సన్‌రైజర్స్‌ గెలిచినా..!

ABN , First Publish Date - 2022-05-18T09:28:53+05:30 IST

వరుస ఐదు పరాజయాలకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్రేకులు వేసింది. ప్లేఆఫ్స్‌ ఆశలు ఏమూలైనా సజీవంగా నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ 3 పరుగులతో ముంబై

సన్‌రైజర్స్‌ గెలిచినా..!

రాహుల్‌ త్రిపాఠి అర్ధ శతకం

3 పరుగులతో ముంబై ఓటమి

పోరాడిన టిమ్‌ డేవిడ్‌


ముంబై: వరుస ఐదు పరాజయాలకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్రేకులు వేసింది. ప్లేఆఫ్స్‌ ఆశలు ఏమూలైనా సజీవంగా నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ 3 పరుగులతో ముంబై ఇండియన్స్‌పై ఉత్కంఠ విజయం సాధించింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ రాహుల్‌ త్రిపాఠి (44 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 76) అర్ధ శతకంతో.. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 193/6 స్కోరు చేసింది. పూరన్‌ (22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 38), ప్రియమ్‌ గార్గ్‌ (26 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42) రాణించారు. రమణ్‌దీప్‌ 3 వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో ముంబై ఓవర్లన్నీ ఆడి 7 వికెట్లకు 190 పరుగులే చేసింది. టిమ్‌ డేవిడ్‌ (18 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 46), రోహిత్‌ శర్మ (36 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 48) పోరాటం వృథా అయింది. ఉమ్రాన్‌ 3 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించినా.. సన్‌రైజర్స్‌కు ప్లేఆఫ్స్‌ బెర్త్‌ దక్కే అవకాశాలు కష్టమే.  


మలుపు తిప్పిన రనౌట్‌..: ఛేదనలో ఓపెనర్లు రోహిత్‌ శర్మ, ఇషాన్‌ (43).. తొలి వికెట్‌కు 95 పరుగుల భాగస్వామ్యంతో ముంబైకి ధనాధన్‌ ఆరంభాన్నిచ్చారు. రోహిత్‌ 3 సిక్స్‌లు బాదగా.. ఇషాన్‌ 4 ఫోర్లు కొట్టడంతో పవర్‌ప్లే ముగిసే సరికి ముంబై 51/0తో మెరుగైన స్థితిలో నిలిచింది. అయితే, ఆరు పరుగుల తేడాతో రోహిత్‌, ఇషాన్‌ అవుట్‌ కావడంతో ముంబై తడబడింది. హాఫ్‌ సెంచరీకి చేరువైన రోహిత్‌ను సుందర్‌ వెనక్కిపంపాడు. కాగా, ఇషాన్‌, తిలక్‌ వర్మ (8), సామ్స్‌ (15)ను ఉమ్రాన్‌ పెవిలియన్‌ చేర్చాడు.


కానీ, డేవిడ్‌ మాత్రం ధాటిగా ఆడుతూ ఆశలు రేకెత్తించాడు. చివరి 5 ఓవర్లలో 67 పరుగులు కావాల్సి ఉండగా.. స్టబ్స్‌ (2) రనౌటయ్యాడు. కానీ, నటరాజన్‌ వేసిన 18వ ఓవర్‌లో డేవిడ్‌ నాలుగు సిక్స్‌లతో 26 పరుగులు పిండుకోవడంతో.. సమీకరణం చివరి 12 బంతుల్లో 19 పరుగులుగా మారింది. కానీ, డేవిడ్‌ను నటరాజన్‌ రనౌట్‌ చేయడంతో మ్యాచ్‌ మలుపు తిరిగింది. 19వ ఓవర్‌లో సంజయ్‌ (0)ను అవుట్‌ చేసిన భుమీ మేడిన్‌ చేశాడు. ఆఖరి ఓవర్‌లో రమణ్‌దీప్‌ (14 నాటౌట్‌) 4, 6 బాదినా.. గెలిపించలేక పోయాడు. 


టాపార్డర్‌ అదుర్స్‌..: టాపార్డర్‌ రాణించడంతో.. సన్‌రైజర్స్‌ భారీ స్కోరు చేసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌.. అభిషేక్‌ (9)ను స్వల్ప స్కోరుకే కోల్పోయింది. కానీ, త్రిపాఠి.. విలియమ్సన్‌ స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన ప్రియమ్‌ గార్గ్‌తో కలసి రెండో వికెట్‌కు 78 పరుగులు, పూరన్‌తో కలసి మూడో వికెట్‌కు 76 రన్స్‌ భాగస్వామ్యంతో ఆదుకొన్నాడు. సంజయ్‌ వేసిన 4వ ఓవర్‌లో రెండు ఫోర్లతో జోరందుకున్న త్రిపాఠి.. బుమ్రా వేసిన ఆ తర్వాతి ఓవర్‌లో 6,4,4తో మొత్తం 15 పరుగులు రాబట్టాడు. గార్గ్‌ కూడా సిక్స్‌ బాదడంతో.. పవర్‌ప్లే ముగిసే సరికి హైదరాబాద్‌ 57/1తో నిలిచింది. కాగా, 10వ ఓవర్‌లో గార్గ్‌ను రమణ్‌దీప్‌ రిటర్న్‌ క్యాచ్‌తో వెనక్కిపంపాడు. ఈ దశలో త్రిపాఠికి జతకలసిన పూరన్‌ దూకుడుగా ఆడడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. అయితే, పూరన్‌ను మెరిడిత్‌ క్యాచ్‌ అవుట్‌ చేయగా.. త్రిపాఠి, మార్‌క్రమ్‌ (2)ను రమణ్‌దీప్‌ ఒకే ఓవర్‌లో పెవిలియన్‌ చేర్చడంతో డెత్‌లో పరుగుల వేగం మందగించింది. విలియమ్సన్‌ (8 నాటౌట్‌), సుందర్‌ (9) ధాటిగా ఆడలేకపోవడంతో.. చివరి 5 ఓవర్లలో సన్‌రైజర్స్‌ 45 పరుగులు మాత్రమే చేసింది. 


స్కోరుబోర్డు

సన్‌రైజర్స్‌: అభిషేక్‌ శర్మ (సి) మార్కండే (బి) సామ్స్‌ 9, ప్రియమ్‌ గార్గ్‌ (సి అండ్‌ బి) రమణ్‌దీప్‌ 42, రాహుల్‌ త్రిపాఠి (సి) తిలక్‌ (బి) రమణ్‌దీప్‌ 76, పూరన్‌ (సి) మార్కండే (బి) మెరెడిత్‌ 38, మార్‌క్రమ్‌ (సి) డేవిడ్‌ (బి) రమణ్‌దీప్‌ 2, విలియమ్సన్‌ (నాటౌట్‌) 8, వాషింగ్టన్‌ సుందర్‌ (బి) బుమ్రా 9, ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 20 ఓవర్లలో 193/6; వికెట్ల పతనం: 1-18, 2-96, 3-172, 4-174, 5-175, 6-193; బౌలింగ్‌: డానియెల్‌ సామ్స్‌ 4-0-39-1, మెరెడిత్‌ 4-0-44-1, సంజయ్‌ యాదవ్‌ 2-0-23-0, బుమ్రా 4-0-32-1, మార్కండే 3-0-31-0, రమణ్‌దీప్‌ సింగ్‌ 3-0-20-3. 


ముంబై: రోహిత్‌ (సి/సబ్‌) సుచిత్‌ (బి) వాషింగ్టన్‌ 48, ఇషాన్‌ కిషన్‌ (సి) గార్గ్‌ (బి) ఉమ్రాన్‌ 43, డేనియల్‌ సామ్స్‌ (సి) గార్గ్‌ (బి) ఉమ్రాన్‌ 15, తిలక్‌ వర్మ (సి) విలియమ్సన్‌ (బి) ఉమ్రాన్‌ 8, టిమ్‌ డేవిడ్‌ (రనౌట్‌) 46, ట్రిస్టన్‌ స్టబ్స్‌ (రనౌట్‌) 2, రమణ్‌దీప్‌ సింగ్‌ (నాటౌట్‌) 14, సంజయ్‌ యాదవ్‌ (సి/సబ్‌) సుచిత్‌ (బి) భువనేశ్వర్‌  0, బుమ్రా (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం: 20 ఓవర్లలో 190/7; వికెట్ల పతనం: 1-95, 2-101, 3-123, 4-127, 5-144, 6-175, 7-175; బౌలింగ్‌: ఫజల్లా ఫరూఖి 4-0-31-0, భువనేశ్వర్‌ 4-1-26-1, వాషింగ్టన్‌ సుందర్‌ 4-0-36-1, నటరాజన్‌ 4-0-60-0, ఉమ్రాన్‌ మాలిక్‌ 3-0-23-3, అభిషేక్‌ శర్మ 1-0-10-0.

Read more