Chennai street girls: అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ పోటీలకు చెన్నై వీధి బాలికలు

ABN , First Publish Date - 2022-09-29T14:29:06+05:30 IST

ఆప్యాయంగా పలకరించేందుకు ఎవరూ లేక, ఆకలిదప్పులతో ప్లాట్‌ఫామ్‌లపై నివసించే నగరానికి చెందిన తొమ్మిదిమంది బాలికలు ఖతార్‌లో

Chennai street girls: అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ పోటీలకు చెన్నై వీధి బాలికలు

చెన్నై, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఆప్యాయంగా పలకరించేందుకు ఎవరూ లేక, ఆకలిదప్పులతో ప్లాట్‌ఫామ్‌లపై నివసించే నగరానికి చెందిన తొమ్మిదిమంది బాలికలు ఖతార్‌లో జరుగనున్న చైల్ట్‌ ఫుట్‌బాల్‌ వరల్డ్‌ కప్‌ 2022 పోటీల్లో భారత జట్టు తరఫున ఎంపికయ్యారు. స్థానిక తండయార్‌పేటలోని కరుణాలయ సంస్థ ఈ వీధి బాలికలకు ఆశ్రయం కల్పించింది. గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌(Greater Chennai Corporation), అజీమ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌, అమోస్‌ ట్రస్ట్‌ (యుకె) సంస్థల సహకారంతో ఈ తొమ్మిదిమంది బాలికలు అంతర్జాతీయ స్థాయిలో ఫుట్‌బాల్‌ క్రీడల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ జట్టుకు కెప్టెన్‌ సంధ్య ఈ విషయమై మాట్లాడుతూ.. తనకు తండ్రి లేడని, తల్లి కోయంబేడు మార్కెట్‌లో కూరగాయలు అమ్ముతోందని, ఉండేందు కు ఇల్లు కూడా లేని పేదరికంతో కొటుమిట్టాడుతున్నామని తెలిపింది. తనతోపాటు వీధుల్లో నివసించే ఎనిమిదిమంది బాలికలను కూడా కరుణాలయ సెంటర్‌ సంస్థ ఆశ్రయమిచ్చిందన్నారు. యేళ్ల తరబడి పేదరికంతో ఆకలిదప్పులతో గడిపిన తామంతా ప్రస్తుతం భారత దేశ కీర్తి చాటేలా పుట్‌బాల్‌ పోటీల్లో పాల్గొనబోతుండటం సంతోషంగా ఉందని తెలిపింది. అక్టోబర్‌ 6 నుంచి 16 వరకు 24 దేశాలకు చెందిన వీథిబాలికల(Street girls) ఫుట్‌బాల్‌ జట్లు ఖతార్‌ రాజధాని దోహాలో అంతర్జాతీయ పోటీలలో పాల్గొననున్నాయని వివరించారు. ఈ జట్టు సభ్యురాలు ప్రియ (17) మాట్లాడుతూ తనకు తల్లిదండ్రులు లేరని, ఐదేళ్ల క్రితం నుంచి ఫుట్‌బాల్‌పై శిక్షణ పొందుతున్నానని, సంధ్యా నాయకత్వంలో తామంతా తొలిసారి విమానంలో ప్రయాణించనుండటం కూడా తమకు సంతోషం కలిగిస్తోందని వివరించింది. ఈ తొమ్మిదిమంది బాలికలకు కోచ్‌ల ద్వారా శిక్షణ ఇస్తున్నట్లు కరుణాలయ సెంటర్‌ నిర్వాహకుడు డాక్టర్‌ ఎన్‌. పాల్‌సుందర్‌ తెలిపారు.

Updated Date - 2022-09-29T14:29:06+05:30 IST