‘వంద’లో 100 కొట్టేనా?

ABN , First Publish Date - 2022-03-04T09:26:11+05:30 IST

మూడు టీ20ల సిరీ్‌సను క్లీన్‌స్వీ్‌ప చేసిన భారత జట్టు ఇప్పుడు సుధీర్ఘ ఫార్మాట్‌లోనూ శ్రీలంకను చిత్తు చేయాలనుకుంటోంది. టెస్టుల్లో రోహిత్‌

‘వంద’లో 100 కొట్టేనా?

మామూలుగానైతే శ్రీలంకతో టెస్టు మ్యాచ్‌ అంటే అభిమానుల్లో పెద్దగా జోష్‌ కనిపించదు. కానీ ఈ తాజా మ్యాచ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ప్రపంచ అగ్రశ్రేణి బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీకిది వందో టెస్టు. ఏ క్రికెటర్‌కైనా ఈ మైలురాయి ప్రత్యేకం. అందునా.. రెండేళ్లుగా ఒక్క శతకం కూడా సాధించని విరాట్‌ ఈ మ్యాచ్‌తోనైనా విమర్శకులకు సమాధానం చెబుతాడా? అని ఫ్యాన్స్‌ వేచిచూస్తున్నారు. మరోవైపు రోహిత్‌ కెప్టెన్సీలోనూ భారత్‌ తొలిసారిగా బరిలోకి దిగబోతోంది.


కళ్లన్నీ విరాట్‌ కోహ్లీపైనే

నేటి నుంచి శ్రీలంకతో భారత్‌ తొలి టెస్టు

రోహిత్‌ కెప్టెన్సీలో మొదటిసారిగా..


మొహాలీ: మూడు టీ20ల సిరీ్‌సను క్లీన్‌స్వీ్‌ప చేసిన భారత జట్టు ఇప్పుడు సుధీర్ఘ ఫార్మాట్‌లోనూ శ్రీలంకను చిత్తు చేయాలనుకుంటోంది. టెస్టుల్లో రోహిత్‌ శర్మ సారథ్యంలో భారత్‌ మొదటిసారి బరిలోకి దిగబోతుండడంతో పాటు విరాట్‌ కోహ్లీ కెరీర్‌లో వందో టెస్టు ఆడనుండడం ఈ మ్యాచ్‌ను ప్రత్యేకంగా మార్చింది. 2011లో విండీ్‌సతో విరాట్‌ తొలి టెస్టు ఆడాడు. అలాగే ఏడేళ్లపాటు జట్టు కెప్టెన్‌గా ఉన్న కోహ్లీ ఇప్పుడు కేవలం ఓ బ్యాటర్‌గా బరిలోకి దిగబోతున్నాడు. 2019 నుంచి తను ఏ ఫార్మాట్‌లోనూ శతకం బాదలేకపోయాడు. అందుకే వందో టెస్టులోనైనా ఈ ముచ్చటను తీర్చుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.  అటు స్వదేశంలో శ్రీలంకతో ఆడిన 20 టెస్టుల్లో భారత జట్టు 11 సార్లు గెలవగా 9 డ్రా అయ్యాయి. ఇందులో 9 ఇన్నింగ్స్‌ విజయాలుండడం విశేషం. కానీ ప్రస్తుతం డబ్ల్యూటీసీ టేబుల్‌ టాపర్‌గా ఉన్న లంక భారత్‌ను దీటుగా ఎదుర్కోవాలనుకుంటోంది.


మిడిలార్డర్‌లో ఎవరో?: 1990, 2000వ దశకాల్లో భారత టెస్టు జట్టుకు మిడిలార్డర్‌ పెట్టని కోటలా ఉండేది. సచిన్‌, ద్రవిడ్‌, లక్ష్మణ్‌, గంగూలీలతో అత్యంత పటిష్టంగా కనిపించేది. ఇప్పుడు ఫామ్‌ లేమితో పుజార, రహానె జట్టులో స్థానం కోల్పోయారు. దీంతో జట్టు మిడిలార్డర్‌ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ విభాగంలో రెండు స్థానాల కోసం హనుమ విహారి, శ్రేయాస్‌ అయ్యర్‌, శుభ్‌మన్‌ గిల్‌ పోటీపడుతున్నారు. మూడో స్థానంలో విహారికి, ఐదో స్థానంలో శ్రేయా్‌సకు అవకాశం దక్కవచ్చు. మయాంక్‌ ఓపెనర్‌గా రోహిత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభిస్తాడు. ఇక నాలుగో నెంబర్‌లో ఎప్పటిలాగే బరిలోకి దిగనున్న కోహ్లీపై ఒత్తిడి అధికంగానే ఉంటుంది. స్పిన్‌లో అశ్విన్‌, జడేజా ఖాయం కాగా, మూడో స్పిన్నర్‌గా జయంత్‌ యాదవ్‌ను ఆడించవచ్చు. ఇదే జరిగితే బుమ్రాకు జతగా  పేసర్లు షమి, సిరాజ్‌, ఉమేశ్‌ల మధ్య పోటీ ఉంటుంది.


ఒక్క విజయం కోసం..:  జట్టులో దిగ్గజ ఆటగాళ్లున్న సమయంలోనే భారత్‌లో శ్రీలంక ఒక్క టెస్టు విజయాన్ని కూడా సాధించలేకపోయింది. ప్రస్తుత జట్టు ఆ అద్భుతాన్ని ఆవిష్కరిస్తుందా? అంటే సందేహమే. కెప్టెన్‌ కరుణరత్నె బ్యాటింగ్‌పైనే ఎక్కువగా ఆధారపడి ఉంది. కుశాల్‌ మెండిస్‌ జట్టులో చేరినా ఈ టెస్టుకు దూరంగానే ఉంటున్నాడు. డిక్‌వెల్లా రాకతో చాందిమల్‌ కీపింగ్‌ గ్లోవ్స్‌ వదిలేసి ఆరోస్థానంలో అసలంకతో పోటీపడనున్నాడు. భారత్‌ టాప్‌-8లో ఆరుగురు కుడిచేతి బ్యాటర్స్‌ కావడంతో ఇద్దరు లెఫ్టామ్‌ స్పిన్నర్లకు అవకాశం ఇవ్వనుంది.


జట్లు (అంచనా)

భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), మయాంక్‌, విహారి/గిల్‌, కోహ్లీ, శ్రేయాస్‌, పంత్‌, జడేజా, అశ్విన్‌, జయంత్‌/కుల్దీ్‌ప, సిరాజ్‌/షమి, బుమ్రా.

శ్రీలంక: కరుణరత్నె (కెప్టెన్‌), లాహిరు తిరిమన్నె, నిస్సాంక, ఏంజెలో మాథ్యూస్‌, ధనంజయ డిసిల్వ, చాందిమల్‌/అసలంక, డిక్‌వెల్లా, లక్మల్‌, లసిత్‌ ఎంబుల్డెనియా, జయవిక్రమ/ఫెర్నాండో, లాహిరు కుమార. 


ఏమాత్రం ఊహించలేదు

కెరీర్‌లో వంద టెస్టులు పూర్తి చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఈక్రమంలో చాలా క్రికెట్‌ ఆడాను. ఈ ఘనత సాధించబోతున్నందుకు సంతోషంగా ఉంది.  ఫిట్‌నెస్‌ విషయంలో కఠోరంగా శ్రమించాను. నాకు, నా కుటుంబానికి, కోచ్‌లకు కూడా ఇది ఎంతో గర్వకారణం.  

- విరాట్‌ కోహ్లీ


పిచ్‌

మొహాలీలో ఆడిన 13 టెస్టుల్లో టీమిండియా ఒక్కసారే ఓటమి పాలైంది. ఇక్కడి పిచ్‌ సహజంగానే మ్యాచ్‌ సాగేకొద్దీ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. వర్షం ముప్పు లేదు.

Read more