IND vs SA: 99 పరుగులకే కుప్పకూలిన దక్షిణాఫ్రికా.. టీమిండియా ఎదుట స్వల్ప లక్ష్యం

ABN , First Publish Date - 2022-10-11T22:15:14+05:30 IST

అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికా, టీమిండియా జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డేలో పర్యాటక జట్టు 99 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా ఎదుట..

IND vs SA: 99 పరుగులకే కుప్పకూలిన దక్షిణాఫ్రికా.. టీమిండియా ఎదుట స్వల్ప లక్ష్యం

ఢిల్లీ: అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికా, టీమిండియా జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డేలో పర్యాటక జట్టు 99 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా ఎదుట 100 పరుగుల స్వల్ప లక్ష్యం ఉంది. భారత బౌలర్ల ధాటికి సఫారీ బ్యాట్స్‌మెన్స్ ఒక్కొక్కరుగా క్యూ కట్టారు. రెండో వన్డేలో సౌతాఫ్రికా జట్టు ఓడినప్పటికీ చెప్పుకోదగ్గ స్కోర్ చేశారు. 74, 79 పరుగులతో రెండో వన్డేలో రాణించిన హెండ్రింక్స్, మర్‌క్రమ్ కీలక మ్యాచ్‌లో చేతులెత్తేశారు. ఓపెనర్ క్వింటన్ డి కాక్ 6 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో అవీష్ ఖాన్‌కు క్యాచ్‌గా దొరికిపోయాడు. మలాన్ కూడా 15 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సిరాజ్ బౌలింగ్‌లో అవీష్ ఖాన్‌కు క్యాచ్‌గా చిక్కి పెవిలియన్ బాట పట్టాడు. సిరాజ్ బౌలింగ్‌లోనే మరో బ్యాట్స్‌మెన్ హెండ్రింక్స్ 3 పరుగులకే క్యాచ్‌గా దొరికిపోయి ఔట్‌గా వెనుదిరిగాడు. రెండో వన్డేలో రాణించిన మర్‌క్రమ్ మూడో వన్డేలో మాత్రం దక్షిణాఫ్రికా అభిమానులను నిరాశపరిచాడు. 19 బంతులకు 9 పరుగులు మాత్రమే చేసి షాబాజ్ అహ్మద్ బౌలింగ్‌లో సంజూ శాంసన్‌కు క్యాచ్‌గా చిక్కి వెనుదిరిగాడు. క్లాసెన్, మిల్లర్ కూడా పెద్దగా రాణించలేదు.



స్టార్ బ్యాట్స్‌మెన్‌గా పేరున్న డేవిడ్ మిల్లర్ 7 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ కావడం గమనార్హం. క్లాసెన్ కూడా 34 పరుగులు చేసి షాబాజ్ అహ్మద్ బౌలింగ్‌లో బౌల్డ్‌గా వెనుదిరిగాడు. మిగిలిన సఫారీ ఆటగాళ్లెవరూ చెప్పుకోతగిన స్కోర్ చేయలేదు. ఫలితంగా సఫారీ జట్టు కేవలం 99 పరుగులకే ఆలౌట్ అయి నిర్ణాయక మ్యాచ్‌లో చేతులెత్తేసింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్‌ నాలుగు వికెట్లతో రాణించాడు. వాషింగ్టన్ సుందర్, సిరాజ్, షాబాజ్ అహ్మద్ తలో రెండు వికెట్లు తీశారు. తొలి రెండు మ్యాచ్‌ల్లో తేలిపోయిన ఓపెనర్లు ధవన్‌, గిల్‌ జట్టుకు శుభారంభం అందించాల్సిన అవసరముంది. ఈ ఇద్దరే మ్యాచ్‌ను ముగిస్తే టీమిండియా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తారనడంలో సందేహం లేదు.

Updated Date - 2022-10-11T22:15:14+05:30 IST