ఎవరో.. ఆసియా హీరో?

ABN , First Publish Date - 2022-09-11T09:28:17+05:30 IST

అంచనాలకు అందనిరీతిలో సాగుతూ.. క్రికెట్‌ ప్రేమికులను అలరిస్తూ వచ్చిన ఆసియాకప్‌ ముగింపు దశకు చేరుకుంది.

ఎవరో..  ఆసియా హీరో?

నేడు పాక్‌ x లంక ఫైనల్‌

రాత్రి 7.30 గంటల నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..


ఆసియాకప్‌లో శ్రీలంక-పాకిస్థాన్‌ల మధ్య ఇది నాలుగో ఫైనల్‌. గతంలో రెండుసార్లు లంక, ఓసారి పాక్‌ నెగ్గాయి.


దుబాయ్‌: అంచనాలకు అందనిరీతిలో సాగుతూ.. క్రికెట్‌ ప్రేమికులను అలరిస్తూ వచ్చిన ఆసియాకప్‌ ముగింపు దశకు చేరుకుంది. ఆదివారం జరిగే తుది పోరులో పాకిస్థాన్‌-శ్రీలంక జట్లు టైటిల్‌ కోసం తలపడుతున్నాయి. ఈ రెండు జట్లూ తమ ఆరంభ మ్యాచ్‌ల్లో ఓడినప్పటికీ వరుస విజయాలతో చాంపియన్‌ పోరుకు అర్హత సాధించడం విశేషం. ఇక డిఫెండింగ్‌ చాంప్‌గా బరిలోకి దిగిన టీమిండియాకు సూపర్‌-4లోనే షాక్‌ తగిలిన విషయం తెలిసిందే. భారత్‌ కచ్చితంగా ఫైనల్‌కు చేరుతుందనిపించినా.. పాక్‌, శ్రీలంక చేతిలో పరాభవాలతో మూల్యం చెల్లించుకుంది. వాస్తవానికి ఈ టోర్నీ శ్రీలంకలోనే జరగాల్సి ఉన్నా.. అక్కడ నెలకొన్న రాజకీయ అస్థిర పరిస్థితుల దృష్ట్యా యూఏఈకి తరలింది.


అయితే ఎవరూ ఊహించని రీతిలో లంకేయులు తమ సమష్టి ఆటతీరుతో అదరగొడుతున్నారు. దీంతో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న అక్కడి ప్రజలకు తమ విజయాలతో సాంత్వన చేకూర్చినట్టయింది. అలాగే ఆసియాక్‌పలో అత్యధికంగా 11 సార్లు ఫైనల్‌కు వచ్చిన ఈ జట్టు ఆరో టైటిల్‌ను ఖాతాలో వేసుకుని వారిని మరింతగా మురిపించాలని చూస్తోంది. ఎలాగూ రోహిత్‌ సేన బరిలో లేదు కాబట్టి భారత అభిమానుల మద్దతు కూడా వీరికే లభించనుంది. ఇక శుక్రవారమే లంక చేతిలో ఓడిన పాక్‌ మరోసారి అదే జట్టుతో అమీతుమీ తేల్చుకోబోతోంది. లంకను సులువుగా తీసుకుంటే ఏం జరుగుతుందో తెలిసొచ్చింది కాబట్టి ఫైనల్‌ పోరు ఆసక్తికరంగా మారనుంది. పాక్‌ ఖాతాలో రెండు ఆసియాక్‌పలున్నాయి. 


బ్యాటింగ్‌, బౌలింగ్‌లో జోరు

అఫ్ఘాన్‌ చేతిలో చిత్తుగా ఓడినప్పటి నుంచి శ్రీలంక ఆటతీరులో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. ఛేదన ఎంతైనా అధిగమించేస్తామనే ఆత్మవిశ్వాసంతో ఆటగాళ్లంతా దూసుకెళుతున్నారు. చివరి 4 మ్యాచ్‌ల్లోనూ వారు ఇదే రీతిన నెగ్గారు. ముఖ్యంగా టాప్‌-5 బ్యాటర్ల ఆటతీరు లంకను ఆదుకుంటోంది. ఓపెనర్లు నిస్సాంక, కుశాల్‌ మెండిస్‌ చక్కటి ఆరంభాలను మిడిలార్డర్‌లో గుణతిలక, రాజపక్స, షనక ముందుకు తీసుకెళుతున్నారు. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో లంక బ్యాటర్లు 28 సిక్సర్లు, 62 ఫోర్లు బాదారంటే వారి దూకుడు అర్థం చేసుకోవచ్చు. ఇక బౌలర్లు రాణిస్తున్న తీరు అద్భుతం. శుక్రవారం మ్యాచ్‌లో పాక్‌ ఆరంభంలో పటిష్టంగా కనిపించినా చివరికి స్వల్ప స్కోరుకే కట్టడి చేసి షాక్‌ ఇచ్చారు. స్పిన్నర్లు హసరంగ, తీక్షణతో పాటు పేసర్‌ మదుశంక అండగా నిలుస్తున్నాడు.  


బాబర్‌ రాణిస్తేనే..

పాక్‌ జట్టుకు కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ పేలవ ఫామ్‌ ఆందోళనకరంగా మారింది. ఈ టోర్నీకి ముందు అద్భుత ఫామ్‌లో ఉన్న అతడు అనూహ్యంగా ఇక్కడ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో చేసింది 63 పరుగులే. లంక స్పిన్‌ ధాటికి పాక్‌ బ్యాటింగ్‌ కుప్పకూలింది. ఫైనల్‌కు చక్కటి వ్యూహంతో బరిలోకి దిగితేనే ఫలితం ఉంటుంది. టాపార్డర్‌లో రిజ్వాన్‌ ఫామ్‌ మాత్రమే బలంగా ఉంది. బౌలర్లు విశేషంగా రాణిస్తుండడం ఊరటనిస్తోంది. ముఖ్యంగా పేసర్లు నసీమ్‌ షా, రౌఫ్‌, హస్నైన్‌.. స్పిన్నర్లు షాదాబ్‌, నవాజ్‌ అదరగొడుతున్నారు.


తుది జట్లు (అంచనా)

శ్రీలంక:

నిస్సాంక, కుశాల్‌, అసలంక/ధనంజయ, గుణతిలక, రాజపక్స, షనక (కెప్టెన్‌), హసరంగ, కరుణరత్నె, తీక్ష ణ, మదుశన్‌/ఫెర్నాండో, మదుశంక.


పాకిస్థాన్‌:

రిజ్వాన్‌, బాబర్‌ ఆజమ్‌ (కెప్టెన్‌), ఫఖర్‌ జమాన్‌, ఇఫ్తికార్‌ అహ్మద్‌, షాదాబ్‌ ఖాన్‌, నవాజ్‌, ఆసిఫ్‌ అలీ, ఖుష్‌దిల్‌ షా, రౌఫ్‌, నసీమ్‌ షా, హస్నైన్‌. 

Updated Date - 2022-09-11T09:28:17+05:30 IST