ind vs aus: టీమిండియా పెట్టిన అంత టార్గెట్‌నూ ఊదేసిన ఆస్ట్రేలియా.. తొలి టీ20లో రోహిత్ సేన ఓటమి..!

ABN , First Publish Date - 2022-09-21T04:48:20+05:30 IST

టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య మొహాలీ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. టీమిండియా 208 పరుగుల భారీ స్కోర్ చేసినప్పటికీ..

ind vs aus: టీమిండియా పెట్టిన అంత టార్గెట్‌నూ ఊదేసిన ఆస్ట్రేలియా.. తొలి టీ20లో రోహిత్ సేన ఓటమి..!

మొహాలీ: టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య మొహాలీ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. టీమిండియా 208 పరుగుల భారీ స్కోర్ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆస్ట్రేలియా ఓపెనర్ కామెరాన్ గ్రీన్ 30 బంతుల్లో 61 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాథ్యూ వేడ్ 45 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఫించ్ 22 పరుగులు, స్టీవెన్ స్మిత్ 35 పరుగులు చేశారు. 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 39 పరుగులకే కెప్టెన్, ఓపెనర్ ఆరోన్ ఫించ్ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కెమెరాన్ గ్రీన్ 61 పరుగులు, స్టీవెన్ స్మిత్ 35 పరుగులతో మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 109 పరుగుల వద్ద ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. ఒకానొక దశలో ఆస్ట్రేలియాకు గెలుపు అవకాశాలు సన్నగిల్లాయేమోనన్న అనుమానం కలిగింది. కానీ.. వేడ్ మెరుపు ఇన్నింగ్స్‌తో ఆసీస్‌ను విజయ తీరాలకు చేర్చాడు. టీమిండియా బౌలర్ల పేలవ ప్రదర్శన జట్టు ఓటమికి కారణమైందని చెప్పక తప్పదు. భువనేశ్వర్ బౌలింగ్ చేసిన నాలుగు ఓవర్లలో 52 పరుగులు, హర్షల్ పటేల్ 4 ఓవర్లలో 49 పరుగులు, చాహల్ బౌలింగ్ చేసిన 3.2 ఓవర్లలో 42 పరుగులు ఆసీస్ బ్యాటర్లు పిండుకున్నారు.



తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా జట్టు 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. హార్థిక్ పాండ్యా 30 బంతుల్లో ఐదు సిక్సులు, ఏడు ఫోర్లతో 71 పరుగులు చేసి దుమ్ములేపాడు. ఆస్ట్రేలియా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచడంలో కీలక పాత్ర పోషించాడు. కేఎల్ రాహుల్ 55 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో రాణించాడు. సూర్య కుమార్ యాదవ్ 25 బంతుల్లో 46 పరుగులతో సత్తా చాటాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ నిరాశపరిచారు. రోహిత్ శర్మ 9 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేసి హజల్‌వుడ్ బౌలింగ్‌లో క్యాచ్‌గా చిక్కి ఔట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ ఎల్లిస్ బౌలింగ్‌లో గ్రీన్‌కు క్యాచ్‌గా దొరికి రెండు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ బాట పట్టాడు. అయితే.. కేఎల్ రాహుల్, సూర్య కుమార్ యాదవ్ నిలకడగా రాణించి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇంత మంచి స్కోర్ చేసినా టీమిండియాకు ఓటమి తప్పలేదు. టార్గెట్ భారీగానే ఉన్నప్పటికీ ఆస్ట్రేలియా జట్టును కూడా తక్కువ అంచనా వేయకూడదన్న అంచనాలే నిజమయ్యాయి. కీలక ఆటగాళ్లు లేకుండానే ఆసీస్‌ జట్టు భారత్‌‌కు వచ్చింది. ఓపెనర్‌ వార్నర్‌కు విశ్రాంతినివ్వగా పేసర్లు స్టార్క్‌, స్టొయినిస్‌, మార్ష్‌కు గాయాలయ్యాయి. అయినప్పటికీ ఆసీస్ బ్యాటర్లు భారీ టార్గెట్‌ను ఛేదించి విజయాన్ని సొంతం చేసుకున్నారు.

Updated Date - 2022-09-21T04:48:20+05:30 IST