పంత్‌, పాండ్యా దంచేయగా..

ABN , First Publish Date - 2022-07-18T09:59:10+05:30 IST

260 పరుగుల ఓ మాదిరి ఛేదనలో.. పేసర్‌ టాప్లీ ధాటికి 38 పరుగులకే ధవన్‌, రోహిత్‌, కోహ్లీ పెవిలియన్‌కు చేరారు.

పంత్‌, పాండ్యా  దంచేయగా..

చివరి వన్డేలో భారత్‌ ఘనవిజయం

శతక్కొట్టిన రిషభ్‌  2-1తో సిరీస్‌ కైవసం

రిషభ్‌ పంత్‌ (113 బంతుల్లో 125 నాటౌట్‌)


ఆసియా ఆవల వన్డే సెంచరీ చేసిన మూడో భారత వికెట్‌కీపర్‌ పంత్‌. అంతకుముందు రాహుల్‌ ద్రవిడ్‌ (145), కేఎల్‌ రాహుల్‌ (112) కూడా ఈ ఫీట్‌ సాధించారు.


మూడు ఫార్మాట్లలోనూ ఒకే మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో 50+ రన్స్‌ చేయడంతోపాటు, బౌలింగ్‌లో 4+ వికెట్లు తీసిన రెండో క్రికెటర్‌ హార్దిక్‌. హఫీజ్‌ (పాక్‌) కూడా ఈ ఫీట్‌ సాధించాడు.


 ఇంగ్లండ్‌ గడ్డపై వన్డే సిరీస్‌ను గెలిచిన మూడో భారత కెప్టెన్‌గా రోహిత్‌. గతంలో అజరుద్దీన్‌, ధోనీ ఉన్నారు.


మాంచెస్టర్‌: 260 పరుగుల ఓ మాదిరి ఛేదనలో.. పేసర్‌ టాప్లీ ధాటికి 38 పరుగులకే ధవన్‌, రోహిత్‌, కోహ్లీ పెవిలియన్‌కు చేరారు. ఈ దశలో విజయంపై సందేహం వ్యక్తమైన వేళ.. రిషభ్‌ పంత్‌ (113 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్లతో 125 నాటౌట్‌) కెరీర్‌లో తొలి శతకంతో చెలరేగగా.. అటు హార్దిక్‌ పాండ్యా (55 బంతుల్లో 10 ఫోర్లతో 71) అర్ధసెంచరీతో తన ఆల్‌రౌండ్‌ ఫామ్‌ను చాటుకున్నాడు. దీంతో ఆదివారం జరిగిన మూడో వన్డేల్లో భారత్‌ 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. అలాగే మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో దక్కించుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ 45.5 ఓవర్లలో 259 పరుగులకు ఆలౌటైంది. బట్లర్‌ (60), రాయ్‌ (41), మొయిన్‌ అలీ (34), ఒవర్టన్‌ (32) రాణించారు. హార్దిక్‌కు 4, చాహల్‌కు 3, సిరాజ్‌కు 2 వికెట్లు దక్కాయి. ఛేదనలో భారత్‌ 42.1 ఓవర్లలో 5 వికెట్లకు 261 పరుగులు చేసి గెలిచింది. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా పంత్‌, మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా హార్దిక్‌ నిలిచారు. బుమ్రా గాయం కారణంగా దూరం కావడంతో సిరాజ్‌ బరిలోకి దిగాడు.


ఆదుకున్న హార్దిక్‌, పంత్‌:

ఆరంభంలోనే పేసర్‌ టాప్లీ.. ధవన్‌ (1), రోహిత్‌ (17), కోహ్లీ (17) వికెట్లను తీశాడు.   సూర్యకుమార్‌ (16) కూడా నిరాశపరచడంతో స్కోరు 72/4కి చేరింది. కానీ ఈసారి పంత్‌, హార్దిక్‌ రూపంలో ఇంగ్లండ్‌ బౌలర్లకు సవాల్‌ ఎదురైంది. వీరిద్దరూ నిలకడైన ఆటతీరుతో క్రీజులో పాతుకుపోయారు. చెత్త బంతులను ఫోర్లుగా మలుస్తూ సునాయాసంగా జట్టును ఛేదన వైపు నడిపించారు. ఆరంభంలో ఆచితూచి ఆడినా కుదురుకున్నాక ఇద్దరూ అర్ధసెంచరీలతో కదం తొక్కారు. 35వ ఓవర్‌లో పంత్‌ 4,6.. తర్వాతి ఓవర్‌లో హార్దిక్‌ రెండు ఫోర్లతో ఎదురుదాడికి దిగారు. అయితే విజయానికి 55 పరుగుల దూరంలో హార్దిక్‌ను కార్స్‌ అవుట్‌ చేయడంతో ఐదో వికెట్‌కు 133 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత పంత్‌ 106 బంతుల్లో కెరీర్‌లో తొలి సెంచరీని నమోదు చేశాడు. అనంతరం బ్యాట్‌ ఝుళిపిస్తూ విల్లే ఓవర్‌లో వరుసగా ఐదు ఫోర్లతో 21 రన్స్‌ సాధించాడు. ఇక జడేజా (7 నాటౌట్‌) విన్నింగ్‌ ఫోర్‌తో మరో 47 బంతులుండగానే మ్యాచ్‌ను ముగించాడు. 


కట్టడి చేసిన హార్దిక్‌:

ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ మైదానంలో జరిగిన చివరి తొమ్మిది మ్యాచ్‌ల్లో ఎనిమిది సార్లు ముందు బ్యాటింగ్‌ చేసిన జట్లే గెలిచాయి. అయినా టాస్‌ గెలిచిన రోహిత్‌ ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. అతడి నమ్మకాన్ని బౌలర్లు వమ్ము చేయలేదు.   మిడిలార్డర్‌లో బట్లర్‌, మొయిన్‌ అలీ పోరాటం ప్రదర్శించినా.. పేసర్‌ హార్దిక్‌ కీలక భాగస్వామ్యాలను విడదీస్తూ జట్టు భారీ స్కోరుకు కళ్లెం వేశాడు. అయితే  ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనేఓపెనర్‌ రాయ్‌ మూడు ఫోర్లతో చెలరేగినా, రెండో ఓవర్‌లో బెయిర్‌స్టో, రూట్‌లను డకౌట్‌ చేసిన సిరాజ్‌ భారత శిబిరంలో జోష్‌ నింపాడు. ఈ దశలో స్టోక్స్‌ (27)తో కలిసి రాయ్‌ మూడో వికెట్‌కు 54 పరుగులు జోడించాడు.


బ్యాటింగ్‌ పిచ్‌ కావడంతో ఇద్దరూ స్వేచ్ఛగా ఆడుతూ ఫోర్లు రాబట్టారు. దీంతో రన్‌రేట్‌ ఏడు పరుగులతో సాగింది. అయితే హార్దిక్‌ రాకతో ఆ జట్టుకు ఇబ్బందులు ఆరంభమయ్యాయి. తన తొలి ఓవర్‌లోనే రాయ్‌ను మెయిడిన్‌ వికెట్‌గా పడగొట్టగా.. కాసేపటికే స్టోక్స్‌ను రిటర్న్‌ క్యాచ్‌తో పెవిలియన్‌కు చేర్చాడు. ఈ సమయంలో బట్లర్‌, మొయిన్‌ అలీ జోడీ వికెట్‌ను కాపాడుకునే క్రమంలో నెమ్మదిగా ఆడడంతో ఏడు ఓవర్లలో 16 రన్స్‌ మాత్రమే వచ్చాయి. అయితే 23వ ఓవర్‌లో అలీ 4,4,6తో 18 పరుగులు రాబట్టి స్కోరులో కాస్త కదలిక తెచ్చాడు. అదే ఊపులో 26వ ఓవర్‌లో చెరో సిక్సర్‌తో మురిపించారు. కానీ అలీ వికెట్‌ను జడేజా తీయడంతో ఐదో వికెట్‌కు 75 పరుగుల కీలక భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత లివింగ్‌స్టోన్‌తో కలిసి బట్లర్‌ కుదురుకోవంతో స్కోరు 300కు చేరుతుందనిపించింది. కానీ 37వ ఓవర్‌లో హార్దిక్‌ ఈ ఇద్దరినీ అవుట్‌ చేసి ఆ జట్టును చావుదెబ్బ తీశాడు. ఆ తర్వాత ఒవర్టన్‌ పోరాడినా మరో ఎండ్‌లో చాహల్‌ జోరుకు మరో 25 బంతులుండగానే ఇన్నింగ్స్‌ ముగిసింది.

 

స్కోరుబోర్డు

ఇంగ్లండ్‌:

జేసన్‌ రాయ్‌ (సి) పంత్‌ (బి) పాండ్యా 41, బెయిర్‌స్టో (సి) సబ్‌-శ్రేయాస్‌ (బి) సిరాజ్‌ 0, జో రూట్‌ (సి) రోహిత్‌ (బి) సిరాజ్‌ 0, స్టోక్స్‌ (సి అండ్‌ బి) పాండ్యా 27, బట్లర్‌ (సి) జడేజా (బి) పాండ్యా 60, అలీ (సి) పంత్‌ (బి) జడేజా 34, లివింగ్‌స్టోన్‌ (సి) జడేజా (బి) పాండ్యా 27, విల్లే (సి) సూర్యకుమార్‌ (బి) చాహల్‌ 18, ఓవర్టన్‌ (సి) కోహ్లీ (బి) చాహల్‌ 32, కార్స్‌ (నాటౌట్‌) 3, టాప్లీ (బి) చాహల్‌ 0, ఎక్స్‌ట్రాలు: 17; మొత్తం: 45.5 ఓవర్లలో 259 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-12, 2-12, 3-66, 4-74, 5-149, 6-198, 7-199, 8-247, 9-257, 10-259; బౌలింగ్‌: షమి 7-0-38-0, సిరాజ్‌ 9-1-66-2, ప్రసిద్ధ్‌ 9-0-48-0, హార్దిక్‌ పాండ్యా 7-3-24-4, చాహల్‌ 9.5-0-60-3, జడేజా 4-0-21-1.


భారత్‌:

రోహిత్‌ (సి) రూట్‌ (బి) టాప్లీ 17, ధవన్‌ (సి) రాయ్‌ (బి) టాప్లీ 1, కోహ్లీ (సి) బట్లర్‌ (బి) టాప్లీ 17, పంత్‌ (నాటౌట్‌) 125, సూర్యకుమార్‌ (సి) బట్లర్‌ (బి) ఓవర్టన్‌ 16, హార్దిక్‌ (సి) స్టోక్స్‌ (బి) కార్స్‌ 71, జడేజా (నాటౌట్‌) 7, ఎక్స్‌ట్రాలు 7, మొత్తం: 42.1 ఓవర్లలో 261/5; వికెట్లపతనం: 1-13, 2-21, 3-38, 4-72, 5-205; బౌలింగ్‌: టాప్లీ 7-1-35-3, విల్లే 7-0-58-0, కార్స్‌ 8-0-45-1, మొయిన్‌ 8-0-33-0, ఓవర్టన్‌ 8-0-54-1, స్టోక్స్‌ 2-0-14-0, లివింగ్‌స్టోన్‌ 2-0-14-0, రూట్‌ 0.1-0-4-0.

Read more