పాక్‌ చచ్చీచెడి..

ABN , First Publish Date - 2022-09-08T10:19:44+05:30 IST

పాక్‌ చచ్చీచెడి..

పాక్‌ చచ్చీచెడి..

ఆసియా కప్‌లో ఫైనల్‌కు చేరిక జూ ఆదివారం లంకతో పోరు

పోరాడి ఓడిన అఫ్ఘానిస్థాన్‌


షార్జా: ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఓటమి అంచున నిల్చున్న పాకిస్థాన్‌.. నసీమ్‌ షా(14 నాటౌట్‌) వరుస సిక్స్‌లతో గట్టెక్కింది. సూపర్‌-4లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో వికెట్‌ తేడాతో అఫ్ఘానిస్థాన్‌పై నెగ్గిన పాక్‌.. ఆసియాకప్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆదివారం జరిగే టైటిల్‌ పోరులో శ్రీలంకతో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌ ఫలితంతో భారత్‌, అఫ్ఘాన్‌ జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి. తొలుత అఫ్ఘానిస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 129/6 స్కోరు చేసింది. ఇబ్రహీం జద్రాన్‌ (35), జజాయ్‌ (21) టాప్‌ స్కోరర్లు. రౌఫ్‌ 2 వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో పాక్‌ 19.2 ఓవర్లలో 9 వికెట్లకు 131 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ షాదాబ్‌ (36), ఇఫ్తికార్‌ (30) ఆదుకొన్నారు. ఫారూఖీ, ఫరీద్‌ చెరో 3 వికెట్లు పడగొట్టారు. లక్ష్యం స్వల్పమే అయినా.. అఫ్ఘాన్‌ బౌలర్ల పోరాటంతో పాక్‌ ఆపసోపాలు పడింది. ఓపెనర్‌ బాబర్‌ (0), ఫఖర్‌ జమాన్‌ (5), రిజ్వాన్‌ (20) స్వల్ప స్కోర్లకే వెనుదిరగడంతో.. 10 ఓవర్లు ముగిసేసరికి పాక్‌ 52/3తో ఇబ్బందుల్లో పడింది. అయితే, ఇఫ్తికార్‌, షాదాబ్‌ నాలుగో వికెట్‌కు 42 పరుగులు జోడించి జట్టును గాడిలో పెట్టారు. కానీ, ఇఫ్తికార్‌ను ఫరీద్‌.. షాదాబ్‌ను రషీద్‌ క్యాచ్‌ అవుట్‌ చేసి మ్యాచ్‌పై ఆశలు రేపారు. 18వ ఓవర్‌లో నవాజ్‌ (4), ఖుష్‌దిల్‌ (1)ను షారూఖీ అవుట్‌ చేయగా.. తర్వాతి ఓవర్‌లో రౌఫ్‌ (0), అసిఫ్‌ అలీ (16)ను ఫరీద్‌ పెవిలియన్‌ చేర్చాడు. దీంతో చివరి 6 బంతుల్లో 11 పరుగులు అవసరమవగా..  తీవ్ర ఉత్కంఠ నడుమ నసీమ్‌ సంచలన రీతిలో రెండు వరుస సిక్స్‌లతో మ్యాచ్‌ను ఫినిష్‌ చేశాడు. 


తడబాటు..: కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసిన పాక్‌.. అఫ్ఘాన్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేయగలిగింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన అఫ్ఘాన్‌కు ఓపెనర్లు జజాయ్‌, గుర్బాజ్‌ (17) ధనాధన్‌ ఆరంభాన్నిచ్చే ప్రయత్నం చేశారు. రెండో ఓవర్‌లోనే గుర్బాజ్‌ రెండు సిక్స్‌లతో 16 పరుగులు పిండుకోవడంతో.. పవర్‌ప్లేలో అదరగొడతారని భావించారు. అయితే, నాలుగో ఓవర్‌లో గుర్బాజ్‌ను రౌఫ్‌ బౌల్డ్‌ చేయడంతో.. తొలి వికెట్‌కు 36 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. జజాయ్‌ను హస్నైన్‌ అవుట్‌ చేయడంతో.. పవర్‌ప్లే ముగిసే సరికి అఫ్ఘాన్‌ 48/2తో నిలిచింది. ఈ దశలో జనత్‌ (15)తో కలసి మూడో వికెట్‌కు 35 పరుగులు జోడించిన జద్రాన్‌ ఆదుకొనే ప్రయత్నం చేశాడు. వీరి భాగస్వామ్యం బలపడుతున్న సమయంలో జనత్‌ను నవాజ్‌ పెవిలియన్‌ చేర్చాడు. అయితే, రౌఫ్‌ బౌలింగ్‌లో షాట్‌ ఆడే క్రమంలో జద్రాన్‌ పెవిలియన్‌ చేరాడు. ఆఖరి ఓవర్‌లో రషీద్‌ (18 నాటౌట్‌) సిక్స్‌, ఫోర్‌తో జట్టుకు గౌరవప్రద స్కోరు అందించాడు. 


సంక్షిప్త స్కోర్లు

అఫ్ఘానిస్థాన్‌: 20 ఓవర్లలో 129/6 (జద్రాన్‌ 35, జజాయ్‌ 21; రౌఫ్‌ 2/26).

పాకిస్థాన్‌: 19.2 ఓవర్లలో 131/9 (షాదాబ్‌ 36, ఇఫ్తికార్‌ 30; ఫరీద్‌ 3/31, ఫారూఖీ 3/31). 

Read more