అర్ష్‌దీప్‌ అదుర్స్‌

ABN , First Publish Date - 2022-09-29T10:46:50+05:30 IST

పేసర్లు అర్ష్‌దీప్‌ సింగ్‌ (3/32), దీపక్‌ చాహర్‌ (2/24) బంతితో విజృంభించగా.. నూర్యకుమార్‌ యాదవ్‌ (33 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50 నాటౌట్‌), కేఎల్‌ రాహుల్‌

అర్ష్‌దీప్‌ అదుర్స్‌

సత్తా చాటిన చాహర్‌

సూర్య, రాహుల్‌ అర్ధ శతకాలు

తొలి టీ20లో సఫారీలపై  భారత్‌ ఘన విజయం


(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం),తిరువనంతపురం: పేసర్లు అర్ష్‌దీప్‌ సింగ్‌ (3/32), దీపక్‌ చాహర్‌ (2/24) బంతితో విజృంభించగా.. నూర్యకుమార్‌ యాదవ్‌ (33 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50 నాటౌట్‌), కేఎల్‌ రాహుల్‌ (56 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 51 నాటౌట్‌) అర్ధ శతకాలతో రాణించడంతో.. లో స్కోరింగ్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై భారత్‌ విజయం సాధించింది. మూడు టీ20ల సిరీ్‌సలో భాగంగా బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన బోణీ చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 106/8 స్కోరు చేసింది. కేశవ్‌ మహారాజ్‌ (35 బంతుల్లో 41) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. మార్‌క్రమ్‌ (25), పార్నెల్‌ (24) ఆదుకొనే ప్రయత్నం చేశారు. మిగతా భారత బౌలర్లలో హర్షల్‌ పటేల్‌ 2 వికెట్లు తీశాడు. ఛేదనలో భారత్‌ 16.4 ఓవర్లలో 2 వికెట్లకు 110 పరుగులు చేసి గెలిచింది. రబాడ, నోకియా చెరో వికెట్‌ పడగొట్టారు. వెన్ను నొప్పితో ఇబ్బందిపడుతున్న బుమ్రా స్థానంలో దీపక్‌ చాహర్‌ జట్టులోకి వచ్చాడు. అర్ష్‌దీప్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. 


రోహిత్‌ విఫలం..: స్వల్ప లక్ష్య ఛేదనలో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (0)ను టీమిండియా ఆదిలోనే కోల్పోయింది. మరో ఓపెనర్‌ రాహుల్‌, కోహ్లీ విరాట్‌ కోహ్లీ (3) ఆచితూచి ఆడడంతో.. భారత టీ20 చరిత్రలోనే పవర్‌ ప్లేలో అత్యల్పంగా 17/1 స్కోరు చేసింది. కోహ్లీని నోకియా అవుట్‌ చేసినా.. రాహుల్‌తోపాటు ఇన్‌ఫామ్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ మూడో వికెట్‌కు అజేయంగా 93 పరుగుల భాగస్వామ్యంతో జట్టుకు విజయాన్నందించారు. 7వ ఓవర్‌లో నోకియా బౌలింగ్‌లో సూర్య రెండు వరుస సిక్స్‌లతో స్కోరుబోర్డులో కదలిక తెచ్చాడు. మధ్య ఓవర్లలో సౌతాఫ్రికా స్పిన్నర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసినా.. వీరిద్దరూ అవకాశం చిక్కినప్పుడల్లా షాట్లు ఆడుతూ పరుగులు రాబట్టారు. దీంతో 11 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ 53/2తో మెరుగైన స్థితిలో నిలిచింది. షంసీ వేసిన 12వ ఓవర్‌లో రాహుల్‌ సిక్స్‌ బాదగా.. సూర్య బౌండ్రీ కొట్టడంతో మొత్తం 13 పరుగులు లభించాయి. చివరి 30 బంతుల్లో 16 పరుగులు కావాల్సి ఉండగా.. రెండు ఫోర్లతో సూర్య అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. మరోవైపు రాహుల్‌ కూడా సిక్స్‌తో మ్యాచ్‌ను ఫినిష్‌ చేయడంతోపాటు హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకొన్నాడు. 


టప.. టపా..: పేసర్లు అర్ష్‌దీప్‌, దీపక్‌ నిప్పులు చెరగడంతో.. టాస్‌ ఓడి బ్యాటింగ్‌ దిగిన దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ అత్యంత దారుణంగా మొదలైంది. స్కోరు బోర్డుపై పట్టుమని 10 పరుగులు కూడా లేకుండానే 5 కీలక వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కేశవ్‌ మహారాజ్‌ చలవతో వంద పరుగులైనా చేయగలిగింది. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే ఓపెనర్‌ బవుమా (0)ను డకౌట్‌ చేసి చాహర్‌ గట్టి షాకిచ్చాడు. రెండో ఓవర్‌లో అర్ష్‌దీప్‌.. డికాక్‌ (1)తోపాటు రిలీ రోసో (0), మిల్లర్‌ (0)ను అవుట్‌ చేయడంతో.. సౌతాఫ్రికా కోలుకోలేకపోయింది. స్టబ్స్‌ (0)ను దీపక్‌ బోల్తా కొట్టించాడు. ఈ దశలో మార్క్‌క్రమ్‌.. పార్నెల్‌తో కలసి జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశాడు. చాహర్‌ వేసిన 5వ ఓవర్‌ చివరి బంతికి పార్నెల్‌ సిక్స్‌ బాదడంతో.. పవర్‌ప్లే ముగిసేసరికి సౌతాఫ్రికా 30/5తో నిలిచింది. అయితే, మార్‌క్రమ్‌ను హర్షల్‌ ఎల్బీ చేయడంతో.. ఆరో వికెట్‌ 33 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక సఫారీల ఇన్నింగ్స్‌ వేగంగా ముగుస్తుందనుకున్న సమయంలో పార్నెల్‌, కేశవ్‌ జాగ్రత్తగా ఆడడంతో.. 12వ ఓవర్‌లో జట్టు స్కోరు 50 పరుగులకు చేరుకొంది. 16వ ఓవర్‌లో పార్నెల్‌ను అక్షర్‌ అవుట్‌ చేయగా..  కేశవ్‌ 19వ ఓవర్‌లో అర్ష్‌దీప్‌ బౌలింగ్‌లో 4,6,4తో జోరు చూపడంతో స్కోరు వంద దాటింది. 




ఆశాదీపం..


మొన్నటి ఆసియా కప్‌.. నిన్నటి ఆస్ట్రేలియాతో సిరీస్‌.. భారత్‌ను ప్రధానంగా వేధిస్తున్నది డెత్‌ ఓవర్ల బౌలింగ్‌ సమస్య. సీనియర్‌  పేసర్‌ భువనేశ్వర్‌ ధారాళంగా పరుగులు సమర్పించుకోవడం టీ20 వరల్డ్‌ కప్‌ ముందు జట్టు యాజమాన్యాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఈ తరుణంలో యువ పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ రాణిస్తూ జట్టుకు ఆశాదీపంగా నిలుస్తు న్నాడు. పదునైన యార్కర్లతో 23 ఏళ్ల ఈ ఎడమ చేతి వాటం బౌలర్‌ ఐపీఎల్‌ ద్వారా వెలుగులోకి వచ్చాడు. యార్కర్లలో అతడి నైపుణ్యానికి అబ్బురపడిన పంజాబ్‌ కింగ్స్‌ ఎంతో ఒత్తిడితో కూడిన ఫైనల్‌ ఓవర్లలో అర్ష్‌దీప్‌కు బంతి అప్పగించింది. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అతడు సత్తా చాటి ఔరా అనిపించాడు. సింగ్‌ ప్రతిభను గుర్తించిన జాతీయ సెలెక్టర్లు గత జూలైలో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు అతడిని ఎంపిక చేశారు. ఐపీఎల్‌లో మాదిరే ఆ సిరీస్‌లో డెత్‌ ఓవర్లలో అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు.


వర్క్‌లోడ్‌తో ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్న అర్ష్‌దీప్‌.. జాతీయ క్రికెట్‌ అకాడమీలో తన నైపుణ్యాలకు మరింత పదును పెట్టుకున్నాడు. సౌతాఫ్రికాతో సిరీస్‌కు భువనేశ్వర్‌ దూరం కావడంతో జట్టులోకి వచ్చిన అతడు.. తొలి మ్యాచ్‌లోనే తడాఖా చూపాడు. తన ఎడమ చేతి బౌలింగ్‌తో భారత్‌ పేస్‌ విభాగానికి వైవిధ్యం తీసుకొస్తున్న సింగ్‌.. మెగా టోర్నీలో మన తురుపుముక్క కావడం ఖాయం.


స్కోరుబోర్డు

దక్షిణాఫ్రికా: డికాక్‌ (బి) అర్ష్‌దీప్‌ 1, బవుమా (బి) చాహర్‌ 0, రిలీ రోసో (సి) పంత్‌ (బి) అర్ష్‌దీప్‌ 0, మార్‌క్రమ్‌ (ఎల్బీ) హర్షల్‌ 25, మిల్లర్‌ (బి) అర్ష్‌దీప్‌ 0, స్టబ్స్‌ (సి) అర్ష్‌దీప్‌ (బి) చాహర్‌ 0, పార్నెల్‌ (సి) సూర్య (బి) అక్షర్‌ 24, కేశవ్‌ మహారాజ్‌ (బి) హర్షల్‌ 41, రబాడ (నాటౌట్‌) 7, నోకియా (నాటౌట్‌) 2, ఎక్స్‌ట్రాలు: 6, మొత్తం: 20 ఓవర్లలో 106/8. వికెట్ల పతనం: 1-1, 2-1, 3-8, 4-8, 5-9, 6-42, 7-68, 8-101. బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 4-0-24-2, అర్ష్‌దీప్‌ సింగ్‌ 4-0-32-3, అశ్విన్‌ 4-1-8-0, హర్షల్‌ పటేల్‌ 4-0-26-2, అక్షర్‌ పటేల్‌ 4-0-16-1.


భారత్‌: రాహుల్‌ (నాటౌట్‌) 51, రోహిత్‌ (సి) డికాక్‌ (బి) రబాడ 0, కోహ్లీ (సి) డికాక్‌ (బి) నోకియా 3, సూర్యకుమార్‌ (నాటౌట్‌) 50, ఎక్స్‌ట్రాలు: 6, మొత్తం: 16.4 ఓవర్లలో 110/2. వికెట్లపతనం: 1-9, 2-17. బౌలింగ్‌: రబాడ 4-1-16-1, పార్నెల్‌ 4-0-14-0, నోకియా 3-0-32-1, షంసీ 2.4-0-27-0, కేశవ్‌ 3-0-21-0.

Updated Date - 2022-09-29T10:46:50+05:30 IST