MS Dhoni: నేను టెన్త్ పాసవనని నా తండ్రి బలంగా నమ్మేవారు: ధోనీ

ABN , First Publish Date - 2022-10-12T00:41:17+05:30 IST

టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ (MS Dhoni) గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. భారత క్రికెట్‌కు

MS Dhoni: నేను టెన్త్ పాసవనని నా తండ్రి బలంగా నమ్మేవారు: ధోనీ

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ (MS Dhoni) గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. భారత క్రికెట్‌కు ధోనీ చేసిన సేవల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒంటి చేత్తే ఎన్నో విజయాలు అందించాడు. ఐసీసీ ట్రోఫీలన్నీ దేశానికి తీసుకొచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను కూడగట్టుకున్నాడు. సాధించిన రికార్డులతో అతడి పేరు చరిత్ర పుటల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది. ఎన్నో, ఎన్నెన్నో విజయాలతో క్రికెట్‌లో భారత్‌కు ఖండాంతర ఖ్యాతిని అందించిపెట్టిన ధోనీ(MS Dhoni) చదువుల్లో మాత్రం అంత గుడ్ బాయ్ ఏమీ కాదు. తాజా, ధోనీ (MS Dhoni) వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఓ స్కూలు విద్యార్థులతో మాట్లాడుతూ.. తన విద్యార్థి జీవితం గురించి చెప్పుకొచ్చాడు. 


తాను పదో తరగతి పాస్ అవుతానని తన తండ్రి అనుకోలేదంటూ చదువులో తాను ఎంత వెనకబడి ఉన్నదీ విద్యార్థులకు వివరించాడు. ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటన్న ప్రశ్నకు ధోనీ స్పందిస్తూ.. స్పోర్ట్స్‌కు ఆ అర్హత ఉందా? అని ప్రశ్నించిన ధోనీ..  ఏడో తరగతిలో తాను క్రికెట్ ఆడడం ప్రారంభించినప్పటి వరకు తాను సగటు విద్యార్థినని, ఆ తర్వాతి నుంచి తన హాజరు క్రమంగా తగ్గుతూ వచ్చిందని వివరించాడు. వాటిని పక్కన పెడితే తాను మంచి విద్యార్థినని పేర్కొన్నాడు. పదో తరగతిలో 66శాతం మార్కులు వచ్చాయని గుర్తు చేసుకున్నాడు. 12 క్లాస్‌లో 56-57 శాతం మార్కులు వచ్చాయని పేర్కొన్నాడు. 


‘‘నేను ఎప్పుడూ ఆడుతుండడంతో నా హాజరు చాలా తక్కువగా ఉండేది. కాబట్టి కొంచెం కష్టంగా ఉండేది. కానీ నేను సగటు విద్యార్థిని. టెన్త్ క్లాసులో కొన్ని చాప్టర్లు గురించి కూడా తెలిసేది కాదు. కాబట్టి ఆయా చాప్టర్ల నుంచి ప్రశ్నలు వస్తే ఏం రాయలన్నది కూడా తెలిసేది కాదు. ఆ చాప్టర్ల నుంచి ప్రశ్నలు వచ్చాయా? ఇక నా పని అయిపోయినట్టే!’’ అని ఆ వీడియోలో ధోనీ చమత్కరించాడు. తాను పాసవనని తన తండ్రి బలంగా నమ్మేవారని, కానీ తాను పాసయ్యాక ఆ విషయాన్ని ఆయనకు పదేపదే చెప్పేవాడినని పేర్కొన్నాడు.  


41 ఏళ్ల ధోనీ క్రికెట్‌లో ఇంకా యాక్టివ్‌గానే ఉన్నాడు. 2020లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నప్పటికీ ఐపీఎల్‌లో ఆడుతూ అభిమానులను అలరిస్తున్నాడు. వచ్చే ఏడాది కూడా ఐపీఎల్‌లో ఆడతానని ఇప్పటికే ప్రకటించాడు. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్‌కు సారథ్యం వహిస్తున్నాడు.  



Updated Date - 2022-10-12T00:41:17+05:30 IST