టీ20లు మరింత రంజుగా..

ABN , First Publish Date - 2022-09-18T09:51:35+05:30 IST

టెస్టులు, వన్డేలకు మించిన ఆదరణతో విశ్వవ్యాప్తంగా ఇప్పుడు టీ20లదే హవా. తక్కువ సమయంలో ముగుస్తుండడంతో పాటు ధనాధన్‌ ఆటతీరుతో అభిమానులకు కనువిందు..

టీ20లు మరింత రంజుగా..

‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’ రూల్‌ప్రవేశపెట్టనున్న బీసీసీఐ 

సబ్‌స్టిట్యూట్‌తోనూ బ్యాటింగ్‌, బౌలింగ్‌

ముస్తాక్‌ అలీ టోర్నీలో ప్రయోగం 

తర్వాత ఐపీఎల్‌లోకి..


న్యూఢిల్లీ: టెస్టులు, వన్డేలకు మించిన ఆదరణతో విశ్వవ్యాప్తంగా ఇప్పుడు టీ20లదే హవా. తక్కువ సమయంలో ముగుస్తుండడంతో పాటు ధనాధన్‌ ఆటతీరుతో అభిమానులకు కనువిందు చేయడం ఈ ఫార్మాట్‌ స్టయిల్‌. ఈ తరహాలోనే సాగే ఐపీఎల్‌ గురించి చెప్పక్కర్లేదు. ఈ లీగ్‌కు లభించే క్రేజ్‌ ఇంగ్లిష్‌ ప్రీమియర్‌ లీగ్‌నే మించిపోయిన విషయం తెలిసిందే. ఇక ఆర్జన విషయంలో ఆయా బోర్డులతో పాటు ఈ లీగ్‌ ఆటగాళ్లు కూడా కోటీశ్వరులుగా మారుతున్నారు. ఇదే జోరులో ఫ్యాన్స్‌కు మరింత చేరువయ్యేందుకు టీ20ల్లో కొత్త కొత్త నిబంధనలు కనిపిస్తుంటాయి. ఇప్పుడు బీసీసీఐ కూడా పొట్టి ఫార్మాట్‌ను మరింత ఆకర్షణీయం చేసేందుకు సిద్ధమైంది.


ఈ నేపథ్యంలో ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’ నిబంధనను తీసుకురానుంది. దీంతో ప్రతీ జట్టు మ్యాచ్‌ మధ్యలోనే టాక్టికల్‌ సబ్‌స్టిట్యూట్‌ను ఆడించవచ్చు. వాస్తవానికి కొంతకాలంగా బోర్డు ఈ రూల్‌ను ఐపీఎల్‌లోనే అమలు చేయాలనుకున్నా ఆచరణలో పెట్టలేకపోయింది. తాజాగా  అక్టోబరు 11 నుంచి జరిగే సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలో ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధనను అమలు చేయాలనుకుంటోంది. ఇది విజయవంతమైతే వచ్చే ఐపీఎల్‌లోనూ ఈ కొత్త రూల్‌ కనిపిస్తుంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల క్రికెట్‌ సంఘాలకు బోర్డు మొయిల్‌ పంపింది. ‘టీ20 క్రికెట్‌ వేగంగా అభివృద్ధి చెందుతోంది. అందుకే ఈ మ్యాచ్‌లకుండే ఆకర్షణకు తగ్గట్టుగానే సరికొత్త మార్పులను కూడా తీసుకు రావాలి. ఇది ఫ్యాన్స్‌ను దృష్టిలో పెట్టుకునే కాకుండా ఆయా జట్లకు కూడా ప్రయోజనం కలిగించేలా ఉండాలి. అందుకే ఇంపాక్ట్‌ ప్లేయర్‌ కాన్సె్‌ప్టను పరిచయం చేయబోతున్నాం. దీనిద్వారా టీ20 మ్యాచ్‌ మధ్యలోనే తమ తుది జట్టులో ఉన్న ఆటగాడి స్థానంలో సబ్‌స్టిట్యూట్‌తో ఆడించవచ్చు’ అని బోర్డు పేర్కొంది. ప్రస్తుతం బిగ్‌బాష్‌ లీగ్‌లో ఈ నిబంధన ఉంది. రగ్బీ, ఫుట్‌బాల్‌, బాస్కెట్‌బాల్‌లోనూ ఈ రూల్‌ను చూడవచ్చు.

ఏమిటీ ‘ఇంపాక్ట్‌’..

సాధారణంగా మ్యాచ్‌ మధ్యలో ఆటగాడు గాయపడితే అతడి స్థానంలో సబ్‌స్టిట్యూట్‌ రావడం చూస్తూనే ఉంటాం. కానీ ఇలాంటి ఆటగాడు బ్యాటింగ్‌, బౌలింగ్‌ చేయడానికి వీలుండదు. కేవలం ఫీల్డింగ్‌కు పరిమితమవుతాడు. కానీ అదే ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌ ప్రకారం.. జట్టులో ఎవరైనా గాయపడినప్పుడే కాకుండా.. మ్యాచ్‌లో అప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టుగా ఓ ప్లేయర్‌ స్థానంలో మరొకరిని వ్యూహాత్మక సబ్‌స్టిట్యూట్‌గా తీసుకుంటారు. ఇలా వచ్చే ఆటగాడు బ్యాటింగ్‌తో పాటు పూర్తి స్థాయిలో బౌలింగ్‌ కూడా చేస్తాడు. మరో ముఖ్యమైన విషయమేమిటంటే.. ఇలా ఎప్పుడంటే అప్పుడు సబ్‌స్టిట్యూట్‌ను పిలుస్తామంటే కుదరదు. 14వ ఓవర్‌ ముగిసేలోపే జరిగిపోవాలి. అది కూడా ఒక ఓవర్‌ పూర్తయ్యాకే. కానీ రెండు సందర్భాల్లో దీనికి మినహాయింపు ఉంటుంది.


ఉదాహరణకు ఏదైనా ఓవర్‌ మధ్యలో వికెట్‌ పడినప్పుడు బ్యాటింగ్‌ జట్టు తమ సబ్‌ ఆటగాడిని క్రీజులోకి దించవచ్చు. అలాగే ఓవర్‌ మధ్యలో ఎవరైనా ఫీల్డర్‌ గాయపడితే కూడా ఫీల్డింగ్‌ జట్టు తమ సబ్‌స్టిట్యూట్‌ను పంపవచ్చు. ఒకవేళ మ్యాచ్‌ను 10 ఓవర్లకు కుదిస్తే ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధన వర్తించదు. కానీ 17 ఓవర్లకు కుదిస్తే మాత్రం 13వ ఓవర్‌కు ముందుగా.. లేక 11 ఓవర్లకు కుదిస్తే తొమ్మిదో ఓవర్‌కు ముందే మార్పు జరగాలి. అలాగే ఈ సబ్‌స్టిట్యూట్‌ విషయాన్ని ముందుగా ఫీల్డ్‌ అంపైర్‌కు తెలపాల్సి ఉంటుంది. మరోవైపు టాస్‌ వేయడానికి ముందే తుదిజట్టుతో పాటు నలుగురు ఇంపాక్ట్‌ ప్లేయర్లను కూడా ప్రకటించాల్సి ఉంటుంది. ఇందులోంచి ఒక్కరిని మ్యాచ్‌ మధ్యలో ఎంపిక చేసుకుంటారు.

జట్లకు ప్రయోజనం ఎలా..?

ఈ రూల్‌ వల్ల ఆయా జట్లు భారీగానే లాభపడే అవకాశం ఉంది. ముఖ్యంగా టాస్‌ ప్రభావాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఉదాహరణకు.. ఒక జట్టు టాస్‌ ఓడి ముంచు ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు బౌలింగ్‌ చేయాల్సి వస్తే.. ఆ సవాల్‌ను దీటుగా ఎదుర్కొనేందుకు తమ బౌలింగ్‌ దళంలో మార్పు చేసుకోవచ్చు. అలాగే సెకండ్‌ బ్యాటింగ్‌ జట్టుకు టర్నింగ్‌ పిచ్‌ ఎదురైతే అదనపు బ్యాటర్‌ను కూడా జట్టులోకి తీసుకునే వెసులుబాటు ఉంటుంది.

Read more