నీదా..నాదా!

ABN , First Publish Date - 2022-07-17T09:50:10+05:30 IST

ఇంగ్లండ్‌లో భారత జట్టు పర్యటన తుది అంకానికి చేరింది. ఆదివారం జరిగే సిరీస్‌ నిర్ణాయక మూడో వన్డేలో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.

నీదా..నాదా!

సిరీస్‌పై  భారత్‌, ఇంగ్లండ్‌ గురి 

నేడు మూడో వన్డే

మధ్యాహ్నం 3.30 గం. నుంచి సోనీ సిక్స్‌లో..

మాంచెస్టర్‌: ఇంగ్లండ్‌లో భారత జట్టు పర్యటన తుది అంకానికి చేరింది. ఆదివారం జరిగే సిరీస్‌ నిర్ణాయక మూడో వన్డేలో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. తొలి వన్డేలో 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన రోహిత్‌ సేన.. ఆ తర్వాత రెండో వన్డేలో బ్యాటింగ్‌ వైఫల్యంతో ఏకంగా 100 పరుగుల తేడాతో చిత్తయ్యింది. దీంతో చివరి మ్యాచ్‌ అత్యంత ఆసక్తికరంగా మారింది. టీ20 సిరీ్‌సలో దూకుడే మంత్రంగా ముందుకు సాగిన భారత్‌ సానుకూల ఫలితాన్ని సాధించింది. కానీ లార్డ్స్‌లో 247 పరుగుల ఛేదనలోనూ దారుణంగా చేతులెత్తేసింది. అందుకే ఆదివారం మాంచెస్టర్‌లో తమ బ్యాటింగ్‌ శైలిని మార్చుకుని ప్రత్యర్థిపై పంజా విసరాలనే ఆలోచనలో ఉంది.


అంతకన్నాముందు టాప్లీ, విల్లే స్వింగ్‌ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటేనే ఫలితంపై ఆశలు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇందుకు ఓపెనర్లు రోహిత్‌, ధవన్‌ శుభారంభం అందించాల్సిందే. ఇక ఎప్పటిలాగే విరాట్‌ ఎలా ఆడతాడనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిస్తే విమర్శలు తగ్గుతాయి. హార్దిక్‌, సూర్యకుమార్‌ రాణిస్తుండగా మిడిలార్డర్‌లో పంత్‌ బ్యాట్‌ ఝుళిపించాల్సిన అవసరం ఉంది. అలాగే దినేశ్‌ కార్తీక్‌ ఫినిషింగ్‌ టచ్‌ ఇవ్వలేకపోతున్నాడు. బౌలింగ్‌లో మాత్రం బుమ్రా, షమి, చాహల్‌ త్రయం అద్భుతంగా రాణిస్తూ ప్రత్యర్థి భారీ స్కోర్లకు చెక్‌ పెడుతోంది.


జోష్‌లో ఇంగ్లండ్‌:

తొలి వన్డే ఓటమి నుంచి ఇంగ్లండ్‌ అద్భుతంగా పుంజుకుంది. ఆల్‌రౌండ్‌షోతో విరుచుకుపడి భారత బ్యాటర్లను కట్టడి చేయడంతో పాటు సిరీ్‌సలో నిలువగలిగింది. ఈ కీలక మ్యాచ్‌లోనూ అదే జోరు కనబరిస్తే భారత్‌కు కష్టాలు తప్పవు. అయితే టాపార్డర్‌ నుంచి మాత్రం జట్టుకు సహకారం అందడం లేదు. జేసన్‌ రాయ్‌, బెయిర్‌స్టో, రూట్‌, స్టోక్స్‌. పేస్‌, స్పిన్‌ బౌలింగ్‌ను ఆడలేకపోతున్నారు. కానీ వీరిలో ఏ ఇద్దరు సుదీర్ఘంగా క్రీజులో నిలిచినా జట్టుకు భారీ స్కోరు ఖాయమే. ఇక పేసర్‌ టాప్లీ ఆరు వికెట్లతో లార్డ్స్‌ మైదానంలోనే బెస్ట్‌ బౌలింగ్‌ను నమోదు చేశాడు. అతడికి విల్లే నుంచి సహకారం అందడంతో భారత్‌ చేసేదేమీ లేకపోయింది.


తుది జట్లు (అంచనా)

భారత్‌:

రోహిత్‌ (కెప్టెన్‌), ధవన్‌, కోహ్లీ, సూర్యకుమార్‌, పంత్‌, హార్దిక్‌, జడేజా, షమి, బుమ్రా, చాహల్‌, ప్రసిద్ధ్‌. 


ఇంగ్లండ్‌:

రాయ్‌, బెయిర్‌స్టో, రూట్‌, స్టోక్స్‌, బట్లర్‌ (కెప్టెన్‌), లివింగ్‌స్టోన్‌, మొయిన్‌ అలీ, ఒవర్టన్‌, విల్లే, కార్స్‌, టాప్లీ.

Updated Date - 2022-07-17T09:50:10+05:30 IST