సఫారీలకు ఊరట

ABN , First Publish Date - 2022-10-05T09:13:25+05:30 IST

కొండంత లక్ష్య ఛేదనలో.. ఆల్‌రౌండ్‌ వైఫల్యంతో రోహిత్‌ సేన ఘోర పరాజయాన్ని చవిచూసింది. దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీ్‌సను ఓటమితో ముగించింది.

సఫారీలకు ఊరట

శతకంతో చెలరేగిన రూసో

మూడో టీ20లో భారత్‌పై గెలుపు

ఇండోర్‌: కొండంత లక్ష్య ఛేదనలో.. ఆల్‌రౌండ్‌ వైఫల్యంతో రోహిత్‌ సేన ఘోర పరాజయాన్ని చవిచూసింది. దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీ్‌సను ఓటమితో ముగించింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ రైలీ రూసో (48 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 100 నాటౌట్‌) ధనాధన్‌ సెంచరీతోపాటు బౌలర్లు రాణించడంతో.. మంగళవారం జరిగిన మూడో, ఆఖరి టీ20లో సౌతాఫ్రికా 49 పరుగుల తేడాతో భారత్‌ను చిత్తుచేసింది. తొలుత సౌతాఫ్రికా 20 ఓవర్లలో 3 వికెట్లకు 227 పరుగులు చేసింది. డికాక్‌ (43 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 68) హాఫ్‌ సెంచరీ చేశాడు. దీపక్‌, ఉమేశ్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు. ఛేదనలో భారత్‌ 18.3 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌటైంది. దినేష్‌ కార్తీక్‌ (21 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 46), దీపక్‌ చాహర్‌ (17 బంతుల్లో 2 పోర్లు, 3 సిక్స్‌లతో 31) టాప్‌ స్కోరర్లు. ప్రిటోరియస్‌ మూడు.. పార్నెల్‌, ఎన్‌గిడి, కేశవ్‌ తలో రెండు వికెట్లు పడగొట్టారు. తొలి రెండు టీ20ల్లో నెగ్గిన టీమిండియా సిరీ్‌సను చేజిక్కించుకున్నా.. ఈ మ్యాచ్‌తో సౌతాఫ్రికా ఓదార్పు విజయాన్ని అందుకొంది. మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా సూర్యకుమార్‌ నిలిచాడు.


పెవిలియన్‌కు క్యూ:

భారీ లక్ష్య ఛేదనలో ఇన్నింగ్స్‌ రెండో బంతికే ఓపెనర్‌ రోహిత్‌ (0)ను రబాడ అవుట్‌ చేయడంతో.. భారత్‌ ఏదశలోనూ మ్యాచ్‌లోకి రాలేదు. క్రమం తప్పకుండా వికెట్లు చేజార్చుకొంది. వన్‌డౌన్‌లో వచ్చిన శ్రేయాస్‌ (1)ను పార్నెల్‌ ఎల్బీగా పంపాడు. అయితే, ఓపెనర్‌గా వచ్చిన పంత్‌ (27), దినేష్‌ కొద్దిసేపు మెరుపులు మెరిపించారు. ఎన్‌గిడి వేసిన 5వ ఓవర్‌లో 4,6,4,6తో చెలరేగిన పంత్‌.. అదే ఓవర్‌లో క్యాచ్‌ అవుటయ్యాడు. దీంతో మూడో వికెట్‌కు 41 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత పార్నెల్‌ బౌలింగ్‌లో కార్తీక్‌ 6,4,6తో దంచడంతో పవర్‌ప్లే ముగిసేసరికి భారత్‌ 64/3తో నిలిచింది. అయితే, కేశవ్‌ బౌలింగ్‌లో రెండు సిక్స్‌లు కొట్టిన దినేష్‌.. రివర్స్‌ స్వీప్‌ ఆడే క్రమంలో బౌల్డ్‌ అయ్యాడు. 8వ ఓవర్‌లో సూర్యకుమార్‌ (8) కూడా వెనుదిరగడంతో.. భారత్‌ పోరాటం దాదాపుగా ముగిసింది. 11వ ఓవర్‌లో సిక్స్‌, ఫోర్‌తో జట్టు స్కోరును సెంచరీ దాటించిన హర్షల్‌ (17)తో పాటు అక్షర్‌ (9), అశ్విన్‌ (2) స్వల్ప తేడాతో పెవిలియన్‌ చేరారు. అయితే, దీపక్‌, ఉమేశ్‌ (20 నాటౌట్‌) కొంత ప్రతిఘటించినా అది ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగింది. 


బాదుడే.. బాదుడు:

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సఫారీ ఇన్నింగ్స్‌లో రైలీ రూసో ఆటే హైలైట్‌. 24 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బతికి పోయిన రైలీ.. భారత బౌలర్ల భరతం పట్టాడు. అతడిని నియంత్రించేందుకు రోహిత్‌ పలు బౌలింగ్‌ మార్పులు చేసినా ఫలితం లేకపోయింది. ఓపెనర్‌ డికాక్‌తో కలసి రెండో వికెట్‌కు 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన రూసో.. స్టబ్స్‌ (23) జతగా మూడో వికెట్‌కు 87 పరుగులు జోడించడంతో సౌతాఫ్రికా భారీస్కోరు చేసింది. కెప్టెన్‌ బవుమా (3) ఎట్టకేలకు ఖాతా తెరిచినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. కానీ, డికాక్‌కు రూసో జత కలవడంతో స్కోరుబోర్డు దూసుకెళ్లింది. రెండు వరుస ఫోర్లతో ఖాతా తెరిచిన రైలీ.. ఎదురుదాడే లక్ష్యంగా బ్యాటింగ్‌ చేశాడు. అశ్విన్‌ వేసిన 9వ ఓవర్‌లో సిరాజ్‌ మిస్‌ ఫీల్డింగ్‌తో రూసోకు లైఫ్‌తోపాటు సిక్స్‌ ఇచ్చాడు.


ఆ తర్వాతి ఓవర్‌లో డికాక్‌ భారీషాట్‌తో అర్ధ శతకం పూర్తి చేసుకోగా.. జట్టు 10 ఓవర్లకు 96/1తో భారీస్కోరు దిశగా సాగింది. అయితే, శ్రేయాస్‌ మెరుపు ఫీల్డింగ్‌తో డికాక్‌ పెవిలియన్‌ చేరాడు. ఇక, చివరి 5 ఓవర్లలో సఫారీ బ్యాటర్లు మరింత విజృంభించడంతో ఏకంగా 73 పరుగులు లభించాయి. 19వ ఓవర్‌లో స్టబ్స్‌ ఫోర్‌తో జట్టు స్కోరు 200 మార్క్‌ దాటింది. కాగా, ఆఖరి ఓవర్‌లో స్టబ్స్‌ను చాహర్‌ అవుట్‌ చేసినా.. సింగిల్‌తో రూసో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక, మిల్లర్‌ (19 నాటౌట్‌) మూడు భారీ సిక్స్‌లు బాదడంతో మొత్తం 24 పరుగులు వచ్చాయి. 


స్కోర్‌ బోర్డు

దక్షిణాఫ్రికా:

డికాక్‌ (రనౌట్‌-అయ్యర్‌/పంత్‌) 68, బవుమా (సి) రోహిత్‌ (బి) ఉమేశ్‌ 3, రూసో (నాటౌట్‌) 100, స్టబ్స్‌ (సి) అశ్విన్‌ (బి) చాహర్‌ 23, మిల్లర్‌ (నాటౌట్‌) 19, ఎక్స్‌ట్రాలు 14, మొత్తం:20 ఓవర్లలో 227/3; వికెట్లపతనం: 1-30, 2-120, 3-207; బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 4-0-48-1, సిరాజ్‌ 4-0-44-0, అశ్విన్‌ 4-0-35-0, ఉమేశ్‌ 3-0-34-1, హర్షల్‌ 4-0-49-0, అక్షర్‌ 1-0-13-0.


భారత్‌:

రోహిత్‌ (సి) అండ్‌ (బి) రబాడ 0, పంత్‌ (సి) స్టబ్స్‌ (బి) ఎన్‌గిడి 27, శ్రేయాస్‌ (ఎల్బీ) పార్నెల్‌ 1, దినేశ్‌ కార్తీక్‌ (బి) మహరాజ్‌ 46, సూర్యకుమార్‌ (సి) స్టబ్స్‌ (బి) ప్రిటోరియస్‌ 8, అక్షర్‌ (సి) డికాక్‌ (బి) పార్నెల్‌ 9, హర్షల్‌ (సి) మిల్లర్‌ (బి) ఎన్‌గిడి 17, అశ్విన్‌ (సి) రబాడ (బి)మహరాజ్‌ 2, దీపక్‌ చాహర్‌ (సి) మిల్లర్‌ (బి) ప్రిటోరియస్‌ 31, ఉమేశ్‌ యాదవ్‌ (నాటౌట్‌) 20, సిరాజ్‌ (సి) మిల్లర్‌ (బి) ప్రిటోరియస్‌ 5, ఎక్స్‌ట్రాలు 12, మొత్తం: 18.3 ఓవర్లలో 178 ఆలౌట్‌, వికెట్ల పతనం: 1-0, 2-4, 3-45, 4-78, 5-86, 6-108, 7-114, 8-120, 9-168, బౌలింగ్‌: రబాడ 4-0-24-1, పార్నెల్‌ 4-0-41-2, ఎన్‌గిడి 3-0-51-2, కేశవ్‌ మహరాజ్‌ 4-0-34-2, ప్రిటోరియస్‌ 3.3-0-26-3. 

Read more