Asia Cup Final: శ్రీలంకపై టాస్ గెలిచిన పాకిస్థాన్

ABN , First Publish Date - 2022-09-12T00:51:28+05:30 IST

ఆసియాకప్ తుది అంకానికి చేరుకుంది. శ్రీలంకతో మరికాసేపట్లో జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి

Asia Cup Final: శ్రీలంకపై టాస్ గెలిచిన పాకిస్థాన్

దుబాయ్: ఆసియాకప్ తుది అంకానికి చేరుకుంది. శ్రీలంకతో మరికాసేపట్లో జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ రెండు జట్లు  తమ ఆరంభ మ్యాచ్‌ల్లో పరాజయం పాలయ్యాయి. ఆ తర్వాత మాత్రం వరుస విజయాలతో చాంపియన్‌ పోరుకు అర్హత సాధించాయి. డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన టీమిండియా సూపర్‌-4లోనే ఇంటిముఖం పట్టింది. వాస్తవానికి ఈ టోర్నీ శ్రీలంకలోనే జరగాల్సి ఉన్నా.. అక్కడ నెలకొన్న రాజకీయ అస్థిర పరిస్థితుల దృష్ట్యా యూఏఈకి తరలిపోయింది. నిజానికి ఈ టోర్నీలో శ్రీలంక పుంజుకున్న తీరు అమోఘం. సమష్టి ఆటతీరుతో లంకేయులు అదరగొడుతున్నారు. ఆసియాక్‌పలో అత్యధికంగా 11 సార్లు ఫైనల్‌కు వచ్చిన ఈ జట్టు ఆరో టైటిల్‌ను ఖాతాలో వేసుకోవాలని గట్టి పట్టుదలగా ఉంది. శుక్రవారం లంక చేతిలో ఓడిన పాక్‌ మరోసారి అదే జట్టుతో అమీతుమీ తేల్చుకోబోతోంది. లంకను సులువుగా తీసుకుంటే ఏం జరుగుతుందో తెలిసొచ్చింది కాబట్టి ఫైనల్‌ పోరు ఆసక్తికరంగా మారనుంది. పాక్‌ ఖాతాలో రెండు ఆసియాకప్‌లు ఉన్నాయి. 


 అఫ్ఘాన్‌ చేతిలో చిత్తుగా ఓడినప్పటి నుంచి శ్రీలంక ఆటతీరులో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. ఛేదన ఎంతైనా అధిగమించేస్తామనే ఆత్మవిశ్వాసంతో ఆటగాళ్లంతా దూసుకెళుతున్నారు. చివరి 4 మ్యాచ్‌ల్లోనూ వారు ఇదే రీతిన నెగ్గారు. ముఖ్యంగా టాప్‌-5 బ్యాటర్ల ఆటతీరు లంకను ఆదుకుంటోంది. ఓపెనర్లు నిస్సాంక, కుశాల్‌ మెండిస్‌ చక్కటి ఆరంభాలను మిడిలార్డర్‌లో గుణతిలక, రాజపక్స, షనక ముందుకు తీసుకెళుతున్నారు. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో లంక బ్యాటర్లు 28 సిక్సర్లు, 62 ఫోర్లు బాదారంటే వారి దూకుడు అర్థం చేసుకోవచ్చు. ఇక బౌలర్లు రాణిస్తున్న తీరు అద్భుతం. శుక్రవారం మ్యాచ్‌లో పాక్‌ ఆరంభంలో పటిష్టంగా కనిపించినా చివరికి స్వల్ప స్కోరుకే కట్టడి చేసి షాక్‌ ఇచ్చారు. స్పిన్నర్లు హసరంగ, తీక్షణతో పాటు పేసర్‌ మదుశంక అండగా నిలుస్తున్నాడు.  


ఇక పాకిస్థాన్ విషయానికి వస్తే.. కెప్టెన్‌ బాబర్‌ ఆజం పేలవ ఫామ్‌ ఆందోళనకరంగా మారింది. ఈ టోర్నీకి ముందు అద్భుత ఫామ్‌లో ఉన్న అతడు అనూహ్యంగా ఇక్కడ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో చేసింది 63 పరుగులే. కాబట్టి ఫైనల్‌కు చక్కటి వ్యూహంతో బరిలోకి దిగితేనే ఫలితం ఉంటుంది. టాపార్డర్‌లో రిజ్వాన్‌ ఫామ్‌ మాత్రమే బలంగా ఉంది. బౌలర్లు విశేషంగా రాణిస్తుండడం ఊరటనిస్తోంది. ముఖ్యంగా పేసర్లు నసీమ్‌ షా, రౌఫ్‌, హస్నైన్‌.. స్పిన్నర్లు షాదాబ్‌, నవాజ్‌ అదరగొడుతున్నారు. పాకిస్థాన్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. షాదాబ్, నసీమ్ షా తిరిగి జట్టులోకి రాగా, ఉస్మాన్, హాసన్‌లు బెంచ్‌కు పరిమితమయ్యారు. శ్రీలంక మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది.

Read more