సువర్ణావకాశం

ABN , First Publish Date - 2022-10-02T09:27:47+05:30 IST

తొలి టీ20లో గాడిలో పడిన బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ అదరగొడుతున్న టీమిండియా ఇప్పుడు ఓ అరుదైన విజయం కోసంఎదురుచూస్తోంది.

సువర్ణావకాశం

నేడు దక్షిణాఫ్రికాతో రెండో టీ20 

గెలిస్తే ‘తొలి’ సిరీస్‌ 

జోష్‌లో భారత జట్టు

గువాహటి: తొలి టీ20లో గాడిలో పడిన బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ  అదరగొడుతున్న టీమిండియా ఇప్పుడు ఓ అరుదైన విజయం కోసంఎదురుచూస్తోంది. స్వదేశంలో దక్షిణాఫ్రికాపై టీ20 సిరీ్‌సను భారత్‌ ఇప్పటిదాకా సాధించలేదు. కానీ ఈ మూడు టీ20ల సిరీస్‌లో ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉన్న రోహిత్‌ సేన మరో మ్యాచ్‌ గెలిస్తే ఆ జట్టుపై తొలి సిరీ్‌సను గెలుచుకునే అవకాశం ఉంది. ఇందుకు ఆదివారం జరిగే రెండో టీ20ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటోంది. అటు తొలి మ్యాచ్‌లో దారుణ పరాభవాన్ని మరిచి సిరీస్‌లో సజీవంగా ఉండాలని సఫారీలు భావిస్తున్నారు. ఇక్కడి గ్రీన్‌ఫీల్డ్‌ మైదానంలో ఒక అంతర్జాతీయ టీ20 మాత్రమే జరిగింది. అలాగే ఈ మ్యాచ్‌ కోసం చక్కటి బ్యాటింగ్‌ వికెట్‌ తయారుచేసినట్టు అసోం క్రికెట్‌ సంఘం పేర్కొంది.


యువ బౌలర్ల అండతో..:

నిజానికి ఈ సిరీ్‌సను టీ20 ప్రపంచకప్‌ జట్టుతో ఆడించాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావించింది. కానీ అనూహ్యంగా బుమ్రా గాయంతో మెగా టోర్నీ సన్నాహకాలపై దెబ్బపడింది. ఉమేశ్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌లను జట్టులోకి తీసుకున్నా ఈ ఇద్దరు టీ20 ప్రపంచకప్‌ టీమ్‌లో లేరు. మిగిలిన మ్యాచ్‌లు బుమ్రా స్థానాన్ని భర్తీ చేసే బౌలర్‌ ఎవరో తేలుస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది. స్టాండ్‌ బై పేసర్‌ దీపక్‌ చాహర్‌, లెఫ్టామ్‌ పేసర్‌ అర్ష్‌దీప్‌ కలిసి ప్రొటీ్‌సను పవర్‌ప్లేలో 9 పరుగులకే ఐదు వికెట్లతో కట్టడి చేశారు. స్పిన్‌ విభాగంలో మాత్రం జడేజా లోటును అక్షర్‌ అద్భుతంగా భర్తీ చేస్తున్నాడు. ఆసీ్‌సతో సిరీ్‌సలో 8 వికెట్లతో మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీ్‌సగా నిలిచాడు. తాజా సిరీ్‌సలోనూ మధ్య ఓవర్లలో పరుగులను కట్టడి చేస్తున్నాడు. బ్యాటింగ్‌లో రాహుల్‌, రోహిత్‌, కోహ్లీ, సూర్యకుమార్‌ ఫామ్‌ కనబరుస్తున్నారు. ఆసియాకప్‌ తర్వాత పంత్‌కు పెద్దగా అవకాశాలు లభించలేదు. అలాగే ఫినిషింగ్‌ పాత్రలో దినేశ్‌ కార్తీక్‌ మరీ తక్కువ బంతులే ఆడాల్సి వస్తోంది.


పోరాడాల్సిందే..:

స్వల్ప స్కోరును కాపాడుకునే క్రమంలో రోహిత్‌, కోహ్లీలను త్వరగానే అవుట్‌ చేసిన సఫారీ బౌలర్లు ఆ తర్వాత చేతులెత్తేశారు. దీంతో రాహుల్‌, సూర్యకుమార్‌ అజేయ అర్ధసెంచరీలతో భారత్‌ను గెలిపించారు. అలాగే బ్యాటింగ్‌లోనూ దారుణంగా విఫలమయ్యారు. డికాక్‌, బవుమా, రొసో, మిల్లర్‌ ఇలా వచ్చి అలా వెళ్లడంతో అతి కష్టమ్మీద వంద పరుగులు దాటింది. అందుకే కచ్చితంగా గెలవాల్సిన ఈ రెండో టీ20లో సత్తాకు తగినట్టుగా ఆడి భారత్‌కు సవాల్‌ విసరాలనుకుంటున్నారు.


తుది జట్లు(అంచనా)

భారత్‌:

రోహిత్‌ (కెప్టెన్‌), రాహుల్‌, కోహ్లీ, సూర్యకుమార్‌, పంత్‌, దినేశ్‌ కార్తీక్‌, అక్షర్‌, చాహర్‌, హర్షల్‌, అర్ష్‌దీప్‌, చాహల్‌. 


దక్షిణాఫ్రికా:

డికాక్‌, బవుమా (కెప్టెన్‌), రొసో, మార్‌క్రమ్‌, మిల్లర్‌, స్టబ్స్‌, పార్నెల్‌, జాన్సెన్‌/కేశవ్‌, రబాడ, నోకియా, షంసీ.

Read more