మహిళల క్రికెట్లో రికార్డు నమోదు చేసిన ఝులన్ గోస్వామి

ABN , First Publish Date - 2022-03-17T00:05:12+05:30 IST

టీమిండియా వెటరన్ పేసర్ ఝులన్ గోస్వామి ప్రపంచ రికార్డు సాధించింది.

మహిళల క్రికెట్లో రికార్డు నమోదు చేసిన ఝులన్ గోస్వామి

టీమిండియా వెటరన్ పేసర్ ఝులన్ గోస్వామి ప్రపంచ రికార్డు సాధించింది. వన్డే క్రికెట్‌లో 250వికెట్లు తీసిన తొలి మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌లో బుధవారం ఇంగ్లాండ్‌తో జరిగిన లీగ్ మ్యాచులో ఒక వికెట్‌ను పడగొట్టి ఝులన్ ఈ ఘనతను సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ ఓపెనర్ టామీ బ్యూమాంట్‌ను ఎల్బీగా అవుట్ చేసి ఈ మైలురాయిని ఆమె అందుకుంది. ప్రపంచ రికార్డు నమోదు చేయడంతో ఝులన్‌ను అభినందిస్తూ ఐసీసీ, ఇంగ్లాండ్ వేల్స్ క్రికెట్ బోర్డులు ట్విట్టర్‌లో పోస్టులు పెట్టాయి. ‘‘అరుదైన రికార్డును సాధించిన ఝులన్ గోస్వామికి శుభాకాంక్షలు. క్రికెట్‌లో ఆమె ఓ లెజెండ్, పోరాట యోధురాలు. క్రికెట్ ఆడాలనుకునే యువతులందరికీ ఆమె స్ఫూర్తిదాయకం’’ అని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ట్వీట్ చేసింది. పురుషుల క్రికెట్‌లో ఈ రికార్డును మొదటిసారిగా కపిల్ దేవ్ 1994, మార్చి 27న సాధించాడు. మహిళల క్రికెట్‌లోనే తొలిసారిగా ఝులన్ ఈ రికార్డును మార్చి 16న నమోదు చేసింది. రెండు రికార్డులు మార్చిలోనే నమోదు కావడం చెప్పుకోదగ్గ విశేషం. 


ప్రస్తుతం అత్యధిక వికెట్లు తీసిన మహిళా క్రికెటర్‌గా ఝులన్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆమె 199 వన్డేలు ఆడి ఈ రికార్డును సాధించింది. ఆమె తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా మాజీ బౌలర్ ఫిజ్ ప్యాట్రిక్ (180 వికెట్లు), వెస్టిండీస్ పేసర్ అనిసా మహ్మద్(180 వికెట్లు), సౌతాఫ్రికా క్రికెటర్ షబ్నమ్ ఇస్మాయిల్(168వికెట్లు), ఇంగ్లండ్ బౌలర్ కేథరీన్ బ్రంట్ (164వికెట్లు) ఉన్నారు.





Updated Date - 2022-03-17T00:05:12+05:30 IST