రాహుల్ గొప్ప మనస్సు
ABN , First Publish Date - 2022-02-23T09:06:19+05:30 IST
అరుదైన వ్యాధితో బాధపడు తున్న ఓ చిన్నారిని భారత స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ ప్రాణా పాయం నుంచి కాపాడాడు.

చిన్నారి సర్జరీకి రూ. 31 లక్షల సాయం
బెంగళూరు: అరుదైన వ్యాధితో బాధపడు తున్న ఓ చిన్నారిని భారత స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ ప్రాణా పాయం నుంచి కాపాడాడు. 11 ఏళ్ల వరద్ గతేడాది నుంచి అప్లాస్టిక్ ఎనీమియాతో బాధపడుతున్నాడు. అతడి శరీరం కొత్త రక్త కణాలను ఉత్పత్తి చేసే పరిస్థితిలో లేకపోవడంతో రక్తస్రావం అయితే ఆగడమంటూ ఉండదు. జ్వరం వచ్చినా తగ్గేందుకు కొన్ని నెలల సమయం పడుతుంది. దీనికి బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్‌ను సరైన చికిత్సగా డాక్టర్లు తేల్చారు. కానీ ఇందుకు ఏకంగా రూ.35 లక్షలు అవసరపడడంతో అంత డబ్బు ఖర్చు పెట్టలేని అతడి తల్లిదండ్రులు ‘గివ్ ఇండియా’ ద్వారా నిధులు సేకరించాలనుకున్నారు. ఈ విషయం తెలిసిన రాహుల్ రూ.31 లక్షల భారీ ఆర్థిక సహాయాన్ని అందించాడు. దీంతో సర్జరీ విజయవంతమై ప్రస్తుతం వరద్ కోలుకుం టున్నాడు. అలాగే రాహుల్ దాతృత్వాన్ని అభిమానులు కూడా ప్రశంసిస్తున్నారు.