సిరీస్‌ పట్టేశారు

ABN , First Publish Date - 2022-10-03T09:27:45+05:30 IST

టీమిండియాతో పాటు దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో.. ఆదివారం జరిగిన రెండో టీ20లో పరుగుల వరద పారింది.

సిరీస్‌  పట్టేశారు

అదరగొట్టిన సూర్య, రాహుల్‌, రోహిత్‌, విరాట్‌

హైస్కోరింగ్‌ మ్యాచ్‌లో సఫారీలపై భారత్‌ విజయం

మిల్లర్‌ సూపర్‌ సెంచరీ వృథా

సూర్యకుమార్‌ (22 బంతుల్లో 61)


టీ20ల్లో అత్యధికంగా 1744 పరుగులు చేసిన భారత టాప్‌ జోడీగా రోహిత్‌-రాహుల్‌. 1743 పరుగులు చేసిన రోహిత్‌-ధవన్‌ జంట రెండో స్థానంలో ఉంది. 


టీ20ల్లో అత్యధికంగా (15 సార్లు) 50+ భాగస్వామ్యాలు నెలకొల్పిన జోడీ రోహిత్‌-రాహుల్‌. బాబర్‌-రిజ్వాన్‌ (14 సార్లు), స్టిర్లింగ్‌-ఓబ్రియాన్‌ (13 సార్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 


బంతుల పరంగా వేగంగా వెయ్యి పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా సూర్యకుమార్‌ (573 బంతులు). మ్యాక్స్‌ వెల్‌ (604 బాల్స్‌), మున్రో (635 బాల్స్‌) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 


వేగంగా అర్ధ శతకం సాధించిన భారత మూడో బ్యాటర్‌గా సూర్య (18 బంతులు). ఇంగ్లండ్‌పై యువరాజ్‌ (12 బంతులు) టాప్‌లో ఉండగా.. స్కాట్లాండ్‌పై రాహుల్‌ (18 బంతులు) రెండో స్థానంలో ఉన్నాడు. 


గువాహటి: టీమిండియాతో పాటు దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో.. ఆదివారం జరిగిన రెండో టీ20లో పరుగుల వరద పారింది. అయితే, 458 పరుగులు నమోదైన ఈ మ్యాచ్‌లో అంతిమంగా భారత్‌నే విజయం వరించింది. ఈ హోరాహోరీ మ్యాచ్‌లో రోహిత్‌ సేన 16 పరుగుల తేడాతో సఫారీలపై గెలిచింది. దీంతో దక్షిణాఫ్రికాపై భారత్‌ స్వదేశంలో తొలిసారి టీ20 సిరీస్‌ విజయాన్ని సొంతం చేసుకొంది. మూడు టీ20ల సిరీ్‌సను మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకొంది. సూర్యకుమార్‌ (22 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 61), కేఎల్‌ రాహుల్‌ (28 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 57) దమ్ములేపే అర్ధ శతకాలతో.. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 237 పరుగుల భారీ స్కోరు చేసింది. కోహ్లీ (28 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 49 నాటౌట్‌), రోహిత్‌ శర్మ (37 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 43) రాణించారు. కేశవ్‌ మహరాజ్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో దక్షిణాఫ్రికా ఓవర్లన్నీ ఆడి 221/3 స్కోరు చేసింది. మిల్లర్‌ (47 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 106 నాటౌట్‌) సూపర్‌ సెంచరీ వృథా అయింది. డికాక్‌ (69 నాటౌట్‌) అర్ధ సెంచరీ చేశాడు. కేఎల్‌ రాహుల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. 


వదలని మిల్లర్‌, డికాక్‌:

ఆరంభంలోనే రెండు టాపార్డర్‌ వికెట్లు చేజార్చుకున్న సౌతాఫ్రికా.. డికాక్‌, మిల్లర్‌ పోరాటంతో గట్టిపోటీ ఇచ్చింది. రెండో ఓవర్‌లో కెప్టెన్‌ బవుమా (0), రోసౌ (0)ను అర్ష్‌దీప్‌ అవుట్‌ చేసి షాకిచ్చాడు. అయితే, మరో ఓపెనర్‌ డికాక్‌, మార్‌క్రమ్‌ (33) మూడో వికెట్‌కు 46 పరుగుల భాగస్వామ్యంతో జట్టును ఆదుకొనే ప్రయత్నం చేయడంతో.. పవర్‌ ప్లే ముగిసే సరికి సౌతాఫ్రికా 45/2తో నిలిచింది. అయితే, ఆ తర్వాతి ఓవర్‌లో మార్‌క్రమ్‌ను అక్షర్‌ బౌల్డ్‌ చేశాడు. ఈ దశలో డికాక్‌కు మిల్లర్‌ జతవడంతో స్కోరు బోర్డు ఊపందుకొంది. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 174 పరుగుల భాగస్వామ్యంతో ఆశలు రేపారు. 19వ ఓవర్‌లో అర్ష్‌దీప్‌ 26 పరుగులు ఇచ్చుకోవడంతో సౌతాఫ్రికా స్కోరు డబుల్‌ సెంచరీ దాటింది. ఆఖరి ఓవర్‌లో విజయానికి 37 రన్స్‌ అవసరమవగా, రోహిత్‌ అక్షర్‌కు బంతిని అప్పగించాడు. మిల్లర్‌ 2 సిక్స్‌లతో శతకం పూర్తి చేసుకున్నా.. మొత్తం 20 రన్స్‌ మాత్రమే వచ్చాయి. 


వీర బాదుడు:

టీమిండియా టాపార్డర్‌ చెలరేగితే.. విధ్వంసం ఏ రీతిన ఉంటుందనడానికి ఈ మ్యాచ్‌ మచ్చుతునక. సూర్యకుమార్‌ మరోసారి డైనమైట్‌లా పేలగా.. రాహుల్‌ దూకుడైన ఆటను బయటకు తీశాడు. సఫారీ బౌలర్లను ఊచకోత కోసిన సూర్య.. కోహ్లీతో కలసి మూడో వికెట్‌కు 102 పరుగుల శతక భాగస్వామ్యంతో భారీ స్కోరును అందించగా.. ఓపెనింగ్‌ జోడీ రాహుల్‌, రోహిత్‌ తొలి వికెట్‌కు 96 రన్స్‌తో బలమైన పునాది వేసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. రాహుల్‌, రోహిత్‌ ధనాధన్‌ ఆటతో పవర్‌ ప్లే ముగిసేసరికి 57/0తో నిలిచింది. అయితే, ఓపెనర్లను కేశవ్‌ వరుస ఓవర్లలో అవుట్‌ చేశాడు.


10వ ఓవర్‌లో రోహిత్‌ క్యాచ్‌ అవుట్‌ కాగా.. తర్వాతి ఓవర్‌లో అర్ధ శతకం పూర్తి చేసుకొన్న రాహుల్‌ను ఎల్బీ చేశాడు. ఈ దశలో క్రీజులోకొచ్చిన సూర్య రబాడ వేసిన 15వ ఓవర్‌లో 6,4,4, 6తో 22 పరుగులు రాబట్టాడు. పార్నెల్‌ బౌలింగ్‌లో సిక్స్‌తో సూర్య ఫిఫ్టీ పూర్తి చేసుకోగా.. విరాట్‌ సిక్స్‌, రెండు బౌండ్రీలతో బ్యాట్‌ను ఝుళిపించాడు. దీంతో 18వ ఓవర్‌లోనే భారత్‌ స్కోరు 200 మార్క్‌ దాటింది. అయితే, కోహ్లీతో సమన్వయ లోపంతో సూర్య రనౌటవగా.. ఆఖరి ఓవర్‌లో దినేష్‌ కార్తీక్‌ (17 నాటౌట్‌) 2 సిక్స్‌లతో ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చాడు. చివరి 5 ఓవర్లలో భారత్‌ 82 పరుగులు స్కోరు చేసింది. 


పాము కలకలం..

పాము హఠాత్తుగా మైదానంలోకి రావడంతో ఐదు నిమిషాలు మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. భారత్‌ ఇన్నింగ్స్‌ 7వ ఓవర్‌లో ఎక్స్‌ట్రా కవర్‌వైపు నుంచి పాము ఫీల్డ్‌లోకి వచ్చింది. గ్రౌండ్‌మెన్‌ వెంటనే దానిని బకెట్‌లో బంధించి బయటకు తరలించారు. ఆ తర్వాత మ్యాచ్‌ సాఫీగా సాగింది. 


స్కోరుబోర్డు

భారత్‌:

రాహుల్‌ (ఎల్బీ) మహారాజ్‌ 57, రోహిత్‌ (సి) స్టుబ్స్‌ (బి) మహారాజ్‌ 43, విరాట్‌ (నాటౌట్‌) 49, సూర్యకుమార్‌ (రనౌట్‌) 61, దినేశ్‌ (నాటౌట్‌) 17, ఎక్స్‌ట్రాలు: 10, మొత్తం: 20 ఓవర్లలో 237/3. వికెట్ల పతనం: 1-96, 2-107, 3-209. బౌలింగ్‌: రబాడ 4-0-57-0, పార్నెల్‌ 4-0-54-0, ఎంగిడి 4-0-49-0, మహారాజ్‌ 4-0-23-2, అన్రిచ్‌ 3-0-41-0, మార్‌క్రమ్‌ 1-0-9-0.


దక్షిణాఫ్రికా:

బవుమా (సి) కోహ్లీ (బి) అర్ష్‌దీప్‌ 0, డికాక్‌ (నాటౌట్‌) 69, రిలీ (సి) కార్తీక్‌ (బి) అర్ష్‌దీప్‌ 0, మార్‌క్రమ్‌ (బి) అక్షర్‌ పటేల్‌ 33, మిల్లర్‌ (నాటౌట్‌) 106, ఎక్స్‌ట్రాలు: 13, మొత్తం: 20 ఓవర్లలో 221/3. వికెట్ల పతనం: 1-1, 2-1, 3-47, బౌలింగ్‌: దీపక్‌ 4-1-24-0, అర్ష్‌దీప్‌ 4-0-62-2, అశ్విన్‌ 4-0-37-0, అక్షర్‌ 4-0-53-1, హర్షల్‌ 4-0-45-0.

Read more