‘పొట్టి’ ఆటలో సూపర్‌

ABN , First Publish Date - 2022-09-24T09:33:14+05:30 IST

వర్షం కారణంగా 8 ఓవర్లకే పరిమితమైన రెండో టీ20లో భారత్‌ అదరగొట్టింది. 91 పరుగుల ఛేదనలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (20 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 46..

‘పొట్టి’ ఆటలో సూపర్‌

రెండో టీ20లో భారత్‌ విజయం

రోహిత్‌ ఒంటరి పోరాటం


నాగ్‌పూర్‌: వర్షం కారణంగా 8 ఓవర్లకే పరిమితమైన రెండో టీ20లో భారత్‌ అదరగొట్టింది. 91 పరుగుల ఛేదనలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (20 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 46 నాటౌట్‌) తుదికంటా నిలిచి జట్టుకు విజయాన్నందించాడు. దీంతో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో 6 వికెట్లతో గెలిచిన భారత్‌ సిరీస్‌ను 1-1తో సమం చేసింది. చివరి మ్యాచ్‌ ఆదివారం హైదరాబాద్‌లో జరుగుతుంది. ముందుగా ఆసీస్‌ నిర్ణీత 8 ఓవర్లలో 5 వికెట్లకు 90 పరుగులు చేసింది. వేడ్‌ (20 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 43 నాటౌట్‌), ఫించ్‌ (15 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 31) వేగంగా ఆడారు. అక్షర్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో భారత్‌ 7.2 ఓవర్లలో 4 వికెట్లకు 92 పరుగులు చేసి గెలిచింది. జంపాకు 3 వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా రోహిత్‌ నిలిచాడు.


రోహిత్‌ ఒక్కడై..: ఛేదనలో భారత్‌ ఇన్నింగ్స్‌ అదిరిపోయే రీతిలో సాగింది. కెప్టెన్‌ రోహిత్‌ అంతా తానై నడిపించాడు. హాజెల్‌వుడ్‌ వేసిన తొలి ఓవర్‌లోనే రోహిత్‌ రెండు, రాహుల్‌ (10) ఓ సిక్సర్‌తో భారత్‌ 20 రన్స్‌ చేసింది. తర్వాత రోహిత్‌ మరో రెండు సిక్సర్లతో అలరించగా.. మూడో ఓవర్‌లో స్లాగ్‌ స్వీప్‌ షాట్‌కు వెళ్లిన రాహుల్‌ను జంపా బౌల్డ్‌ చేశాడు. ఇక రెండు ఫోర్లతో కాస్త ఊపు మీదున్నట్టు కనిపించిన కోహ్లీ (11)ని, సూర్యకుమార్‌ (0)ను తన తర్వాతి ఓవర్‌లోనే వరుస బంతుల్లో జంపా అవుట్‌ చేశాడు. అప్పటికి 21 బంతుల్లో 37 రన్స్‌ అవసరం. మరో ఎండ్‌లో రోహిత్‌ ఆరో ఓవర్‌లో 2 ఫోర్లతో 11 రన్స్‌ రాబట్టి సమీకరణం తగ్గించాడు. హార్దిక్‌ పాండ్యా (9)ను కమిన్స్‌ అవుట్‌ చేసినా 2 ఫోర్లు ఇవ్వడంతో.. చివరి ఓవర్‌లో 9 పరుగులే అవసరమయ్యాయి. వీటిని దినేశ్‌ కార్తీక్‌ (10 నాటౌట్‌) ఎదుర్కొన్న తొలి రెండు బంతుల్లోనే 6,4తో రాబట్టి మ్యాచ్‌ను పూర్తి చేశాడు.


వేడ్‌ ఫినిషింగ్‌: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయినా.. కెప్టెన్‌ ఫించ్‌ మెరుపు ఆరంభం, మాథ్యూ వేడ్‌ ఫినిషింగ్‌ టచ్‌తో భారీ స్కోరే సాధించింది. మరో ఎండ్‌లో మిగతా నలుగురు బ్యాటర్స్‌ సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కావడం గమనార్హం. భారత బౌలర్లలో స్పిన్నర్‌ అక్షర్‌ మాత్రమే ప్రభావం చూపాడు. తొలి ఓవర్‌లోనే ఫించ్‌ రెండు ఫోర్లు బాది 10 రన్స్‌ రాబట్టాడు. కానీ రెండో ఓవర్‌లో మ్యాక్స్‌వెల్‌ను అక్షర్‌ గోల్డెన్‌ డక్‌ చేయగా.. కోహ్లీ త్రోతో గ్రీన్‌ (5) రనౌటయ్యాడు. అటు హిట్టర్‌ టిమ్‌ డేవిడ్‌ (2)ను కూడా అక్షర్‌ బౌల్డ్‌ చేయడంతో ఆసీస్‌ 31/3 స్కోరుతో నిలిచింది. ఐదో ఓవర్‌లో ఫించ్‌ దూకుడుకు బుమ్రా ఓ యార్కర్‌తో బ్రేక్‌ వేశాడు. అయితే వేడ్‌ రంగప్రవేశంతో పరుగుల వరదకు తెర లేచింది. ఆరో ఓవర్‌లో రెండు ఫోర్లు సాధించిన తను హర్షల్‌ వేసిన చివరి ఓవర్‌లో మూడు సిక్సర్లు బాది 19 పరుగులు రాబట్టాడు. ఓవరాల్‌గా ఆసీస్‌ ఆఖరి ఐదు ఓవర్లలో 59 పరుగులు సాధించడం విశేషం.


రెండున్నర గంటలు ఆలస్యంగా..

బుధ, గురువారం కురిసిన వర్షాలతో విదర్భ మైదానం చిత్తడిగా మారడంతో నాగ్‌పూర్‌ అభిమానులు పూర్తి మ్యాచ్‌ చూడలేకపోయారు. బౌలర్లు రనప్‌ తీసుకునే ఏరియాతో పాటు అవుట్‌ ఫీల్డ్‌ కూడా తడిగా కనిపించింది. దీంతో నిర్ణీత సమయంలో మ్యాచ్‌ నిర్వహణ సాధ్యం కాదని అంపైర్లు తేల్చారు. ఫలితంగా రెండున్నర గంటలు ఆలస్యంగా రాత్రి 9.30కి ఎనిమిది ఓవర్ల చొప్పున మ్యాచ్‌ను నిర్వహించారు.


స్కోరుబోర్డు

ఆస్ట్రేలియా: ఫించ్‌ (బి) బుమ్రా 31, గ్రీన్‌ (రనౌట్‌) 5, మ్యాక్స్‌వెల్‌ (బి) అక్షర్‌ 0, టిమ్‌ డేవిడ్‌ (బి) అక్షర్‌ 2, వేడ్‌ (నాటౌట్‌) 43, స్మిత్‌ (రనౌట్‌) 8, ఎక్స్‌ట్రాలు: 1, మొత్తం: 8 ఓవర్లలో 90/5; వికెట్ల పతనం: 1-14, 2-19, 3-31, 4-46, 5-90; బౌలింగ్‌: పాండ్యా 1-0-10-0, అక్షర్‌ పటేల్‌ 2-0-13-2, చాహల్‌ 1-0-12-0, బుమ్రా 2-0-23-1, హర్షల్‌ 2-0-32-0.

భారత్‌: రాహుల్‌ (బి) జంపా 10, రోహిత్‌ (నాటౌట్‌) 46, కోహ్లీ (బి) జంపా 11, సూర్యకుమార్‌ (ఎల్బీ) జంపా 0, పాండ్యా (సి) ఫించ్‌ (బి) కమ్మిన్స్‌ 9, దినేశ్‌ (నాటౌట్‌) 10; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 7.2 ఓవర్లలో 92/4; వికెట్ల పతనం: 1-39, 2-55, 3-55, 4-77; బౌలింగ్‌: హాజెల్‌వుడ్‌ 1-0-20-0, కమ్మిన్స్‌ 2-0-23-1, జంపా 2-0-16-3, సామ్స్‌ 1.2-0-20-0, అబాట్‌ 1-0-11-0.

Updated Date - 2022-09-24T09:33:14+05:30 IST