‌ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో  శతకంతో అభిమానులను అలరించాడు. ఈ కష్టకాలంలో టీమ్‌ మేనేజ్‌మెంట్‌తో పాటు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అందించిన సహకారం కూడా మరువలేనిదని కోహ్లీ చెబుతున్నాడు. అఫ్ఘాన్‌తో మ్యాచ్‌ ముగిశాక ఈ ఇద్దరూ సరాదాగా మాట్లాడుకున్న వీడియో బీసీసీఐ షేర్‌ చేసింది. ‘14 ఏళ్లపాటు క్రికెట్‌ ఆడాక ఓ నెలరోజులు బ్యాట్‌ పట్టకుండా ఉన్నాను. అలాగే సుదీర్ఘ విరామం తర్వాత జట్టులోకి వచ్చినప్పుడు.. ఒత్తిడికి లోను కాకుండా సహజశైలిలోనే ఆడమని నీతోపాటు టీమ్‌ మేనేజ్‌మెంట్‌ కూడా చెప్పింది. అలాగే కెప్టెన్‌గా నీవు నాకిచ్చిన మద్దతు కూడా భారం దిగేలా చేసింది. జట్టుకు నేనేం చేయగలననే విషయంలోనూ ఆత్రుత పెరిగింది. ఎక్కువగా నేను భారీ సిక్సర్లు బాదడం కాకుండా, ఆటగాళ్ల మధ్య నుంచి ఫోర్లు కొట్టడంపై దృష్టి సారిస్తా. ఆసియాక్‌పలోనూ ఇదే చేశా. మిడిల్‌ ఓవర్లలో నా స్ట్రయిక్‌ రేట్‌ను ఎలా పెంచుకోవాలనే విషయమై కోచ్‌ ద్రవిడ్‌తోనూ మాట్లాడా’ అని కోహ్లీ తెలిపాడు. అలాగే కోహ్లీ ఫామ్‌ జట్టుకు చాలా అవసరమని, ఎక్కువగా భారీ షాట్లకు వెళ్లకుండా అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడని కెప్టెన్‌ రోహిత్‌ కొనియాడాడు. టీ20 వరల్డ్‌కప్‌నకు ముందు జట్టుకిది శుభసూచకమని చెప్పాడు.


నన్ను ఖాళీగా కూర్చోమంటారా?

విరాట్‌ కోహ్లీ ఓపెనర్‌గా బరిలోకి దిగితే.. మరి తానేం చేయాలని కేఎల్‌ రాహుల్‌ ప్రశ్నించాడు. అఫ్ఘానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ ఓపెనర్‌గా వీరవిహారం చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌లోనూ ఓపెనర్‌గానే మూడు సెంచరీలు సాధించిన కోహ్లీని టీ20 ప్రపంచక్‌పలోనూ అదే స్థానంలో కొనసాగిస్తారా? అని రాహుల్‌ను ఓ విలేకరి ప్రశ్నించాడు. దీనికి కేఎల్‌ స్పందిస్తూ.. ‘అయితే ఏంటి? మీరు నన్ను ఖాళీగా కూర్చోమని చెబుతున్నారా? విరాట్‌ పరుగులు సాధించడం జట్టుకు ఎంతో ఉపయోగకరం. మరో 2-3 ఇన్నింగ్స్‌ ఇలాగే ఆడితే అతడి ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. అయితే కోహ్లీ ఓపెనర్‌గానే సెంచరీలు కొడతాడని చెప్పలేం. మూడో నెంబర్‌లోనూ మెరుగ్గానే ఆడగలడు’ అని రాహుల్‌ చెప్పుకొచ్చాడు.

Updated Date - 2022-09-10T06:11:49+05:30 IST