బౌలింగే ఆయుధంగా..

ABN , First Publish Date - 2022-03-23T09:12:58+05:30 IST

ఈ మెగా టీ20 లీగ్‌కు పూర్తిగా కొత్త. అందుకే జట్టును పటిష్టం చేసుకునే ప్రయత్నంలో వేలానికి ముందే ముగ్గురు స్టార్‌ ఆటగాళ్లను కొనుగోలు చేసుకుంది. ముంబై ఇండియన్స్‌

బౌలింగే ఆయుధంగా..

బరిలోకి గుజరాత్‌ టైటాన్స్‌


గుజరాత్‌ టైటాన్స్‌... ఈ మెగా టీ20 లీగ్‌కు పూర్తిగా కొత్త. అందుకే జట్టును పటిష్టం చేసుకునే ప్రయత్నంలో వేలానికి ముందే ముగ్గురు స్టార్‌ ఆటగాళ్లను కొనుగోలు చేసుకుంది. ముంబై ఇండియన్స్‌ నుంచి బయటకు వచ్చిన స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాను రూ.15 కోట్లకు తీసుకున్న యాజమాన్యం టైటాన్స్‌ కెప్టెన్‌గా నియమించింది. అంతేకాకుండా సన్‌రైజర్స్‌ మాజీ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ను రూ.15 కోట్లు, కోల్‌కతాకు ఆడిన శుభ్‌మన్‌ గిల్‌ను రూ.7 కోట్లకు తీసుకుంది. అలాగే ఫిబ్రవరి 13న జరిగిన వేలం లోనూ దూకుడుగా వెళ్లి కివీస్‌ పేసర్‌ లోకీ ఫెర్గూసన్‌ (రూ.10 కోట్లు), రాహుల్‌ తెవాటియా (రూ.9 కోట్లు), షమి (రూ.6.25 కోట్లు)లను భారీ ధరకు కొనుగోలు చేసింది. 


బలం

జట్టు బౌలింగ్‌ స్వరూపం స్థానిక, విదేశీ కలయికతో చక్కగా కుదిరింది. కొన్ని సీజన్లుగా పంజాబ్‌కు షమి కీలక బౌలర్‌గా రాణించాడు. నిలకడగా వికెట్లు తీస్తుండడంతోపాటు పరుగుల్లోనూ పొదుపు పాటిస్తాడు. మిస్టరీ స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ జట్టుకు ప్రత్యేక ఆకర్షణ. విశ్వవ్యాప్త లీగ్‌ల్లో అతడి జోరు సాగుతూనే ఉంది. గంటకు 150కి.మీ వేగంతో బంతులు విసిరే పేసర్‌ ఫెర్గూసన్‌ జట్టు అమ్ముల పొదిలో ప్రధాన బలంగా కనిపిస్తున్నాడు. ఓపెనర్‌ గిల్‌కు పరిస్థితులకు తగ్గట్టుగా ఆట తీరును మార్చుకోగల సత్తా ఉంది.


బలహీనత

బ్యాటింగ్‌ పరంగా జట్టు వెనుకంజలోనే ఉంది. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా క్రికెట్‌ ఆడక చాలా రోజులైంది. అలాగే ఫామ్‌లో లేకపోవడంతో జాతీయ జట్టులోనే చోటు కోల్పోయాడు. దీనికి తోడు గాయాల సమస్య వేధిస్తూనే ఉంటుంది. ఇక మిడిలార్డర్‌లో అనుభవం కలిగిన బ్యాటర్స్‌ లేకపోవడం మరో లోపం. సాహా, మిల్లర్‌, మాథ్యూ వేడ్‌, విజయ్‌ శంకర్‌ ఉన్నా వీరు ఇటీవలి సీజన్‌లలో అద్భుతంగా రాణించిన దాఖలాలు లేవు. అలాగే ఇప్పటివరకు కెప్టెన్‌గా వ్యవహరించని హార్దిక్‌ ఈ క్రేజీ లీగ్‌లో జట్టును ఎలా నడిపిస్తాడనే ఆసక్తి కూడా అందరి మదిలో నెలకొంది.


 జట్టు

స్వదేశీ ఆటగాళ్లు: హార్దిక్‌ (కెప్టెన్‌), గిల్‌, షమి, తెవాటియా, అభినవ్‌, ఆర్‌.సాయి కిశోర్‌, జయంత్‌ యాదవ్‌, విజయ్‌ శంకర్‌, దర్శన్‌ నల్కండే, యాష్‌ దయాల్‌, ప్రదీప్‌ సాంగ్వాన్‌, వృద్ధిమాన్‌ సాహా.

విదేశీ ఆటగాళ్లు: రషీద్‌ ఖాన్‌, ఫెర్గూసన్‌, నూర్‌ అహ్మద్‌, గుర్బాజ్‌, డ్రేక్స్‌, అల్జారి జోసెఫ్‌, మిల్లర్‌.

Read more