సిరీస్‌ మనదే

ABN , First Publish Date - 2022-02-19T08:27:11+05:30 IST

టీమిండియా జోరు కొనసాగుతూనే ఉంది. వన్డేల మాదిరే టీ20 సిరీస్‌ను కూడా ఖాతాలో వేసుకుంది. ముందుగా విరాట్‌ కోహ్లీ ఫామ్‌ను చాటుకోగా.. పంత్‌ మెరుపులు మెరిపించాడు.

సిరీస్‌ మనదే

  • రెండో టీ20లోనూ భారత్‌ విజయం 
  • పోరాడిన విండీస్‌ 


టీమిండియా జోరు కొనసాగుతూనే ఉంది. వన్డేల మాదిరే టీ20 సిరీస్‌ను కూడా ఖాతాలో వేసుకుంది. ముందుగా విరాట్‌ కోహ్లీ ఫామ్‌ను చాటుకోగా.. పంత్‌ మెరుపులు మెరిపించాడు. అయితే ఛేదనలో ఈసారి విండీస్‌ అంత సులువుగా లొంగలేదు. రోవ్‌మన్‌ పావెల్‌, నికోలస్‌ పూరన్‌ తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో భారత్‌ను వణికించారు. కానీ డెత్‌ ఓవర్లలో భువనేశ్వర్‌, హర్షల్‌ పటేల్‌ మాయతో రోహిత్‌ సేన గట్టెక్కింది.


కోల్‌కతా: సిరీస్‌లో గెలిచి నిలవాలనుకున్న వెస్టిం డీస్‌కు అదృష్టం కలిసిరాలేదు.  ఉత్కంఠగా ముగిసిన రెండో టీ20లో భారత్‌ 8 పరుగుల తేడాతో గెలిచింది. రోవ్‌మన్‌ పావెల్‌ (36 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 68 నాటౌట్‌) ఆఖరి బంతి వరకు పోరాడినా ఫలితం లేకపోయింది. 19వ ఓవర్‌లో భువనేశ్వర్‌ 4 పరుగులే ఇచ్చి నికోలస్‌ పూరన్‌ (62) వికెట్‌ తీయడంతో మ్యాచ్‌ భారత్‌ వైపు మొగ్గింది. అలాగే ఆఖరి ఓవర్‌ను హర్షల్‌ పటేల్‌ కూడా అద్భుతంగా నియంత్రించాడు. దీంతో మరో మ్యాచ్‌ ఉండగానే రోహిత్‌ సేన 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా భారత్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 186 పరుగులు చేసింది.


విరాట్‌ కోహ్లీ (41 బంతుల్లో 7 ఫోర్లు ఓ సిక్సర్‌తో 52), రిషభ్‌ పంత్‌ (28 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 52 నాటౌట్‌) అర్ధ సెంచరీలు సాధించగా.. వెంకటేశ్‌ అయ్యర్‌ (33) వేగంగా ఆడాడు. చేజ్‌ 3 వికెట్లు తీశాడు. ఛేదనలో విండీస్‌ 20 ఓవర్లలో 178/3 స్కోరే చేసింది. భువనేశ్వర్‌, చాహల్‌, బిష్ణోయ్‌కు ఒక్కో వికెట్‌ దక్కింది. పొలార్డ్‌కిది 100వ అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ కావడం విశేషం. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా పంత్‌ నిలిచాడు. 


పూరన్‌-పావెల్‌ పోరాడినా..: ఛేదనలో విండీస్‌ ఓపెనర్లు మేయర్స్‌ (9), కింగ్‌ (22) స్పిన్‌ ఆడలేక స్వల్పస్కోర్లకే వెనుదిరిగారు. కానీ ఫామ్‌లో ఉన్న పూరన్‌తో పాటు పావెల్‌ బౌలర్లకు చుక్కలు చూపిం చారు. ఏడో ఓవర్‌లో వరుసగా 6,4తో బ్యాట్‌కు పనిచెప్పిన పూరన్‌ ఆ తర్వాతా అదే జోరు సాగిం చాడు. అతను 21 రన్స్‌ వద్ద ఉన్నప్పుడు బిష్ణోయ్‌ క్యాచ్‌ వదిలేశాడు. అతడికి జతగా పావెల్‌ కూడా బ్యాట్‌ ఝుళిపిస్తూ భారీ సిక్సర్లతో చెలరేగాడు. దీనికి తోడు అతడిచ్చిన క్యాచ్‌ను భువనేశ్వర్‌ అందుకోలేక పోయాడు. అటు 34 బంతుల్లో పూరన్‌ ఓ సిక్సర్‌తో వరుసగా రెండో అర్ధసెంచరీ పూర్తి చేయగా.. పావెల్‌ 28 బంతుల్లోనే ఈ ఫీట్‌ సాధించాడు. ఇలా మ్యాచ్‌ విండీస్‌ వైపు మొగ్గు చూపుతున్న వేళ 19వ ఓవర్‌లో భువీ ఊపిరిపోశాడు.


పూరన్‌ వికెట్‌ తీయ డంతో మూడో వికెట్‌కు 100 పరుగుల కీలక భాగస్వా మ్యం ముగిసింది. ఇక ఆఖరి ఓవర్‌లో 25 పరుగులు అవసరపడగా హర్షల్‌ మొదట రెండు సింగిల్స్‌ ఇచ్చాడు. అయితే మూడు, నాలుగో బంతిని పావెల్‌ సిక్సర్లుగా మార్చి ఉత్కంఠ పెంచాడు. కానీ ఆ తర్వాత స్లో బంతులకు సింగిల్స్‌ మాత్రమే రావడంతో విండీస్‌ కథ ముగిసింది.


ఆరంభంలో విరాట్‌.. చివర్లో పంత్‌: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు శుభారంభం దక్కలేదు. రెండో ఓవర్‌లోనే ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ (2) వికెట్‌ను కోల్పోయింది.  కానీ మరోవైపు ఫామ్‌ చాటుకున్న విరాట్‌ బ్యాట్‌ ఝుళిపించగా.. చివరి ఓవర్లలో పంత్‌, వెంకటేశ్‌ రఫ్ఫాడించి 35 బంతుల్లోనే 76 పరుగులం దించారు. దీంతో భారత్‌కు భారీస్కోరు సాధ్యమైంది. అంతకుముందు రెండో ఓవర్‌లోనే బరిలోకి దిగిన కోహ్లీ ఆరంభం నుంచే బౌండరీలతో హోరెత్తించాడు. మూడు, ఆరో ఓవర్లలో రెండేసి ఫోర్లతో చెలరేగాడు. మరోవైపు సహజశైలిలో ఆడలేకపోయిన రోహిత్‌ శర్మ (19), సూర్యకుమార్‌ (8)లను చేజ్‌ వరుస ఓవర్లలో అవుట్‌ చేశాడు.


జోరు మీదున్న కోహ్లీ అద్భుత సిక్సర్‌తో 39 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేయగా.. అతడిని కూడా చేజ్‌ సూపర్‌ బంతితో క్లీన్‌ బౌల్డ్‌ చేయడంతో 106/4 స్కోరుతో భారత్‌ తడబడి నట్టు కనిపించింది. ఈ దశలో పంత్‌, వెంకటేశ్‌ విండీస్‌పై ఎదురుదాడికి దిగారు. 15వ ఓవర్‌లో పంత్‌ 3 ఫోర్లు, మరుసటి ఓవర్‌లో అయ్యర్‌ 2 ఫోర్లతో జట్టు రన్‌రేట్‌ దూసుకెళ్లిం ది. అలాగే ఇద్దరూ భారీ సిక్సర్లతో మరింత ఒత్తిడి పెంచారు. అయితే ఆఖరి ఓవర్‌లో షెఫర్డ్‌ 7 పరుగులే ఇచ్చి సూపర్‌ యార్కర్‌తో అయ్యర్‌ను బౌల్డ్‌ చేశాడు. అజేయంగా నిలిచిన పంత్‌ 27 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేశాడు.


2 టీ20ల్లో భారత్‌పై ఉత్తమ గణాంకాలు (3/25) నమోదు చేసిన రెండో ఆఫ్‌ స్పిన్నర్‌ రోస్టన్‌ చేజ్‌. జోహన్‌ బోతా (3/16) ముందున్నాడు.



పంత్‌ సాధించిన మూడు ఫిఫ్టీలు విండీస్‌పైనే కావడం విశేషం.


స్కోరుబోర్డు

భారత్‌: రోహిత్‌ (సి) కింగ్‌ (బి) చేజ్‌ 19; ఇషాన్‌ (సి) మేయర్స్‌ (బి) కాట్రెల్‌ 2; కోహ్లీ (బి) చేజ్‌ 52; సూర్యకుమార్‌ (సి అండ్‌ బి) చేజ్‌ 8; పంత్‌ (నాటౌట్‌) 52; వెంకటేశ్‌ అయ్యర్‌ (బి) షెఫర్డ్‌ 33; హర్షల్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 19; మొత్తం: 20 ఓవర్లలో 186/5. వికెట్ల పతనం: 1-10, 2-59, 3-72, 4-106, 5-182. బౌలింగ్‌: హొసేన్‌ 4-0-30-0; కాట్రెల్‌ 3-1-20-1; హోల్డర్‌ 4-0-45-0; షెఫర్డ్‌ 3-0-34-1; చేజ్‌ 4-0-25-3; ఒడీన్‌ స్మిత్‌ 1-0-10-0; పొలార్డ్‌ 1-0-14-0.


వెస్టిండీస్‌: కింగ్‌ (సి) సూర్యకుమార్‌ (బి) బిష్ణోయ్‌ 22; మేయర్స్‌ (సి అండ్‌ బి) చాహల్‌ 9; పూరన్‌ (సి) బిష్ణోయ్‌ (బి) భువనేశ్వర్‌ 62; పావెల్‌ (నాటౌట్‌) 68; పొలార్డ్‌ (నాటౌట్‌) 3; ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం: 20 ఓవర్లలో 178/3. వికెట్ల పతనం: 1-34, 2-59, 3-159. బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-29-1; దీపక్‌ చాహర్‌ 4-0-40-0; చాహల్‌ 4-0-31-1; హర్షల్‌ పటేల్‌ 4-0-46-0; రవి బిష్ణోయ్‌ 4-0-30-1.

Updated Date - 2022-02-19T08:27:11+05:30 IST