Chess Olympiad: దీన్ని కూడా రాజకీయం చేస్తారా?: పాక్‌పై విరుచుకుపడిన భారత్

ABN , First Publish Date - 2022-07-29T00:57:40+05:30 IST

చెస్ ఒలింపియాడ్‌ను కూడా రాజకీయం చేస్తున్న పాకిస్థాన్‌ (Pakistan)పై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమిళనాడు

Chess Olympiad: దీన్ని కూడా రాజకీయం చేస్తారా?: పాక్‌పై విరుచుకుపడిన భారత్

న్యూఢిల్లీ: చెస్ ఒలింపియాడ్‌ను కూడా రాజకీయం చేస్తున్న పాకిస్థాన్‌ (Pakistan)పై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమిళనాడు రాజధాని చెన్నైలో నేటి (28వ తేదీ) నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు జరగనున్న 44వ చెస్ ఒలింపియాడ్ (44th Chess Olympiad) నుంచి పాకిస్థాన్ తప్పుకోవడాన్ని భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. ఈ ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ ఈవెంట్‌ను కూడా రాజకీయం చేయడం ‘అత్యంత దురదృష్టకరమని’ పేర్కొంది. చెస్ ఒలింపియాడ్ నుంచి తప్పుకుంటున్నట్టు పాకిస్థాన్ అకస్మాత్తుగా ప్రకటించడం ఆశ్చర్యం కలిగించిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి(Arindam Bagchi) పేర్కొన్నారు. 


పాకిస్థాన్ జట్టు భారత్ చేరుకున్న తర్వాత కూడా పాకిస్థాన్ ఇలాంటి ప్రకటన చేయడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. ఒలింపియాడ్ టార్చ్ రిలే జమ్మూకశ్మీర్ మీదుగా వెళ్తుండడాన్ని సాకుగా చూపి ఈవెంట్ నుంచి పాకిస్థాన్ తప్పుకున్నట్టు ప్రకటించింది. కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూకశ్మీర్, లడఖ్‌లు భారత్‌లో అంతర్గత భాగమని, అవి అలానే ఉంటాయని బాగ్చి తేల్చి చెప్పారు. 

Updated Date - 2022-07-29T00:57:40+05:30 IST