ఆ 12వేలు ఎక్కడ?

ABN , First Publish Date - 2022-09-24T09:31:18+05:30 IST

అభిమానుల ఎదురు చూపులు, ప్రభుత్వ హెచ్చరికలు, మీడియాలో కథనాలు వచ్చినా హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మహ్మద్‌ అజరుద్దీన్‌ వ్యవహారశైలిలో ఎలాంటి మార్పూ రాలేదు.

ఆ 12వేలు ఎక్కడ?

హెచ్‌సీఏ అమ్మింది సగం టిక్కెట్లే

పెద్ద సంఖ్యలో బ్లాక్‌, కాంప్లిమెంటరీలు?

క్లబ్‌ సెక్రటరీలు సైతం పడిగాపులు

అజర్‌.. కొడుకు, కోడలు హంగామా!


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): అభిమానుల ఎదురు చూపులు, ప్రభుత్వ హెచ్చరికలు, మీడియాలో కథనాలు వచ్చినా హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మహ్మద్‌ అజరుద్దీన్‌ వ్యవహారశైలిలో ఎలాంటి మార్పూ రాలేదు. స్టేడియం మొత్తం సీటింగ్‌ సామర్థ్యం(39 వేలు)లో అమ్మకానికి ఉంచిన టిక్కెట్ల కంటే కాంప్లిమెంటరీలుగా ఇచ్చినవే అధికమని నిస్సిగ్గుగా వెల్లడించాడు. తర్జనభర్జనలు.. అభిమానుల ఆందోళనలతో ఎట్టకేలకు శుక్రవారం మీడియా ముందుకొచ్చిన అజరుద్దీన్‌ ఉప్పల్‌ స్టేడియంలో విలేకర్ల సమావేశంలో మీడియాపై ఎదురుదాడికి దిగాడు. ఈనెల 15వ తేదీన పేటీఎం యాప్‌లో 11వేల 450 సాధారణ టిక్కెట్లు, 4 వేలు కార్పొరేట్‌ టిక్కెట్లు, 23న సికింద్రాబాద్‌ జింఖానా కౌంటర్లలో 3 వేలు, అదేరోజు ఆన్‌లైన్‌లో 2,100 టిక్కెట్లు విక్రయించినట్టు అజర్‌ చెప్పాడు.


ఇక్కడికి మొత్తం అమ్మిన టిక్కెట్లు 20 వేల 550 కాగా మరో ఆరు వేల టిక్కెట్లు హెచ్‌సీఏ క్లబ్‌ సెక్రటరీలకు, ఇతర సిబ్బందికి కేటాయించినట్టు తెలిపాడు. హెచ్‌సీఏ వాళ్లు తీసుకున్నవి కూడా కలిపితే 26 వేల 550 టిక్కెట్లు మాత్రమే లెక్కకొచ్చాయి. మరి మిగిలిన 12వేల 450 టిక్కెట్ల సంగతేంటి అంటే అజర్‌ వద్ద జవాబు లేదు. హెచ్‌సీఏకు కేటాయించుకున్న 6వేల టిక్కెట్లను కూడా పక్కకుపెడితే ఈ మ్యాచ్‌కు విక్రయించిన టిక్కెట్లు 20,550నే కావడంతో మిగిలిన వాటిని హెచ్‌సీఏ గుప్పిట పెట్టుకోవడం విమర్శలకు తావిస్తోంది.


క్లబ్‌ సెక్రటరీలకూ తప్పని తిప్పలు..

220కిపైగా ఉన్న క్లబ్‌ సెక్రటరీలకు వారికి ఇచ్చే టిక్కెట్లు, కాంప్లిమెంటరీ పాస్‌లు ఎప్పుడిస్తారో శుక్రవారం వరకు సమాచారం ఇవ్వలేదు. అజర్‌ వారి ఫోన్లకు కూడా అందుబాటులోకి రాకపోవడంతో ఉప్పల్‌ స్టేడియంలోని అతడి చాంబర్‌ ముందు పలువురు హెచ్‌సీఏ క్లబ్‌ సెక్రటరీలు నిరీక్షిస్తూ కనిపించారు. త్వరలో ఎన్నికలు ఉండడంతో వీరిలో తన అస్మదీయులకు ఒకలా, తస్మదీయులకు మరోలా టిక్కెట్లు ఇస్తున్నట్టు కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. 


ఏర్పాట్లలోనూ బాధ్యతారాహిత్యం

ప్లేయర్ల డ్రెసింగ్‌ రూమ్‌లో చేయాల్సిన ఏర్పాట్లు మొదలు మైదానంలో అభిమానులు కూర్చునే సీట్ల మరమ్మతులు సహా అన్ని పనులు నత్తనడకన సాగుతున్నాయి. మూత్రశాలలు ఇప్పటికీ అపరిశ్రుభంగా ఉండడంతో పాటు నీళ్లు కూడా రావడం లేదు. ఏసీ ప్లాంట్లలోని కంప్రెషర్లు కూడా రిపేరు చేయాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఏ అంతర్జాతీయ మ్యాచ్‌ నిర్వహించినా హెచ్‌సీఏ ఇన్సూరెన్స్‌ చేస్తుంది. ఒకవేళ వాతావరణం అనుకూలించక, లేదంటే అనివార్య కారణాలతో మ్యాచ్‌ రద్దయితే అభిమానులకు టిక్కెట్‌ సొమ్మును వెనక్కి ఇచ్చేందుకు ఈ ఇన్సూరెన్స్‌ ఉపయోగపడుతుంది. అయితే, ఈసారి ఇన్సూరెన్స్‌ చేయలేదని సమాచారం. ఇదిలా ఉంటే.. అజర్‌ పెద్ద కొడుకు అసదుద్దీన్‌, అతడి భార్య ఆనం మీర్జా అధ్యక్షుడి కార్యాలయంలోనే మకాం వేసి, అన్నీ తమ కనుసన్నల్లో నడిపిస్తున్నారని క్లబ్‌ సెక్రటరీలు విమర్శిస్తున్నారు.


టిక్కెట్ల అమ్మకంతో మాకేం సంబంధం

టిక్కెట్ల విక్రయ బాధ్యతలు పేటీఎంకు ఇచ్చాం. వాళ్లకిచ్చాక టిక్కెట్ల అమ్మకంతో మాకేం సంబంధం ఉంటుంది. బ్లాక్‌ టిక్కెట్ల విక్రయ అంశం మాకు సంబంధం లేనిది. పోలీసులు దానిపై నిఘా పెడతారు. అనవసరంగా హెచ్‌సీఏపై, నాపై కొందరు బురద జల్లుతున్నారు. మేం మ్యాచ్‌ నిర్వహణ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నాం. విమర్శలను పట్టించుకోం. గురువారం జింఖానాలో జరిగిన అపశృతికి చింతిస్తున్నాం. బాధితుల వైద్య ఖర్చులను హెచ్‌సీఏనే భరిస్తుంది.      

మహ్మద్‌ అజరుద్దీన్‌ (హెచ్‌సీఏ అధ్యక్షుడు)


‘మ్యాచ్‌ నిర్వహణలో తలదూర్చం’

హెచ్‌సీఏ వ్యవహారాలను పర్యవేక్షించాల్సిందిగా సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన పర్యవేక్షణ కమిటీ శుక్రవారం వీడియో కాన్ఫెరెన్స్‌లో సమావేశమైంది. ఈ సమావేశంలో కమిటీ సభ్యులైన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు రిటైర్డ్‌ చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌ఏ కక్రూ, తెలంగాణ అవినీతి నిరోధక శాఖ డీజీ అంజనీ కుమార్‌, మాజీ క్రికెటర్‌ వెంకటపతి రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కక్రూ మాట్లాడుతూ మ్యాచ్‌ నిర్వహణ ఏర్పాట్లలో కమిటీ జోక్యం చేసుకోదలచుకోలేదని, ఈ విషయంలో హెచ్‌సీఏకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్టు చెప్పారు. 

Read more