సాకర్‌..కిక్‌!

ABN , First Publish Date - 2022-10-11T09:00:54+05:30 IST

ఉప్పొంగే ఉత్సాహం.. గోల్స్‌ కోసం సాగే టీనేజ్‌ అమ్మాయిల వేటతో.. భారత్‌ సాకర్‌ ఫీవర్‌తో ఊగిపోనుంది.

సాకర్‌..కిక్‌!

నేటి నుంచి అండర్‌-17 మహిళల ఫుట్‌బాల్‌ వరల్డ్‌కప్‌

 సంచలనాలపై భారత్‌ దృష్టి 

ఫేవరెట్లు స్పెయిన్‌, బ్రెజిల్‌


భువనేశ్వర్‌: ఉప్పొంగే ఉత్సాహం.. గోల్స్‌ కోసం సాగే టీనేజ్‌ అమ్మాయిల వేటతో.. భారత్‌ సాకర్‌ ఫీవర్‌తో ఊగిపోనుంది. దేశం తొలిసారి ఆతిథ్యం ఇస్తున్న అండర్‌-17 మహిళల ఫుట్‌బాల్‌ ప్రపంచక్‌పనకు మంగళవారం తెరలేవనుంది. కళింగ స్టేడియంలో ఆరంభోత్సవాన్ని నిర్వహించనుండగా.. టోర్నీ మొదటిమ్యాచ్‌లో బ్రెజిల్‌తో మొరాకో తలపడనుంది. 20 రోజలపాటు అభిమానులను అలరించే సాకర్‌ సమరం.. ఈ నెల 30న నవీ ముంబైలో జరిగే ఫైనల్‌తో ముగియనుంది. 2017లో అండర్‌-17 పురుషుల ప్రపంచకప్‌ తర్వాత దేశంలో జరుగుతున్న మేజర్‌ ఫిఫా టోర్నీ కావడంతో అంతటా ఆసక్తి నెలకొంది. 2008లో శ్రీకారం చుట్టిన జూనియర్‌ వరల్డ్‌క్‌పను రెండేళ్లకొకసారి నిర్వహించేలా నిర్ణయించారు. దేశంలో ఫుట్‌బాల్‌కు మరింత ప్రాచుర్యం కల్పించడంలో భాగంగా భారత్‌కు తొలిసారి ఆతిథ్య హక్కులు కేటాయించారు.


ముఖ్యంగా అమ్మాయిల కలలకు రెక్కలు తొడగాలనే ఉద్దేశంతో.. ‘కిక్‌ ఆఫ్‌ ద డ్రీమ్‌’గా టోర్నీ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. చివరిసారిగా 2018లో ఉరుగ్వేలో నిర్వహించిన విశ్వకప్‌ ఫైనల్లో మెక్సికోను ఓడించిన స్పెయిన్‌ విజేతగా నిలిచింది. 2020లో కరోనా కారణంగా వరల్డ్‌కప్‌ జరగలేదు. కాగా, స్పెయిన్‌, బ్రెజిల్‌లను టైటిల్‌ ఫేవరెట్లుగా పరిగణిస్తుండగా.. తొలిసారి ఆడుతున్న భారత్‌ అండర్‌ డాగ్‌గా బరిలోకి దిగుతోంది. అయితే, నాకౌట్‌ చేరితే అదే గొప్ప విజయమని టీమిండియా కోచ్‌ థామస్‌ డెన్నర్‌బై అన్నాడు. కానీ, ఏ అవకాశాన్నీ వదలిపెట్టకుండా తీవ్రంగా పోరాడతామని చెప్పాడు. 


‘ఇభా’..ఆసియా సివంగి

మహిళా శక్తిని ప్రతిబింబించేలా ప్రపంచకప్‌ మస్కట్‌గా ఆసియా సివంగి ఇభాను ఎంపిక చేశారు. ఆడ సింహాలు సమష్టితత్వం, పోరాటం, శక్తి, కరుణకు ప్రతిరూపాలు.. అందుకే మస్కట్‌గా ఇభాను ఎంచుకొన్నారు. 


నాలుగు గ్రూప్‌లుగా..

16 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీని 

నాలుగు గ్రూపులు.. ఎ, బి, సి, డిగా వర్గీకరించారు. 

గ్రూప్‌-ఎ:

భారత్‌, అమెరికా, మొరాకో, బ్రెజిల్‌         

గ్రూప్‌-బి:

జర్మనీ, నైజీరియా, చిలీ, న్యూజిలాండ్‌ 

గ్రూప్‌-సి:

స్పెయిన్‌, కొలంబియా, మెక్సికో, చైనా 

గ్రూప్‌-డి:

జపాన్‌, టాంజానియా, కెనడా, ఫ్రాన్స్‌

గ్రూప్‌లో టాప్‌-2లో నిలిచిన జట్లు నాకౌట్‌కు అర్హత సాధిస్తాయి. 

వేదికలు:

గ్రూప్‌ మ్యాచ్‌లను నవీ ముంబై, గోవా, భువనేశ్వర్‌లో నిర్వహించనుండగా.. నాకౌట్‌లకు గోవా, నవీ ముంబై వేదికలు కానున్నాడు.


బోణీ కొట్టాలని..

టోర్నీలోని తమ తొలి మ్యాచ్‌లో అమెరికాతో భారత్‌ తలపడనుంది. మంగళవారం జరిగే ఈ మ్యాచ్‌లో నెగ్గి ఘనంగా బోణీ చేయాలని మన అమ్మాయిలు భావిస్తున్నారు. ఆతిథ్య జట్టు హోదాలో అర్హత సాధించిన టీమిండియాపై పెద్దగా అంచనాలు లేకపోయినా.. టోర్నీలో సంచలనాలు సృష్టించాలనే పట్టుదలతో ఉంది. ఇటలీ, నార్వే, స్పెయిన్‌ టూర్లతో భారత జట్టుకు మంచి అనుభవం వచ్చిందని కోచ్‌ డెన్నర్‌బై చెప్పాడు. ఫార్వర్డ్‌ లిండా కోమ్‌ సెర్టో జట్టులో కీలక ప్లేయర్‌ కాగా.. అనితా కుమారి, నీతూపై భారీ అంచనాలున్నాయి. మరోవైపు ఈమ్యాచ్‌లో అమెరికాను ఫేవరెట్‌గా పరిగణిస్తున్నారు. మెగా ఈవెంట్‌లో ఐదుసార్లు ఆడిన అమెరికా.. 2008 మినహా మరెప్పుడూ గ్రూప్‌దశ దాటలేదు. ఈ నేపథ్యంలో సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాలని ఆ టీమ్‌ కోరుకొంటోంది. ఇతర మ్యాచ్‌ల్లో బ్రెజిల్‌తో మొరాకో, జర్మనీతో నైజీరియా, చిలీతో న్యూజిలాండ్‌ తలపడనున్నాయి. 


భారత జట్టు

గోల్‌ కీపర్లు:

మోనోలిసా దేవి, మెలోడీ చాను, అంజలి, డిఫెండర్లు: ఆస్తమ్‌ ఒరాన్‌, పూర్ణిమా కుమారి, వర్షిక, షిల్కి దేవి హేమమ్‌, మిడ్‌ ఫీల్డర్లు: బబీనా దేవి, నీతూ లిండా, శైలజ, శుభాంగిని సింగ్‌, ఫార్వర్డ్‌లు: లిండా కోమ్‌ సెర్టో, అనితా కుమారి, నేహ, రీజియా దేవ లైష్రామ్‌, షేలియా దేవి, కాజోల్‌ హూబర్ట్‌ డిసౌజా, లావణ్య ఉపాధ్యాయ్‌, సుధా అంకిత తిర్కే.


నేటి మ్యాచ్‌లు

బ్రెజిల్‌  x మొరాకో 

(సా. 4.30 నుంచి భువనేశ్వర్‌లో)

చిలీ  x న్యూజిలాండ్‌ 

(సా. 4.30 నుంచి గోవాలో)

నైజీరియా  x జర్మనీ 

(రాత్రి 8 నుంచి గోవాలో)

భారత్‌  x అమెరికా  

(రాత్రి 8 నుంచి భువనేశ్వర్‌లో)

ప్రత్యక్ష ప్రసారం:

స్పోర్ట్స్‌ 18 నెట్‌వర్క్‌, 

వూట్‌ సెలెక్ట్‌, జియో టీవీ

భారత మ్యాచ్‌ల షెడ్యూల్‌

అక్టోబరు 11 - భారత్‌  x అమెరికా 

అక్టోబరు 14 -  భారత్‌  x మొరాకో

అక్టోబరు 17 - భారత్‌  x బ్రెజిల్‌ 

(అన్ని మ్యాచ్‌లూ భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో రాత్రి 8 గంటల నుంచి)

Updated Date - 2022-10-11T09:00:54+05:30 IST