స్వియటెక్‌ x జెబ్యూర్‌

ABN , First Publish Date - 2022-09-10T06:13:59+05:30 IST

తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ వేటలోనున్న ట్యునీషియా స్టార్‌ ఓన్స్‌ జెబ్యూర్‌ తన స్వప్నాన్ని సాకారం చేసుకునేందుకు అడుగుదూరంలో నిలిచింది.

స్వియటెక్‌ x జెబ్యూర్‌

సెమీస్‌లో సబలెంక, గార్సియా ఓటమి 


తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ వేటలోనున్న ట్యునీషియా స్టార్‌ ఓన్స్‌ జెబ్యూర్‌ తన స్వప్నాన్ని సాకారం చేసుకునేందుకు అడుగుదూరంలో నిలిచింది. రెండు నెలల క్రితం వింబుల్డన్‌ రన్నర్‌పగా నిలిచిన ఈ ఆఫ్రికన్‌ మహిళ.. యూఎస్‌ ఓపెన్‌తో వరుసగా రెండో గ్రాండ్‌స్లామ్‌లోనూ ఫైనల్‌కు దూసుకెళ్లి అదరహో అనిపించింది. మరోవైపు టాప్‌సీడ్‌ హోదాకు న్యాయం చేస్తూ పోలెండ్‌ భామ ఇగా స్వియటెక్‌ తుది సమరానికి చేరుకొని జెబ్యూర్‌తో అమీతుమీకి సిద్ధమైంది. 


న్యూయార్క్‌: వింబుల్డన్‌లో చేజారిన గ్రాండ్‌స్లామ్‌ స్వప్నాన్ని యూఎస్‌ ఓపెన్‌లోనైనా సాధించాలన్న పట్టుదలతో ఉన్న మహిళల ఐదోసీడ్‌ ఓన్స్‌ జెబ్యూర్‌ తన లక్ష్యం దిశగా మరింత ముందుకెళ్లింది. టోర్నీ ఆరంభం నుంచి సూపర్‌ఫామ్‌తో అలరిస్తున్న ఈ ఆఫ్రికన్‌ సంచలనం.. అదే జోరులో ఫైనల్లో అడుగుపెట్టింది. సెమీఫైనల్లో జెబ్యూర్‌ 6-1, 6-3తో ఫ్రాన్స్‌కు చెందిన 17వ సీడ్‌ కరోలిన్‌ గార్సియాను చిత్తుచేసింది. గంటా ఆరు నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో ఆరంభం నుంచే దూకుడుగా చెలరేగిన జెబ్యూర్‌ వరుససెట్లలో ప్రత్యర్థిని మట్టికరిపించింది. ఈ గెలుపుతో గార్సియా వరుస 13 మ్యాచ్‌ల విజయానికి జెబ్యూర్‌ బ్రేక్‌ వేసింది. తొలిసెట్‌లో ఒకే ఒక గేమ్‌ నెగ్గిన గార్సియా.. జెబ్యూర్‌ సంధించిన బలమైన షాట్లకు ఏ దశలోనూ బదులివ్వలేకపోయింది. ఏకంగా 8 ఏస్‌లతో విరుచుకుపడిన జెబ్యూర్‌ 21 విన్నర్లను సంధించింది. గార్సియా 2 ఏస్‌లు, 12 విన్నర్లతో సరిపెట్టుకుంది. జెబ్యూర్‌ రెండుసార్లు డబుల్‌ ఫాల్ట్‌ చేసినా.. తనకు లభించిన 4 బ్రేక్‌ పాయింట్లను సద్వినియోగం చేసుకొంది. ఈ విజయంతో యూఎస్‌ ఓపెన్‌లో ఫైనల్‌ చేరిన తొలి ఆఫ్రికా మహిళగా 28 ఏళ్ల జెబ్యూర్‌ చరిత్ర సృష్టించింది.


మరో సెమీఫైనల్లో ప్రపంచ నెంబర్‌వన్‌ స్వియటెక్‌ 3-6, 6-1, 6-4తో ఆరోసీడ్‌ సబలెంక (బెలార్‌స)ను ఓడించింది. 2 గంటలా 11 నిమిషాల పాటు సాగిన హోరాహోరీ పోరులో స్వియటెక్‌ తొలిసెట్‌ కోల్పోయినా అద్భుతంగా పుంజుకొని తర్వాతి సెట్లలో పైచేయి సాధించింది. 2 ఏస్‌లు, 24 విన్నర్లతో ప్రత్యర్థిని బెంబేలెత్తించింది. ఇక, సబలెంక ఏకంగా 44 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. ఇప్పటికే ఫ్రెంచ్‌ ఓపెన్‌ (2020, 2022)తో రెండు మేజర్‌ టైటిళ్లను ఖాతాలో వేసుకున్న 21 ఏళ్ల స్వియటెక్‌.. తాజా విజయంతో యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌ చేరిన తొలి పోలెండ్‌ క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. 

Updated Date - 2022-09-10T06:13:59+05:30 IST