మెరిసిన మేఘన

ABN , First Publish Date - 2022-10-04T08:56:28+05:30 IST

తెలుగమ్మాయి మేఘన సబ్బినేని (53 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌తో 69) మెరిసింది.

మెరిసిన మేఘన

కెరీర్‌ తొలి హాఫ్‌ సెంచరీ

మలేసియాపై భారత్‌ గెలుపు


సిల్హెట్‌: తెలుగమ్మాయి మేఘన సబ్బినేని (53 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌తో 69) మెరిసింది. టీ20 కెరీర్‌లో తొలిసారి హాఫ్‌ సెంచరీ సాధించింది. మరో ఓపెనర్‌ షఫాలీ వర్మ (39 బంతుల్లో ఫోర్‌, 3 సిక్స్‌లతో 46) సుదీర్ఘకాల ఫామ్‌లేమికి చెక్‌ పెట్టింది. దాంతో ఆసియా కప్‌లో హర్మన్‌సేన రెండో విజయం సాధించింది. సోమవారం వర్షం బారిన పడిన మ్యాచ్‌లో భారత్‌ 30 పరుగులతో (డ/లూ పద్ధతి) మలేసియాను ఓడించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 181/4 స్కోరు చేసింది. కీపర్‌ రిచా ఘోష్‌ (33 నాటౌట్‌) సత్తాచాటింది. ఛేదనలో మలేసియా 5.2 ఓవర్లలో 16/2 స్కోరుతో ఉన్న దశలో వర్షం కురవడంతో మ్యాచ్‌ సాధ్యం కాలేదు. దాంతో డక్‌వర్త్‌/లూయిన్‌ నిబంధన ప్రకారం హర్మన్‌సేనను విజేతగా ప్రకటించారు.మేఘన ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచింది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో పాకిస్థాన్‌ తర్వాత భారత్‌ (4) రెండో స్థానంలో నిలిచింది. ఏడు జట్లలో మలేసియా పాయింట్ల పట్టికలో అట్టడుగున కొనసాగుతోంది. 13వ టీ20 ఆడుతున్న మేఘన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్లోనే 6,4తో బ్యాట్‌ ఝళిపించింది. వరుస బౌండరీలతో స్కోరుబోర్డును పరుగులు పెట్టించింది.


మరోవైపు షఫాలీ వర్మ కూడా భారీషాట్లతో విరుచుకుపడడంతో పవర్‌ ప్లేలో భారత్‌ 47/0తో నిలిచింది. 10వ ఓవర్లో 4,4తో కదం తొక్కిన తెలుగు బ్యాటర్‌ కెరీర్‌లో తొలి హాఫ్‌ సెంచరీ పూర్తి చేసింది. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని 14వ ఓవర్లో మేఘనను అవుట్‌ చేయడం ద్వారా దురైసింగమ్‌ విడదీసింది. హాఫ్‌ సెంచరీకి చేరువైన షఫాలీని  నూర్‌ దానియా బౌల్డ్‌ చేసింది. తదుపరి బంతికి నవ్‌గిరే డకౌట్‌కాగా..చివరి ఓవర్లో రాధా యాదవ్‌ ఔటైంది. మలేసియా ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్లో మొదలైన వాన ఎంతకీ తగ్గకపోవడంతో మ్యాచ్‌ను రద్ద్దుచేశారు. అప్పటికి ‘డక్‌వర్త్‌’ ప్రకారం మలేసియా 46 పరుగులు చేయాలి. కానీ, ఆ జట్టు 16/2 స్కోరు మాత్రమే చేసినందున హర్మన్‌సేన 30 పరుగులతో గెలిచినట్టు ప్రకటించారు. 


సంక్షిప్తస్కోర్లు

భారత్‌:

20 ఓవర్లలో 181/4 (మేఘన 69, షఫాలీ 46, రిచా నా టౌట్‌ 33, దాని యా 2/9,దురైసింగమ్‌ 2/36)

మలేసియా:

5.2 ఓవర్లలో 16/2 (ఎలిసా 14 నాటౌట్‌, రాజేశ్వరి 1/6, దీప్తిశర్మ 1/10).

Updated Date - 2022-10-04T08:56:28+05:30 IST