ఒలింపిక్ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తా: Nita Ambani

ABN , First Publish Date - 2022-05-25T00:02:49+05:30 IST

ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (IOC) ఆధ్వర్యంలో నేడు ఒడిశాలో దేశంలోనే తొలిసారి ‘ఒలింపిక్ వాల్యూస్

ఒలింపిక్ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తా: Nita Ambani

భువనేశ్వర్: ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (IOC) ఆధ్వర్యంలో నేడు ఒడిశాలో దేశంలోనే తొలిసారి ‘ఒలింపిక్ వాల్యూస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం’ (OVEP)ను ఐవోసి సభ్యురాలు నీతా అంబానీ (Nita Ambani) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఒలింపిజం ప్రధాన విలువలను పెంపొందించడంలో విద్య, క్రీడ వంటి రెండు జంట శక్తులను ఒవెప్ మిళతం చేస్తుందని ప్రశంసించారు. 


ఒవెప్ అనేది ఐఓసీ రూపొందించిన వనరుల ఆచరణాత్మక సమితి. పిల్లలను చురుగ్గా, ఆరోగ్యంగా, బాధ్యతాయుతమైన పౌరులుగా మారేందుకు విలువల ఆధారిత పాఠ్యాంశాలను వ్యాప్తి చేయడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. దేశ ఒలింపిక్ ఉద్యమంలో ఇదొక మైలురాయి. ఐవోసీ సెషన్ 2023కు ఆతిథ్యం ఇచ్చేందుకు ఈ ఏడాది మొదట్లో నీతా అంబానీ నేతృత్వంలోని భారత ప్రతినిధి బృందం బిడ్ దాఖలు చేసింది.   


మన పాఠశాలల్లో 25 కోట్లకుపైగా చిన్నారులు ఉన్నారని, వారిలో ఎంతో ప్రతిభ దాగి ఉందని నీతా అంబానీ అన్నారు. రేపటి విజేతలు వారేనని, వారే మన దేశ భవిష్యత్తు అని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ముంబైలో ఐవోసీ సెషన్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నామని, దేశంలో ఒలింపిక్ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసేందుకు తాను ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దూరదృష్టితో కూడిన నాయకత్వం ద్వారా దేశ క్రీడా ఆశయాలకు ఒడిశా కేంద్రంగా మారిందని ప్రశంసించారు. 


కాగా, రిలయన్స్ ఫౌండేషన్ అథ్లెటిక్స్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్ (HPC) కోసం రిలయన్స్ ఫౌండేషన్.. ఒడిశా ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నాయి. హెచ్‌పీసీకి చెందిన ఇద్దరు  రిలయన్స్ ఫౌండేషన్ అథ్లెట్లు జ్యోతి యర్రాజీ, అమ్లాన్ బోర్గోహైన్ గత నెలలో అంతర్జాతీయ అథ్లెటిక్ ఈవెంట్‌లలో జాతీయ రికార్డులను బద్దలు కొట్టి పతకాలు సాధించారు. 

Read more