ముగిసిన తొలిరోజు ఆట.. దంచికొట్టిన పంత్

ABN , First Publish Date - 2022-03-04T22:59:55+05:30 IST

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు భారత జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. తొలి రోజు ఆట ముగిసే

ముగిసిన తొలిరోజు ఆట.. దంచికొట్టిన పంత్

మొహాలి: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. త్రుటిలో సెంచరీ చేజార్చుకున్న వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ బ్యాట్‌తో చెలరేగాడు.


శ్రీలంక బౌలర్లపై తన ప్రతాపాన్ని చూపాడు. దీంతో స్కోరు బోర్డు ఉరకలెత్తింది. 75 బంతుల్లో నాలుగు ఫోర్లు, సిక్సర్‌తో టెస్టుల్లో 8వ అర్ధ సెంచరీ సాధించిన పంత్.. ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో మరీ భారీ షాట్‌కు యత్నించి లక్మల్ బౌలింగులో బౌల్డ్ అయ్యాడు.


నాలుగు పరుగులు తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. మొత్తంగా 97 బంతులు ఎదుర్కొన్న పంత్ 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 96 పరుగులు చేశాడు. అంతకుముందు హనుమ విహారి (58) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. కెరియర్‌లో వందో టెస్టు ఆడుతున్న కోహ్లీ 45 పరుగులు మాత్రమే చేసి అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచాడు. 


మయాంక్ అగర్వాల్ 33, కెప్టెన్ రోహిత్ శర్మ 29, శ్రేయాస్ అయ్యర్ 27, పరుగులు చేశారు. ప్రస్తుతం రవీంద్ర జడేజా 45, రవిచంద్రన్ అశ్విన్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు. శ్రీలంక బౌలర్లలో సురంగ లక్మల్, విశ్వ ఫెర్నాండో, లహిరు కుమార, ధనంజయ డి సిల్వ చెరో వికెట్ తీసుకోగా, లసిత్ ఎంబుదెనియా రెండు వికెట్లు పడగొట్టాడు.

Read more