India vs South Africa: చెలరేగి అవుటైన డికాక్.. వికెట్ల కోసం శ్రమిస్తున్న టీమిండియా బౌలర్లు

ABN , First Publish Date - 2022-10-05T01:40:14+05:30 IST

భారత్‌తో ఇక్కడి హోల్కార్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న చివరిదైన మూడో టీ20లో సఫారీలు చెలరేగుతున్నారు. టాస్ ఓడి

India vs South Africa: చెలరేగి అవుటైన డికాక్..  వికెట్ల కోసం శ్రమిస్తున్న టీమిండియా బౌలర్లు

ఇండోర్: భారత్‌తో ఇక్కడి హోల్కార్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న చివరిదైన మూడో టీ20లో సఫారీలు చెలరేగుతున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికా 30 పరుగుల వద్ద కెప్టెన్ తెంబా బవుమా (3) వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రిలీ రోసౌ‌తో కలిసి క్వింటన్ డికాక్ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు కదిలించాడు. క్రీజులో పాతుకుపోయిన తర్వాత బ్యాట్‌కు పని చెప్పాడు. ఫోర్లు సిక్సర్లతో విరుచుకుపడుతూ స్కోరు బోర్డును ఉరకలెత్తించాడు.


మరోవైపు, క్రీజులో కుదురుకున్న తర్వాత రిలీ కూడా బౌలర్లపై ఎదురుదాడి ప్రారంభించాడు. ఇద్దరూ కలిసి భారత బౌలర్లను ఆడుకుంటూ పరుగుల్లో వేగం పెంచారు. ఈ క్రమంలో ఉమేశ్ యాదవ్ బౌలింగులో భారీ సిక్సర్ కొట్టిన డికాక్ 33 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇంకోవైపు రోసౌ కూడా చెలరేగిపోతూ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతున్నాడు.


కాగా, ఈ జంటను విడదీసేందుకు భారత బౌలర్లు నానా తంటాలు పడ్డారు. ఈ క్రమంలో ఉమేశ్ యాదవ్ వేసిన 13వ ఓవర్ తొలి బంతికి డికాక్ రనౌట్ అయ్యాడు. 43 బంతులు ఆడిన డికాక్ 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 68 పరుగులు చేశాడు. ప్రస్తుతం 13 ఓవర్లు ముగిశాయి. సౌతాఫ్రికా 2 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. రోసౌ 48 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

Updated Date - 2022-10-05T01:40:14+05:30 IST