Bangladesh vs India Series : సిరీస్‌ పాయె!

ABN , First Publish Date - 2022-12-08T00:23:01+05:30 IST

గాయంతో బాధపడుతున్న రోహిత్‌ శర్మ (28 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 51 నాటౌట్‌) చివర్లో ధనాధన్‌ అర్ధ శతకంతో పోరాడినా టీమిండియాకు పరాజయం తప్పలేదు.

 Bangladesh vs India Series : సిరీస్‌ పాయె!

మిర్పూర్‌: గాయంతో బాధపడుతున్న రోహిత్‌ శర్మ (28 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 51 నాటౌట్‌) చివర్లో ధనాధన్‌ అర్ధ శతకంతో పోరాడినా టీమిండియాకు పరాజయం తప్పలేదు. బుధవారం బంగ్లాదేశ్‌తో ఉత్కంఠగా జరిగిన రెండో వన్డేలో భారత్‌ 5 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో మూడు వన్డేల సిరీ్‌సను బంగ్లా మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0తో సొంతం చేసుకొంది. 2015 తర్వాత టీమిండియాపై సిరీస్‌ నెగ్గడం ఇదే తొలిసారి. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ మెహ్దీ హసన్‌ మిరాజ్‌ (83 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 100 నాటౌట్‌) సెంచరీతో.. తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లా నిర్ణీత ఓవర్లలో 271/7 స్కోరు చేసింది. మహ్మదుల్లా (77) రాణించాడు. వాషింగ్టన్‌ సుందర్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. ఉమ్రాన్‌, సిరాజ్‌ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. లక్ష్యం కోసం బరిలోకి దిగిన భారత్‌.. ఓవర్లన్నీ ఆడి 9 వికెట్లకు 266 పరుగులు చేయగలిగింది. శ్రేయాస్‌ అయ్యర్‌ (82), అక్షర్‌ పటేల్‌ (56) ఆదుకొనే ప్రయత్నం చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో తొమ్మిదో నెంబర్‌లో బ్యాటింగ్‌కు దిగిన రోహిత్‌.. ఎడాపెడా షాట్లతో గెలుపుపై ఆశలు రేపినా.. అతడికి తగిన సహకారం లభించలేదు. 48వ ఓవర్‌లో సిరాజ్‌ (2) ఒక్క పరుగైనా చేయక పోవడం ఒకరకంగా గెలుపుపై ప్రభావం చూపింది. ఆఖరి ఓవర్‌లో 20 పరుగులు కావాల్సి ఉండగా.. తొలి 5 బంతుల్లో రోహిత్‌ 14 పరుగులు రాబట్టాడు. చివరి బంతికి సిక్స్‌ కొడితే భారత్‌దే విజయం. కానీ, ముస్తాఫిజుర్‌ యార్కర్‌ వేయగా.. హిట్‌మ్యాన్‌ షాట్‌ ఆడలేకపోయాడు.

రోహిత్‌కు గాయం.. మూడో వన్డేకు దూరం

రోహిత్‌ శర్మ ఎడమ చేతి బొటన వేలికి తీవ్ర గాయమైంది. రెండో వన్డేలో రెండో ఓవర్‌లో సిరాజ్‌ బౌలింగ్‌లో అనాముల్‌ ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్స్‌లో అందుకొనే క్రమంలో రోహిత్‌ చేతికి బంతి బలంగా తాకింది. క్యాచ్‌ నేలపాలుకాగా.. బొటన వేలు, చూపుడు వేలి మధ్య చర్మం తెగి రక్తస్రావమైంది. తక్షణం ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు కుట్లు వేసి కట్టుకట్టారు. కానీ, టీమ్‌ విపత్కర పరిస్థితుల్లో ఉండడంతో.. రోహిత్‌ చివర్లో బరిలోకి దిగాడు. అయితే, వేలు డిస్‌లొకేట్‌ కావడంతో.. నిపుణులైన వైద్యులను సంప్రదించేందుకు రోహిత్‌.. భారత్‌కు తిరుగు పయనం కానున్నాడని కోచ్‌ ద్రవిడ్‌ చెప్పాడు. దీంతో మూడో వన్డేకు దూరమైన అతడు.. బంగ్లాటూర్‌కే దూరమయ్యే చాన్సుం ది. రోహిత్‌తోపాటు గాయపడిన దీపక్‌ చాహర్‌, కుల్దీప్‌ సేన్‌ కూడా మూడో వన్డేకు అందుబాటులో ఉండకపోవచ్చన్నాడు.

స్కోరుబోర్డు

బంగ్లాదేశ్‌: అనాముల్‌ (ఎల్బీ) సిరాజ్‌ 11, లిటన్‌ (బి) సిరాజ్‌ 7, షంటో (బి) ఉమ్రాన్‌ 21, షకీబల్‌ (సి) ధవన్‌ (బి) సుందర్‌ 8, ముష్ఫికర్‌ (సి) ధవన్‌ (బి) సుందర్‌ 12, మహ్మదుల్లా (సి) రాహుల్‌ (బి) ఉమ్రాన్‌ 77, ఆఫిఫ్‌ (బి) సుందర్‌ 0, మెహ్దీ హసన్‌ (నాటౌట్‌) 100, నసుమ్‌ (నాటౌట్‌) 18; ఎక్స్‌ట్రాలు: 17; మొత్తం: 50 ఓవర్లలో 271/7; వికెట్ల పతనం: 1-11, 2-39, 3-52, 4-66, 5-69, 6-69, 7-217; బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 3-0-12-0, సిరాజ్‌ 10-0-73-2, శార్దూల్‌ 10-1-47-0, ఉమ్రాన్‌ మాలిక్‌ 10-2-58-2, వాషింగ్టన్‌ సుందర్‌ 10-0-37-3, అక్షర్‌ పటేల్‌ 7-0-40-0.

భారత్‌: కోహ్లీ (బి) ఎబాదత్‌ 5, ధవన్‌ (సి) మెహ్దీ హసన్‌ (బి) ముస్తాఫిజుర్‌ 8, శ్రేయాస్‌ (సి) ఆఫిఫ్‌ (బి) మెహ్దీ హసన్‌ 82, సుందర్‌ (సి) లిటన్‌ (బి) షకీబల్‌ 11, రాహుల్‌ (ఎల్బీ) మెహ్దీ హసన్‌ 14, అక్షర్‌ (సి) షకీబల్‌ (బి) ఎబాదత్‌ 56, శార్దూల్‌ (స్టంప్డ్‌) ముష్ఫికర్‌ (బి) షకీబల్‌ 7, దీపక్‌ చాహర్‌ (సి) శాంతో (బి) ఎబాదత్‌ 11, రోహిత్‌ (నాటౌట్‌) 51, సిరాజ్‌ (బి) మహ్మదుల్లా 2, ఉమ్రాన్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 19; మొత్తం: 50 ఓవర్లలో 266/9; వికెట్ల పతనం: 1-7, 2-13, 3-39, 4-65, 5-172, 6-189, 7-207, 8-213, 9-252; బౌలింగ్‌: మెహ్దీ హసన్‌ 6.1-0-46-2, ఎబాదత్‌ 10-0-45-3, ముస్తాఫిజుర్‌ 10-1-43-1, నసుమ్‌ 10-0-54-0, షకీబల్‌ 10-1-39-2, మహ్మదుల్లా 3.5-0-33-1.

Updated Date - 2022-12-08T03:32:17+05:30 IST